Advertisement

సినీజోష్‌ రివ్యూ: శ్రీనివాస కళ్యాణం

Thu 09th Aug 2018 08:51 PM
telugu movie srinivasa kalyanam,srinivasa kalyanam movie review,srinivasa kalyanam movie reveiw in cinejosh,srinivasa kalyanam cinejosh review,nitin new movie srinivasa kalyanam  సినీజోష్‌ రివ్యూ: శ్రీనివాస కళ్యాణం
srinivasa kalyanam movie review సినీజోష్‌ రివ్యూ: శ్రీనివాస కళ్యాణం
సినీజోష్‌ రివ్యూ: శ్రీనివాస కళ్యాణం Rating: 2.5 / 5
Advertisement

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ 

శ్రీనివాస కళ్యాణం 

తారాగణం: నితిన్‌, రాశిఖన్నా, నందితా శ్వేత, రాజేంద్రప్రసాద్‌, గిరిబాబు, జయసుధ, ప్రకాష్‌రాజ్‌, నరేష్‌, సత్యం రాజేష్‌, ఆమని, విదుల్లేఖా రామన్‌, సితార తదితరులు 

సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి 

ఎడిటింగ్‌: మధు 

సంగీతం: మిక్కీ జె.మేయర్‌ 

నిర్మాతలు: రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌ 

రచన, దర్శకత్వం: సతీష్‌ వేగేశ్న 

విడుదల తేదీ: 09.08.2018 

పెళ్ళి అంటే ఒక ఈవెంట్‌గా భావించే నేటి తరానికి శ్రీనివాస కళ్యాణం చిత్రం ద్వారా పెళ్ళికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో తెలియజెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు సతీష్‌ వేగేశ్న, నిర్మాత దిల్‌రాజు. నితిన్‌, రాశి ఖన్నా జంటగా రూపొందిన ఈ సినిమాని కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. సతీష్‌ వేగేశ్న ఇదే బేనర్‌లో చేసిన శతమానం భవతి క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా విజయం సాధించడమే కాకుండా అవార్డులు కూడా సొంతం చేసుకుంది. పెళ్ళి అనే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాతో దర్శకనిర్మాతలు మరోసారి ప్రేక్షకుల్ని అలరించగలిగారా? దిల్‌ తర్వాత నితిన్‌ ఈ బేనర్‌లో చేసిన ఈ రెండో సినిమా అతనికి ఎలాంటి పేరు తెచ్చింది? అలాగే దర్శకుడు సతీష్‌ వేగేశ్న శతమానం భవతి తరహాలో మరోసారి మ్యాజిక్‌ చెయ్యగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. 

అతని పేరు వాసు(నితిన్‌). ఉద్యోగరీత్యా చండీగఢ్‌లో ఉంటాడు. అతనిది చాలా పెద్ద ఫ్యామిలీ. వారంతా సఖినేటిపల్లిలో ఉంటారు. చిన్నతనంలోనే పెళ్ళి గురించి బామ్మ(జయసుధ) చెప్పిన మాటలు వాసు మనసులో బలంగా నాటుకున్నాయి. చండీగఢ్‌లోనే ఉంటున్న హైదరాబాద్‌ అమ్మాయి శ్రీ అలియాస్‌ శ్రీదేవి(రాశీఖన్నా)తో వాసుకి పరిచయం అవుతుంది. అది ప్రేమగా మారతుంది. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దలంటే గౌరవం ఉన్న వాసు తమ పెళ్ళి విషయాన్ని శ్రీ తండ్రి(ప్రకాష్‌రాజ్‌)తో చెప్తాడు. కోటీశ్వరుడైన శ్రీ తండ్రికి పెళ్ళి అంటే ఒక ఈవెంట్‌ అనే అభిప్రాయం ఉంటుంది. దాని కోసం రోజుల తరబడి టైమ్‌ వేస్ట్‌ చెయ్యకూడదు అనుకుంటాడు. అంతకుముందే అతని పెద్ద కూతురు పెళ్ళి పెటాకులు అవుతుంది. విడాకుల వరకు వచ్చి ఉంటుంది. అలాంటి టైమ్‌లో వాసు, శ్రీల ప్రేమ విషయం తెలుసుకున్న శ్రీ తండ్రి.. వాసుతో ప్రీ మారిటల్‌ అగ్రిమెంట్‌ చేసుకుంటాడు. తన కూతురికి నచ్చకపోతే ఏ క్షణంలోనైనా విడాకులు తీసుకునేందుకు వీలుగా ఉన్న అగ్రిమెంట్‌ అది. దానిమీద సంతకం పెడితే పెళ్ళికి ఒప్పుకుంటానంటాడు. దానికి వాసు ఒక షరతు పెడతాడు. పెళ్ళికి సంబంధించిన పనుల్లో అమ్మాయి తండ్రి చెయ్యాల్సిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి చేయించాలని చెప్తాడు. దానికి అతను ఓకే అంటాడు. అలా వాసు, శ్రీ తండ్రి మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. పెళ్ళి పనులు మొదలవుతాయి. ఆ తర్వాత ఏం జరిగింది. మామా అల్లుళ్లు చివరి వరకు తమ మాట మీద నిలబడ్డారా? ఎలాంటి అవాంతరాలు లేకుండా పెళ్ళి జరిగిందా? పెళ్ళి అంటే మంచి అభిప్రాయం లేని శ్రీ తండ్రి మారాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

వాసుగా నితిన్‌ పెర్‌ఫార్మెన్స్‌ బాగానే ఉంది. అయితే గతంలో నితిన్‌ చేసిన చాలా సినిమాల్లోని క్యారెక్టర్‌లాగే ఈ సినిమాలోనూ అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ఆ మధ్య వచ్చిన అఆ సినిమా గుర్తొస్తుంది. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌కి స్కోప్‌ లేకపోవడం వల్ల సినిమాలో డాన్సులకుగానీ, ఫైట్స్‌కిగానీ ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నితిన్‌ డైలాగ్స్‌కి, అతని లిప్‌ మూమెంట్స్‌కి ఎక్కడా మ్యాచ్‌ అవ్వదు. శ్రీగా నటించిన రాశీఖన్నా క్యూట్‌గా చాలా బాగుంది. అయితే ఆమె క్యారెక్టర్‌ కేవలం పెళ్ళికూతురు వరకే పరిమితమైంది తప్ప ఆమెకు పెర్‌ఫార్మ్‌ చేసే అవకాశాలు చాలా తక్కువగా వచ్చాయి. పైగా ఆమె ప్రతి డైలాగ్‌ చాలా లో వాయిస్‌లో రహస్యం చెప్తున్నట్టుగా అనిపిస్తుంది. కోటీశ్వరుడుగా ప్రకాష్‌రాజ్‌ తనకు కొట్టిన పిండైన క్యారెక్టర్‌తో ఆకట్టుకున్నాడు. వాసు మరదలు పద్మావతి(నందిత శ్వేత)గా నటన బాగుంది. మిగతా క్యారెక్టర్స్‌లో రాజేంద్రప్రసాద్‌, నరేష్‌, జయసుధ, ఆమని, సితార తదితరులు ఫ్యామిలీ మెంబర్స్‌గా ఫర్వాలేదు అనిపించారు. అక్కడక్కడ కామెడీ చేసేందుకు హీరో ఫ్రెండ్స్‌గా సత్యం రాజేష్‌, ప్రవీణ్‌, విద్యులేఖా రామన్‌ ప్రయత్నించారు. నందిత శ్వేత, ప్రభాస్‌ శ్రీను మధ్య వచ్చే సీన్స్‌తో కామెడీ చెయ్యాలని ట్రై చేసినా అంతగా వర్కవుట్‌ అవ్వలేదు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే సమీర్‌రెడ్డి ఫోటోగ్రఫీ అద్భుతమని చెప్పాలి. ప్రతి సీన్‌ని ఎంతో రిచ్‌గా, మరెంతో అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా పెళ్ళి తంతుకి సంబంధించిన సీన్స్‌ అన్నీ ఎంతో కలర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. మిక్కీ జె. మేయర్‌ చేసిన పాటల్లో టైటిల్‌ సాంగ్‌తోపాటు మరో రెండు పాటలు వినసొంపుగా ఉన్నాయి. సిట్యుయేషన్‌కి తగ్గట్టు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా బాగానే చేశాడు. నేరేషన్‌ చాలా స్లోగా ఉండడం వల్ల రెండు గంటల ఇరవై నిమిషాల సినిమా అయినా చాలా లెంగ్తీగా అనిపిస్తుంది. ఈ విషయంలో ఎడిటర్‌ మధుని తప్పుపట్టలేం. ఎ.ఎస్‌.ప్రకాష్‌ ఆర్ట్‌ వర్క్‌ కూడా చాలా రిచ్‌గా ఉంది. వెంకటేశ్వర క్రియేషన్స్‌ ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. పెళ్లి బ్యాక్‌డ్రాప్‌ కావడం వల్ల దానికి కావాల్సినవన్నీ ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా ప్రొవైడ్‌ చేశారు. ఇక దర్శకుడు సతీష్‌ వేగేశ్న గురించి చెప్పాలంటే సంప్రదాయ బద్దంగా పెళ్లి ఎలా చెయ్యాలి అనే ఒక్క లైన్‌తో కథ రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. కోటీశ్వరుడి కూతురు, లక్షాధికారి కొడుకు పెళ్లి చెయ్యాలంటే సహజంగానే రిచ్‌గా ఉంటుంది. దానికి తగ్గట్టుగానే సినిమాలో రిచ్‌ మ్యారేజ్‌ ఎలా చెయ్యాలనేది చూపించాడు. అబ్బాయి తరఫు వాళ్ళకి, అమ్మాయి తరఫు వాళ్ళకి పెళ్ళి విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేనపుడు ప్రీ మారిటల్‌ అగ్రిమెంట్‌ని మధ్యలోకి తీసుకొచ్చి దానితో కాన్‌ఫ్లిక్ట్‌ని క్రియేట్‌ చేయడం కృతకంగా అనిపించిందే తప్ప అది ఒక స్ట్రాంగ్‌ పాయింట్‌ అని ప్రేక్షకులు ఫీల్‌ అయ్యేలా లేదు. పెళ్ళి అంటే మంచి అభిప్రాయం లేని హీరోయిన్‌ తండ్రిని మార్చడమే హీరో ధ్యేయంగా కనిపించింది తప్ప గుండెలు బరువెక్కే విషయం ఏముంది అనిపిస్తుంది. కథలో బలమైన ఎలిమెంట్‌ లేకపోవడం వల్ల నెక్స్‌ట్‌ ఏం జరగబోతోంది అనే క్యూరియాసిటీ ఆడియన్స్‌కి కలగదు. ఫస్ట్‌హాఫ్‌ అంతా ఫ్యామిలీ వాతావరణంలో జరిగే కొన్ని సీన్స్‌, హీరో ఫ్రెండ్స్‌తో కొన్ని సీన్స్‌, హీరో, హీరోయిన్‌ మధ్య కొన్ని సీన్స్‌తో కాలక్షేపం చేసిన తర్వాత సెకండాఫ్‌లో పెళ్ళి పనులతో అసలు కథ ప్రారంభమవుతుంది. క్లైమాక్స్‌లో నితిన్‌ చెప్పిన పెళ్ళి మంత్రాలు, వాటి అర్థాలు ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉన్నాయి. ఆ తర్వాత ప్రకాష్‌రాజ్‌ రియలైజ్‌ అవుతూ చెప్పే డైలాగ్స్‌ మరింత నీరసం తెప్పిస్తాయి. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ సీన్‌ ఎప్పుడు కంప్లీట్‌ అవుతుందా? ఎప్పుడు థియేటర్‌ నుంచి బయట పడదామా? అని ఆడియన్స్‌ ఎదురుచూసే పరిస్థితి ఏర్పడింది. ఫైనల్‌గా చెప్పాలంటే సంప్రదాయ బద్దమైన వివాహం గురించి అందరికీ చెప్పే ప్రయత్నంలో ఓ సినిమాలా కాకుండా టీవీ సీరియల్‌గా సినిమాని నడిపించేశారు. ఏ దశలోనూ మనకు సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలగదు. ఫస్ట్‌హాఫ్‌ కాస్తో కూస్తో ఫన్నీ సీన్స్‌తో సినిమాని నడిపించిన దర్శకుడు సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా పెళ్ళి పనుల్లో నిమగ్నమైపోయి సగటు ప్రేక్షకుడిని పట్టించుకోలేదు. పెళ్ళి పనులు చూస్తూ, హీరో, అతని ఫ్యామిలీ చెప్పే నీతి వాక్యాలు వింటూ కాలక్షేపం చెయ్యాల్సి వచ్చింది. శతమానం భవతి తరహాలో ఒక ఫీల్‌ గుడ్‌ మూవీ చెయ్యాలన్న దర్శకనిర్మాతల ఆలోచన మంచిదే అయినా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో విఫలమయ్యారని చెప్పొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఫలించని ప్రయత్నం

srinivasa kalyanam movie review:

nitin and rashi khanna movie srinivasa kalyanam


Loading..
Loading..
Loading..
advertisement