సినీజోష్‌ రివ్యూ: జయ జానకి నాయక

Fri 11th Aug 2017 10:30 PM
telugu movie jayajanaki nayaka,jayajanaki nayaka movie review,bellamkonda sai srinivas movie jayajanaki nayaka,jayajanaki nayaka cinejosh review,jayajanaki nayaka review in cinejosh  సినీజోష్‌ రివ్యూ: జయ జానకి నాయక
JAYA JANAKI NAYAKA REVIEW సినీజోష్‌ రివ్యూ: జయ జానకి నాయక
Sponsored links
సినీజోష్‌ రివ్యూ: జయ జానకి నాయక Rating: 2.75 / 5

ద్వారక క్రియేషన్స్‌ 

జయ జానకి నాయక 

తారాగణం: బెల్లంకొండ శ్రీనివాస్‌, జగపతిబాబు, శరత్‌కుమార్‌, ఆది పినిశెట్టి, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రగ్యాజైస్వాల్‌, కేథరిన్‌ త్రెస తదితరులు 

సినిమాటోగ్రఫీ: రిషి పంజాబీ 

సంగీతం: దేవిశ్రీప్రసాద్‌ 

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు 

మాటలు: ఎం.రత్నం 

సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి 

నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి 

రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను 

విడుదల తేదీ: 11.08.2017 

నాలుగు ఫైట్లు, నాలుగు పాటలు, వీటితోపాటు రన్‌ అయ్యే కామెడీ ట్రాక్‌ వుంటే చాలు కథ లేకపోయినా సినిమా హిట్‌ అయిపోతుందని భావించే దర్శకనిర్మాతలు వున్నంత కాలం రొటీన్‌ చిత్రాలకు కొదవే వుండదు. పైన చెప్పుకున్న ఎలిమెంట్స్‌నే నమ్ముకొని కథ అనేది నామ మాత్రంగా కూడా లేకుండా భారీ సినిమా తియ్యొచ్చని జయజానకి నాయక చిత్రంతో బోయపాటి శ్రీను ప్రూవ్‌ చేశాడు. అల్లుడు శీను చిత్రంతో హీరోగా పరిచయమైన బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆ తర్వాత రెండో సినిమాగా స్పీడున్నోడు చిత్రం చేశాడు. ఈ రెండు సినిమాలతో హీరోగా ఫర్వాలేదు అనిపించుకున్నాడు శ్రీనివాస్‌. కొత్త హీరో అయినప్పటికీ అతను చేసే సినిమాలన్నీ భారీ బడ్జెట్‌తో చేసే సినిమాలే కావడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్‌ చేసిన మూడో సినిమా జయజానకి నాయక. ఈ చిత్రాన్ని స్టార్‌ హీరోల చిత్రాలను డైరెక్ట్‌ చేసే బోయపాటి శ్రీను దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌కి హీరోగా ఎలాంటి ఇమేజ్‌ని తీసుకొచ్చింది? పెద్ద హీరోలతో పవర్‌ఫుల్‌ యాక్షన్‌ మూవీస్‌ చెయ్యడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను.. బెల్లంకొండ శ్రీనివాస్‌కి కొత్త ఇమేజ్‌ని క్రియేట్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడా? జయజానకి నాయక చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం ఏమిటి? టైటిల్‌కి డైరెక్టర్‌ ఇచ్చిన జస్టిఫికేషన్‌ ఏమిటి? స్టార్‌ హీరోల సినిమాలకు తీసిపోని విధంగా భారీ బడ్జెట్‌తో నిర్మించిన మిర్యాల రవీందర్‌రెడ్డికి కమర్షియల్‌గా ఈ సినిమాగా ఏ రేంజ్‌ విజయాన్ని అందించింది? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ గురించి ఒక్క లైన్‌ కూడా రాయలేని విధంగా ఈ సినిమా కథను రాసుకున్నాడు బోయపాటి శ్రీను. ఇందులో క్యారెక్టరైజేషన్స్‌ మాత్రమే కనబడతాయి తప్ప కథ అనేది కాగడా పెట్టి వెతికినా దొరకదు. బోయపాటి కథగా అనుకుంటున్న ఈ కథకి భారీ బడ్జెట్‌తో సినిమా తియ్యాల్సిన పనిలేదు. అది నిర్మాతకు భారంగా మారుతుందే తప్ప ఒక శాతం కూడా ఉపయోగం లేదు. క్యారెక్టర్స్‌ గురించి చెప్పుకోవాలంటే చక్రవర్తి(శరత్‌కుమార్‌) పెద్ద బిజినెస్‌ మేన్‌. అతని ఇద్దరు కొడుకుల్లో ఒకడు గగన్‌(బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌). కోటీశ్వరులైన ఈ తండ్రీ కొడుకులు ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి ఆయుధాలతో వాలిపోతారు. దుష్టులను తరిమి కొడతారు. సాయంత్రం కాగానే మూడు ఫుల్‌ బాటిల్స్‌ లాగించేసి రోడ్డు పక్కన అమ్మే మిరపకాయ బజ్జీలతో డిన్నర్‌ కానిచ్చేస్తారు. మరో పక్క జగపతిబాబు కూడా పెద్ద బిజినెస్‌మేన్‌. హత్యలు చేయడం అంటే సిగరెట్‌ కాల్చినంత సులువు అతనికి. కూతురు ఎంగేజ్‌మెంట్‌లో పెళ్ళికొడుకు చూపించిన వీడియోలో తన కూతురు వేరే వాడితో కలిసి వుండటం చూస్తాడు. ఆ వీడియో చూపించిన పెళ్ళికొడుకుని రాత్రికి రాత్రే చంపించేస్తాడు. తన పరువు తీసిన కూతురు ఆత్మహత్య చేసుకునేలా చేస్తాడు. మరోపక్క అర్జున్‌ పవార్‌ అనే విలన్‌ జగపతిబాబు బిజినెస్‌కి అడ్డు తగులుతుంటాడు. దాన్ని పర్సనల్‌గా తీసుకొని జగపతిబాబుని చంపాలని సినిమా ఎండ్‌ అయ్యే వరకు ప్రయత్నిస్తూనే వుంటాడు. ఇక హీరో గురించి చెప్పాలంటే నోటి నుంచి మాట అనేది రాదు. మనిషిలో హుషారనేది నామమాత్రంగా కూడా కనిపించదు. కానీ, డాన్సుల్లో మాత్రం అవసరానికి మించిన ఉత్సాహం కనబరుస్తాడు. హీరోయిన్‌ స్వీటీ(రకుల్‌ ప్రీత్‌ సింగ్‌) హీరో ఫ్యామిలీని ఒక దారికి తేవడానికి కంకణం కట్టుకుంది. ఆ విధంగా వారికి దగ్గరవుతుంది. అయితే అనుకోకుండా గగన్‌ వైజాగ్‌ వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఈ గ్యాప్‌లో స్వీటీకి వేరే వాడితో పెళ్ళయిపోతుంది. అప్పటి నుంచి ఆమెకు సమస్యలు మొదలవుతాయి. వాటిని హీరో తన నెత్తిన వేసుకొని ఐదు నిముషాలకు ఒకసారి భారీగా ఫైట్స్‌ చేస్తుంటాడు. ఇక సినిమా స్టార్ట్‌ అయిన దగ్గర నుంచి ఎండ్‌ అయ్యే వరకు కొత్త కొత్త క్యారెక్టర్స్‌ వస్తూనే వుంటాయి. కానీ, కథ ఏమిటనేది ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు. తలా తోక లేని సన్నివేశాలు వేటికవే అన్నట్టుగా వచ్చి పోతుంటాయి. మధ్య మధ్యలో విసిగించడానికి అన్నట్టు పాటలు వచ్చి పడుతుంటాయి. ఇవి చాలవన్నట్టు ప్రతి క్యారెక్టర్‌ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తుంటాయి. రెండున్నర గంటల సినిమాలో ఒక్క కమెడియన్‌ కూడా కనిపించడు. ఒక్క కామెడీ సీన్‌ కూడా వుండదు. క్యారెక్టర్స్‌ మధ్య నడిచే సెంటిమెంట్స్‌లో ఏ ఒక్కటీ ఆడియన్స్‌ కన్విన్స్‌ అయ్యేలా వుండదు. ఇలా ఈ సినిమా గురించి చెప్పుకుంటూ పోతే అన్నీ లొసుగులే తప్ప విషయం ఏమీ కనిపించదు. సినిమా చూస్తున్నంత సేపు ఏ దశలోనూ నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కుతూహలం ఏ ఒక్కరిలోనూ కనిపించదు. 

సాంకేతిక విభాగాలకు వస్తే రిషీ పంజాబీ ఫోటోగ్రఫీ చాలా రిచ్‌గా అనిపిస్తుంది. రిషీ తీసుకున్న స్పెషల్‌ కేర్‌ ప్రతి సీన్‌లో, ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లలోగానీ, పాటల్లోగానీ ఫోటోగ్రఫీ ఆకట్టుకునేలా వుంది. కథ, కథనాల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేకపోయినా ఫోటోగ్రఫీ మాత్రం బాగుంది అనిపిస్తుంది. దేవిశ్రీప్రసాద్‌ మ్యూజిక్‌ గురించి చెప్పుకోవాలంటే ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా చెయ్యలేకపోయాడు. దానికి తగ్గట్టుగానే పాటల చిత్రీకరణ కూడా బాగా లేదు. పాటలు వచ్చినపుడు థియేటర్‌ బయటికి వెళ్ళిపోయే ప్రేక్షకుల సంఖ్య ఈ సినిమాకి ఎక్కువగానే కనిపించింది. కథలోగానీ, కథనంలోగానీ బలం లేకపోవడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకోదు. ఎడిటింగ్‌ కూడా అంతంత మాత్రంగానే వుంది. నిర్మాత ఈ సినిమా కోసం అవసరానికి మించి బడ్జెట్‌ పెట్టాడనిపిస్తుంది. నిజానికి ఇలాంటి కథకు అంత బడ్జెట్‌ అవసరం లేదు. డైరెక్టర్‌ బోయపాటి శ్రీను గురించి చెప్పాలంటే సినిమా మొదలైనప్పటి నుంచి అతని ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ ప్రతి సీన్‌లో కనిపిస్తుంది. ప్రతి సీన్‌ క్లైమాక్స్‌లా వుంటుంది అని దేశముదురు కామెడీ ట్రాక్‌లో ఆలీ చెప్పాడు. ఈ సినిమాలో దాన్ని స్క్రీన్‌ మీద చూపించాడు బోయపాటి. ప్రతి సీన్‌ క్లైమాక్స్‌లా వుంటూ సినిమా అయిపోయిందన్న ఫీల్‌ కలుగుతుంది. అలాగే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌లో వచ్చే ఫైట్‌ కూడా క్లైమాక్స్‌ని తలపిస్తుంది. అక్కడితో ఒక సినిమా అయిపోయిందనిపిస్తుంది. కథ లేకపోవడం వల్ల ప్రేక్షకులకు ఏ మాత్రం కనెక్ట్‌ అవ్వని క్యారెక్టర్స్‌తో మెప్పించాలని చూశాడు. భారీ ఫైట్స్‌ వుంటే చాలు జనానికి ఎక్కేస్తుందనుకున్నాడు. పైగా జయజానకి నాయక అనే టైటిల్‌కి జస్టిఫికేషన్‌ అనేది లేకుండా క్లైమాక్స్‌లో ఆర్టిస్టులతో జయజానకి నాయక అనిపించేసి చేతులు దులుపుకున్నాడు. ఫైనల్‌గా చెప్పాలంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అయితే ఆ అంచనాలను కనుచూపు మేరలో అందుకోలేకపోయాడు బోయపాటి. ఈ సినిమాకి ప్లస్‌ల కంటే మైనస్‌లే ఎక్కువగా వున్నాయి. యాక్షన్స్‌ సీన్స్‌ దండిగా వున్నాయి కాబట్టి బి, సి సెంటర్స్‌లో ఈ సినిమా ఆడేస్తుందనుకోవడం అత్యాశే అవుతుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: విషయం తక్కువ.. బిల్డప్‌ ఎక్కువ!

Sponsored links

JAYA JANAKI NAYAKA REVIEW:

boyapati srinu new movie jaya janaki nayaka

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019