సినీజోష్‌ రివ్యూ: జై లవ కుశ

Thu 21st Sep 2017 10:09 PM
jai lavakusha movie review,ntr new movie jai lavakusha,jai lavakusha movie review in cinejosh,jai lavakusha cinejosh review,rashi kanna in jai lavakusha,bobby directed movie jai lavakusha  సినీజోష్‌ రివ్యూ: జై లవ కుశ
jai lavakusha movie review సినీజోష్‌ రివ్యూ: జై లవ కుశ
Sponsored links
సినీజోష్‌ రివ్యూ: జై లవ కుశ Rating: 2.75 / 5
నందమూరి తారకరామారావు ఆర్ట్స్‌ 
జై లవ కుశ 
తారాగణం: ఎన్టీఆర్‌(త్రిపాత్రాభినయం), రాశి ఖన్నా, నివేదా థామస్‌, సాయికుమార్‌, పోసాని, రోనిత్‌ రాయ్‌, బ్రహ్మాజీ, నందితారాజ్‌, హంసానందిని, ప్రియదర్శి, అభిమన్యు సింగ్‌, హరీష్‌ ఉత్తమన్‌, తమన్నా(స్పెషల్‌ సాంగ్‌) తదితరులు 
సినిమాటోగ్రఫీ: ఛోటా కె.నాయుడు 
సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు 
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తి 
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్‌ 
కథ, మాటలు, దర్శకత్వం: కె.ఎస్‌.బాబీ 
విడుదల తేదీ: 21.09.2017 
ఒక సినిమాలో ఒకే నటుడు రెండు లేదా అంతకంటే ఎక్కువ పాత్రలు చేయడం అనేది పాతతరం సినిమాల్లో ఎక్కువగా చూసేవాళ్ళం. ఈమధ్య ఒక నటుడు రెండు పాత్రలు చేయడం చాలా సినిమాల్లో చూశాం. గతంలో ఎన్‌.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వంటి నటులు ఐదు పాత్రలు, తొమ్మిది పాత్రలు చేశారు. ఇటీవలి కాలంలో ఒకే సినిమాలో పది పాత్రలు చేసిన నటుడు కమల్‌హాసన్‌. దశావతారం చిత్రంలో పది పాత్రలు పోషించి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచిని బట్టి రెండు కంటే ఎక్కువ పాత్రల్లో నటించి మెప్పించడం అనేది సాధ్యమయ్యే విషయం కాదు. అయితే జూనియర్‌ ఎన్టీఆర్‌ ఆ అసాధ్యాన్ని జై లవ కుశ చిత్రంలో సుసాధ్యం చేసి చూపించాడు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ బేనర్‌పై నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మించి ఈ చిత్రంలో తొలిసారి నటించాడు ఎన్టీఆర్‌. కె.ఎస్‌.బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జై, లవకుమార్‌, కుశ పాత్రల రూపకల్పనలో బాబీ ఎంతవరకు సక్సెస్‌ అయ్యాడు? ఆయా పాత్రల్ని ఎన్టీఆర్‌ సమర్థవంతంగా పోషించగలిగాడా? ఎన్టీఆర్‌ని మూడు క్యారెక్టర్లలో కొత్తగా చూపించేందుకు బాబీ ఎంచుకున్న కథాంశం ఏమిటి? ఈ కథ, ఎన్టీఆర్‌ చేసిన మూడు క్యారెక్టర్లు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్‌ అయ్యాయి? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 
జై, లవ, కుశ ఒకే పోలికలతో పుడతారు. వారిలో పెద్దవాడైన జైకి మాటలు ఉచ్ఛరించడంలో లోపం వుంటుంది. మేనమామ(పోసాని) ఆధ్వర్యంలో నడిచే నాటక పరిషత్‌లో ఈ ముగ్గురూ నాటకాలు వేస్తుంటారు. అయితే జైకి వున్న లోపం వల్ల డైలాగ్స్‌ లేని క్యారెక్టర్లు మాత్రమే ఇస్తాడు మేనమామ. లవ, కుశలను ఎంకరేజ్‌ చేస్తుంటాడు. తనని పక్కన పెట్టిన మేనమామపై, లవ, కుశలపై చిన్నతనం నుంచే ద్వేషం పెంచుకుంటాడు జై. ఆ కోపంతోనే నాటకం జరుగుతుండగా గ్యాస్‌ లీక్‌ చేసి స్టేజ్‌కి నిప్పంటిస్తాడు. అప్పుడు జరిగిన ప్రమాదంలో ముగ్గురు అన్నదమ్ములు విడిపోతారు. కట్‌ చేస్తే ఇరవై ఏళ్ళ తర్వాత కుశ దొంగగా ప్రత్యక్షమవుతాడు. లవకుమార్‌ బ్యాంక్‌ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. తన మంచితనాన్ని అలుసుగా తీసుకొని కొన్ని అసాంఘిక శక్తులు బ్యాంక్‌ నుంచి లోన్‌ తీసుకొని ఎగ్గొడతారు. ఈ విషయంలో బ్యాంక్‌ ఉన్నతాధికారులు లోన్‌ తాలూకు డబ్బు చెల్లించకపోతే ఉద్యోగం నుంచి తీసేస్తామంటారు. మరోపక్క తను ప్రేమించిన అమ్మాయి తిరస్కరిస్తుంది. ఈ బాధల్లో వున్న లవకు కుశ యాక్సిడెంటల్‌గా కలుస్తాడు. లవకుమార్‌గా బ్యాంక్‌కి వెళ్ళి సమస్య పరిష్కరిస్తానని కుశ చెప్పడంతో ఒప్పుకుంటాడు. కానీ, కుశ బ్యాంక్‌కి వెళ్ళేది తన దగ్గర వున్న 5 కోట్ల రూపాయల పాత కరెన్సీని మార్చుకోవడానికని లవకు తెలీదు. అలా వెళ్ళిన కుశ కరెన్సీని మార్చుకొని వెళ్లిపోతాడు. కరెన్సీని మార్చిన నేరం కింద పోలీసులు లవకుమార్‌ని అరెస్ట్‌ చేస్తారు. అతన్ని సరాసరి కుశ దగ్గరికి తీసుకెళ్తారు పోలీసులు. అయితే వాళ్ళు నిజమైన పోలీసులు కాదు. జై పంపిన మనుషులు. లవకుమార్‌ ప్రేయసి, కుశ కాజేసిన ఐదు కోట్లు జై ఆధీనంలో వుంటాయి. లవ, కుశలను జై దగ్గరికి తీసుకెళ్తారు. అన్నయ్యను చూసి ఇద్దరూ సంతోషపడతారు. కానీ, జై మాత్రం వారిపై అదే ద్వేషంతో వుంటాడు. తనలాగే వున్న ఇద్దరూ ఒక పని చేస్తే లవ ప్రేయసిని, కుశ డబ్బుని ఇచ్చేస్తానంటాడు. జై వాళ్ళిద్దరికీ అప్పగించిన పనేమిటి? తమని ద్వేషించే అన్నయ్యని చూసి లవ, కుశ ఎలా రియాక్ట్‌ అయ్యారు? తమ పొరపాటు వల్లే జై తమని ద్వేషిస్తున్నాడని తెలుసుకున్న లవ, కుశ అతన్ని మార్చడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? చివరికి జై తన తమ్ముళ్ళను అక్కున చేర్చుకున్నాడా? అనేది మిగతా కథ. 
జైగా, లవకుమార్‌గా, కుశగా మూడు పాత్రల్లో ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా వుంది. క్రూరంగా వుండే జై క్యారెక్టర్‌లోని వేరియేషన్స్‌ని పెర్‌ఫెక్ట్‌గా చూపించాడు. ఉచ్ఛారణ లోపం వున్న వ్యక్తిగా పూర్తి స్థాయి నటనను ప్రదర్శించాడు. అమాయకుడుగా, మంచితనానికి పోయి కష్టాలు తెచ్చుకునే లవకుమార్‌ క్యారెక్టర్‌ని అంతే ఇన్నోసెంట్‌గా పోషించాడు. అలాగే దొంగతనాలు చేస్తూ అందరికీ మస్కా కొట్టే క్యారెక్టర్‌లో అంతే చలాకీగా కనిపించాడు. ఎమోషనల్‌ సీన్స్‌లో, క్రూరత్వంతో కూడిన ఎక్స్‌ప్రెషన్స్‌లో ఎన్టీఆర్‌ నటన సూపర్బ్‌ అనిపించింది. డిఫరెంట్‌ స్టెప్స్‌తో డాన్సులు ఇరగదీశాడు. ఎన్టీఆర్‌ వేసిన స్టెప్పులు అభిమానులతో స్టెప్స్‌ వేయిస్తాయనడంలో సందేహం లేదు. హీరోయిన్‌ రాశిఖన్నా తన గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు ప్రాధాన్యం తక్కువ. మరో హీరోయిన్‌ నివేదా థామస్‌ క్యారెక్టర్‌కి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇవ్వలేదు. సినిమాకి అవసరం లేకపోయినా స్పెషల్‌ సాంగ్‌లో తమన్నా చేసిన డాన్స్‌, ఎక్స్‌పోజింగ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. సాయికుమార్‌, పోసాని తమ క్యారెక్టర్ల పరిధిమేరకు ఫర్వాలేదు అనిపించారు. సినిమా మొత్తంలో ఎక్కువగా కనిపించేది జై, లవ, కుశ క్యారెక్టర్లే కావడంతో మిగతా నటీనటులకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. 
సినిమాని ఆద్యంతం అందంగా కలర్‌ఫుల్‌గా చూపించడంలో ఛోటా కె.నాయుడు హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. ముఖ్యంగా పాటల్లో ఫైట్స్‌లో తన పనితనం కనిపిస్తుంది. ఎన్టీఆర్‌ ఇంట్రడక్షన్‌ సాంగ్‌, ఎన్టీఆర్‌, రాశి ఖన్నాపై తీసిన సాంగ్స్‌లో ఛోటా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. పాటల పరంగా దేవిశ్రీప్రసాద్‌ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. రావణా... పాట తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ సాంగ్‌ లేదు. అన్నీ దేవి చేసిన పాత పాటల్లాగే అనిపించాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగా చేశాడు. ముఖ్యంగా జై క్యారెక్టర్‌ ఎంటర్‌ అయిన తర్వాత తన మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేశాడు దేవి. కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు ఎడిటింగ్‌ కూడా బాగుంది. డైరెక్టర్‌ బాబీ గురించి చెప్పాలంటే మూడు క్యారెక్టర్లను బ్యాలెన్స్‌ చేస్తూ కథను రాసుకోవడం పెద్ద సాహసమనే చెప్పాలి. దాన్ని పెర్‌ఫెక్ట్‌గా స్క్రీన్‌పై చూపించడంలో కొంతవరకు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఫస్ట్‌హాఫ్‌ని స్పీడ్‌గా నడిపించిన బాబీ సెకండాఫ్‌కి వచ్చేసరికి కొన్ని అనవసరమైన సీన్స్‌తో సినిమా స్పీడ్‌ని తగ్గించాడు. సెకండాఫ్‌లో ముగ్గురితో చేసిన నాటకంలో అన్నయ్యపై తమ్ముళ్ళకు వున్న ప్రేమను తెలిపేదే అయినా అది అంతగా ఆకట్టుకోలేదు. సెకండాఫ్‌లో పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో చేసిన సీన్స్‌ అన్నీ సినిమాకి అనవసరం అనిపిస్తాయి. అన్నయ్యని మార్చే ప్రయత్నంలో అతను పెళ్ళి చేసుకోవాలనుకున్న అమ్మాయిని ప్రేమిస్తున్నట్టుగా నటించి నిజంగానే తమ్ముడు ప్రేమించడం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి తమ్ముళ్ళపై ద్వేషం తప్ప ప్రేమ చూపించని అన్నయ్య గురించి తమ్ముళ్ళు గొప్పగా చెప్పడం, తమపై విపరీతమైన ప్రేమను చూపించేవాడని చెప్పడం కూడా అసహజంగా అనిపిస్తుంది. తమ్ముళ్ళను రక్షించడం కోసం జై తన ప్రాణాలను ఫణంగా పెట్టడం క్లైమాక్స్‌గా చూపించారు. అయితే ఎంతమందినైనా తన కండబలంతో మట్టి కరిపించగల కుశ క్లైమాక్స్‌లో అన్నయ్యను రక్షించుకునే ప్రయత్నం చెయ్యకపోవడం విచిత్రంగా అనిపిస్తుంది. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ ఫర్వాలేదు. అవసరానికి మించి ఎక్కడా ఖర్చుపెట్టలేదనేది అర్థమవుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే జై లవ కుశ చిత్రంలో ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌ గురించి తప్ప చెప్పుకోవాల్సిన విశేషాలు ఏమీ లేవు. ఫస్ట్‌హాఫ్‌లో రాశిఖన్నా, ఎన్టీఆర్‌ లవ్‌ ట్రాక్‌ తప్ప మిగతా అంతా స్పీడ్‌గానే అనిపిస్తుంది. సెకండాఫ్‌కి వచ్చేసరికి జైని ఎలివేట్‌ చేసే సీన్స్‌, పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌కి వెళ్ళడం, కథని క్లైమాక్స్‌కి తీసుకు రావడంలో చేసిన తాత్సారం, పాటలు సినిమాకి మైనస్‌ అయ్యాయి. ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌ కోసం మాత్రమే ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమా అభిమానుల్ని ఆద్యంతం ఆకట్టుకునే అవకాశం వుంది. 
ఫినిషింగ్‌ టచ్‌: ఎన్టీఆర్‌ పెర్‌ఫార్మెన్స్‌కి జై కొట్టాల్సిందే!
Sponsored links

jai lavakusha movie review:

telugu movie jai lavakusha reivew 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019