సినీజోష్‌ రివ్యూ: విశ్వరూపం 2

Sat 11th Aug 2018 12:45 AM
telugu movie viswaroopam 2,viswaroopam 2 movie review,viswaroopam 2 review in cinejosh,viswaroopam 2 cinejosh review,kamal haasan new movie viswaroopam 2  సినీజోష్‌ రివ్యూ: విశ్వరూపం 2
viswaroopam 2 movie review సినీజోష్‌ రివ్యూ: విశ్వరూపం 2
Sponsored links
సినీజోష్‌ రివ్యూ: విశ్వరూపం 2 Rating: 2.25 / 5

రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌, ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమిటెడ్‌ 

విశ్వరూపం 2 

తారాగణం: కమల్‌ హాసన్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, శేఖర్‌ కపూర్‌, రాహుల్‌ బోస్‌, వహీదా రెహమాన్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: శామ్‌దత్‌ సైనుద్దీన్‌, సను జాన్‌ వర్గీస్‌ 

ఎడిటింగ్‌: మహేష్‌ నారాయణన్‌, విజయ్‌శంకర్‌ 

సంగీతం: మహమ్మద్‌ గిబ్రాన్‌ 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

నిర్మాతలు: ఎస్‌.చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌ 

రచన, దర్శకత్వం: కమల్‌హాసన్‌ 

విడుదల తేదీ: 10-08-2018 

ఒక సినిమా ప్రేక్షకాదరణ పొందాలంటే వారికి నచ్చే అంశాలు తప్పనిసరిగా ఉండాలి. ఒక్కో దర్శకుడికి ఒక్కో విజన్‌ ఉంటుంది. దానికి తగ్గట్టుగానే వారు సినిమాలు రూపొందిస్తుంటారు. ఎవరి విజన్‌ ఎలా ఉన్నా ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకొనే సినిమాలు తియ్యాల్సి ఉంటుంది. అప్పుడే విజయాలు సాధించగలుగుతారు. కొంతమంది దర్శకులకు మంచి విజన్‌ ఉంటుంది. ఆ పరిధిలోనే సినిమాలు చేస్తారు. అవి ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వవు. సినిమా బాగా తీశాడన్న పేరు వస్తుంది తప్ప కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేవు. అలాంటి దర్శకుల్లో కమల్‌హాసన్‌ ఒకరు. ఇంతకుముందు ఆయన డైరెక్ట్‌ చేసిన హేరామ్‌, పోతురాజు వంటి సినిమాలు టేకింగ్‌ పరంగా బాగున్నప్పటికీ ప్రేక్షకాదరణ పొందలేదు. 2013లో కమల్‌హాసన్‌ రూపొందించిన విశ్వరూపం చిత్రం కూడా ఆ తరహా చిత్రమే. విభిన్న కథాంశంతో, టెర్రిజం నేపథ్యంలో ఎంతో వైవిధ్యంగా రూపొందిన ఈ సినిమా ఎన్నో వివాదాల మధ్య విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దానికి కొనసాగింపుగా విశ్వరూపం 2 చిత్రాన్ని చాలా కాలం క్రితమే ప్రారంభించారు. అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పూర్తయి విడుదల కావడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వరూపం 2 ఏమేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఇండియాలో రా ఏజెంట్‌గా ఉన్న విసామ్‌ అహ్మద్‌ కశ్మీరి(కమల్‌హాసన్‌)ను అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ కోసం పాకిస్తాన్‌లో అల్‌ఖైదాలో చేరేలా పథకం వేస్తారు. అలా అల్‌ఖైదాలో చేరిన విసామ్‌ వారు పాల్పడే విధ్వంసాల గురించి ముందుగానే రా కి సమాచారం అందిస్తుంటాడు. అలా కొన్ని దాడుల్ని అడ్డుకోగలుగుతాడు విసామ్‌. ఈ విషయం తెలుసుకున్న అల్‌ఖైదా ఉగ్రవాది ఒమర్‌ ఖురేషి(రాహుల్‌ బోస్‌) విసామ్‌ని అంతం చెయ్యాలనుకుంటాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఓ షిప్‌ మునిగిపోవడం వల్ల అందులోని 1500 టన్నుల ఆయుధాలు సముద్రంలో ఉండిపోతాయి. వాటిని యాక్టివేట్‌ చెయ్యడం ద్వారా పెద్ద సునామీ సంభవించే ప్రమాదం ఉంది. ఆ విధ్వంసాన్ని సృష్టించేందుకు అల్‌ఖైదా పథకం రచిస్తుంది. ఇది తెలుసుకున్న విసామ్‌ ఆ బాంబులు యాక్టివేట్‌ అవ్వకుండా ఆపుతాడు. అలాగే దేశంలోని 64 ప్రాంతాల్లో అత్యంత శక్తివంతమైన బాంబుదాడుల్ని కూడా ప్లాన్‌ చేస్తుంది అల్‌ఖైదా. దాని కూడా అడ్డుకొని ఒమర్‌ ఖురేషిని అంతం చేస్తాడు. దేశాన్ని, తనవాళ్ళని రక్షించుకునే క్రమంలో విసామ్‌ చేసే సాహసాలు ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం. 

నటుడుగా కమల్‌హాసన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పడానికి ఏమీ లేదు. ఏ పాత్రనైనా అవలీల పోషించగల నటుడు కమల్‌. ఈ చిత్రం విషయానికి వస్తే విసామ్‌ పాత్రను ఎంతో అద్భుతంగా చేశాడు. పోరాట సన్నివేశాలు సైతం ఉత్సాహంగా చెయ్యగలిగాడు. అతని భార్యగా పూజాకుమార్‌ తన పాత్ర పరిధి మేరకు బాగానే చేసింది. విసామ్‌ కొలీగ్‌ అస్మితగా ఆండ్రియా పెర్‌ఫార్మెన్స్‌ బాగుంది. ఆమె చేసిన సాహసాలు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. రా ఆఫీసర్‌గా శేఖర్‌ కపూర్‌ ఎంతో డిగ్నిఫైడ్‌గా కనిపించాడు. అల్‌ఖైదా ఉగ్రవాదిగా రాహుల్‌ బోస్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అతను కనిపించిన ప్రతి సీన్‌లోనూ ఎంతో సహజమైన నటనను ప్రదర్శించాడు. విసామ్‌ తల్లిగా వహీదా రెహమాన్‌ కనిపించిన కాసేపు సెంటిమెంటల్‌గా అందర్నీ ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్‌ టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌. శామదత్‌, షనుజాన్‌ వర్గీస్‌ల ఫోటోగ్రఫీ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హాలీవుడ్‌ సినిమాల స్థాయిలో విజువల్స్‌ ఉంటాయి. గిబ్రాన్‌ చేసిన పాటలు అంతగా ఆకట్టుకోకపోయినా నేపథ్య సంగీతం మాత్రం సిట్యుయేషన్స్‌కి తగ్గట్టుగా బాగుంది. సినిమా నిడివి తక్కువే అయినా స్లో నేరేషన్‌ వల్ల రన్‌ టైమ్‌ ఎక్కువనే ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే చాలా సీన్స్‌లో ఎడిటింగ్‌ చాలా ఫాస్ట్‌గా అనిపిస్తుంది. శశాంక్‌ వెన్నెలకంటి రాసిన మాటలు కొన్ని సందర్భాల్లో బాగానే ఉన్నాయనిపించినా, కొన్ని చోట్ల ఇంగ్లీష్‌ డబ్బింగ్‌ సినిమాల మాటల్లా అనిపించాయి. సినిమా నిర్మాణ విలువల గురించి చెప్పాల్సి వస్తే నూటికి నూరు శాతం మార్కులు వెయ్యొచ్చు. కమల్‌ రాసుకున్న కథ, కథనాల ప్రకారం ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ఎంతో రిచ్‌గా సినిమాను తెరకెక్కించారు. ఇక దర్శకుడు కమల్‌హాసన్‌ గురించి చెప్పాల్సి వస్తే.. విశ్వరూపం సినిమా విడుదలై 5 సంవత్సరాలైంది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చిన విశ్వరూపం 2 సగటు ప్రేక్షకులకు అర్థం అయ్యే అవకాశం లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు హీరో ఏం చేస్తున్నాడు? ఎందుకు చేస్తున్నాడు? హీరోపై ఉగ్రవాదులు ఎందుకు దాడి చేస్తున్నారు? అతన్ని ఎందుకు చంపాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలు ప్రేక్షకుల మదిలో మెదులుతూ ఉంటాయి. జరిగేది అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కొంతమందికి అది అర్థం కాదు కూడా. రెండు భాగాల విడుదలకు ఎక్కువ గ్యాప్‌ లేకుండా ఉంటే, కొంతలో కొంత బెటర్‌గా ఉండేదేమో. ముఖ్యంగా మాస్‌ ప్రేక్షకులకు ఈ సినిమా రుచించదు. భాష రాకపోయినా హాలీవుడ్‌ సినిమాల టేకింగ్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ని చూసి ఎంజాయ్‌ చేసే ఆడియన్స్‌కి మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చే అవకాశం ఉంది. ఫైనల్‌గా చెప్పాలంటే కమల్‌హాసన్‌ నటన, టేకింగ్‌, యాక్షన్‌ ఎపిసోడ్స్‌, థ్రిల్‌ చేసే కొన్ని సన్నివేశాలు మినహా విశ్వరూపం 2లో చెప్పుకోదగిన విషయం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: వృధా ప్రయాస

Sponsored links

viswaroopam 2 movie review:

kamal haasan new movie viswaroopam 2

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019