Advertisement

సినీజోష్‌ రివ్యూ: కిట్టు ఉన్నాడు జాగ్రత్త

Sat 04th Mar 2017 05:40 PM
telugu movie kittu unnadu jagrattha,kittu unnadu jagrattha movie review,kittu unnadu jagrattha review in cinejosh,kittu unnadu jagrattha cinejosh review,raj tarun new movie kittu unnadu jagrattha  సినీజోష్‌ రివ్యూ: కిట్టు ఉన్నాడు జాగ్రత్త
సినీజోష్‌ రివ్యూ: కిట్టు ఉన్నాడు జాగ్రత్త
Advertisement

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌ 

కిట్టు ఉన్నాడు జాగ్రత్త 

తారాగణం: రాజ్‌ తరుణ్‌, అను ఇమ్మానుయేల్‌, అర్భాజ్‌ ఖాన్‌, నాగబాబు, రఘుబాబు, పృథ్వీ, ప్రవీణ్‌, వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, రాజా రవీంద్ర, సమీర్‌, హంసా నందిని, ప్రభాకర్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్‌ 

సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ 

కథ: శ్రీకాంత్‌ విస్సా 

మాటలు: సాయిమాధవ్‌ బుర్రా 

నిర్మాత: సుంకర రామబ్రహ్మం 

రచన, దర్శకత్వం: వంశీకృష్ణ ఎన్‌. 

విడుదల తేదీ: 03.03.2017 

కిడ్నాప్‌ ప్రధాన కథా వస్తువుగా తీసుకొని ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఏ సినిమాకి ఆ సినిమాయే అన్నట్టు ఒక్కో కిడ్నాప్‌ వెనుక ఒక్కో కథ వుంటుంది. రాజ్‌ తరుణ్‌ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్రంలో మాత్రం ఓ కొత్త తరహా కిడ్నాప్‌ని ఎంచుకున్నారు. మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో వంశీకృష్ణ రూపొందించిన దొంగాట కూడా కిడ్నాప్‌ కథే. ఆ సినిమా అంతగా వర్కవుట్‌ అవ్వకపోయినా మళ్ళీ అదే పాయింట్‌ని తీసుకొని ఈ చిత్రాన్ని చేశాడు. రాజ్‌తరుణ్‌కి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ వుంది. వంశీకృష్ణ దాన్ని ఎలా ఉపయోగించుకున్నాడు? రాజ్‌తరుణ్‌కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? ప్రేక్షకుల్ని ఈ సినిమా ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగిందా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి స్నేహితులతో కలిసి కార్‌ మెకానిక్‌ షాప్‌ పెట్టుకున్న కిట్టు(రాజ్‌తరుణ్‌) ఓ గూండా దగ్గర పెద్ద మొత్తంలో అప్పు చేస్తాడు. ఆ డబ్బుకి వడ్డీ కట్టేందుకు సైడ్‌ బిజినెస్‌లా డబ్బున్నవారి కుక్కల్ని కిడ్నాప్‌ చేసి ఎంతో కొంత లాగుతుంటాడు. హీరోకి హీరోయిన్‌ వుండాలి కాబట్టి జానకి(అను ఇమ్మానుయేల్‌)ని ప్రేమిస్తాడు. ఆమె ఇన్‌కం టాక్స్‌ ఆఫీసర్‌ ఆదిత్య నారాయణ(నాగబాబు) కూతురు. జానకి కూడా అతన్ని ప్రేమిస్తుంది. కిట్టు కుక్కల్ని కిడ్నాప్‌ చేస్తాడని తెలియడంతో వాళ్ళ లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. జానకి తనని ప్రేమించాలంటే కుక్కల్ని కిడ్నాప్‌ చెయ్యడం ఆపెయ్యాలని డిసైడ్‌ అయిన కిట్టు ఒకే ఒక్క పెద్ద కిడ్నాప్‌ చేసేసి అప్పు తీర్చెయ్యాలనుకుంటాడు. జానకి కుక్కతో బయటికి వస్తుంది. ఆ టైమ్‌లో వెనక నుండి వెళ్ళి కుక్కను కిడ్నాప్‌ చేసేస్తాడు కిట్టు. అతను వెళ్ళిన మరుక్షణమే జానకిని మాఫియా డాన్‌ ఎఆర్‌(అర్భాజ్‌ ఖాన్‌) మనుషులు కిడ్నాప్‌ చేస్తారు. కిడ్నాప్‌ చేసిన కుక్కతో తనకు కావాల్సిన డబ్బుని కిట్టు పొందగలిగాడా? జానకిని కిడ్నాప్‌ చేసిందెవరు? ఎఆర్‌కి, ఆదిత్య నారాయణకి వున్న శతృత్వం ఏమిటి? ఎఆర్‌ బారి నుంచి జానకిని కిట్టు కాపాడుకోగలిగాడా? ఈ కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి కథ ఎలా సుఖాంతమైంది? అనేది తెరపై చూడాల్సిందే. 

తనకు సూట్‌ అయ్యే కథల్ని, క్యారెక్టర్లను చేసుకుంటూ వెళ్తున్న రాజ్‌ తరుణ్‌కి కిట్టు క్యారెక్టర్‌ కూడా పర్‌ఫెక్ట్‌గా సూట్‌ అయ్యింది. ఎప్పటిలాగే తన క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాడు. హీరోయిన్‌ అను ఇమ్మానుయేల్‌ స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపించింది. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా ఆమెకు తక్కువ మార్కులే పడతాయి. విలన్‌గా అర్భాజ్‌ఖాన్‌, పోలీస్‌ ఆఫీసర్‌గా రాజా రవీంద్ర, ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌గా నాగబాబు నటన సాధారణంగానే వుంది. కమెడియన్స్‌ విషయానికి వస్తే పృథ్వీ మరోసారి ఓ కొత్త క్యారెక్టర్‌లో అందర్నీ నవ్వించాడు. నిసిమా బాబాగా రఘుబాబు సినిమా డైలాగులతో కామెడీ తెప్పించాడు. సుదర్శన్‌, ప్రవీణ్‌ అడపా దడపా కొన్ని జోకులు పేల్చారు. 

సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే రాజశేఖర్‌ ఫోటోగ్రఫీ ఏవరేజ్‌గా వుంది. అతని ఫోటోగ్రఫీలో ఎక్కడా రిచ్‌నెస్‌ అనేది కనిపించలేదు. చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమా చేసిన అనూప్‌ రూబెన్స్‌ తన పాటలతో గానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో గానీ ఆకట్టుకోలేకపోయాడు. ఎం.ఆర్‌.వర్మ ఎడిటింగ్‌ ఫర్వాలేదు అనిపించింది. శ్రీకాంత్‌ విస్సా రాసుకున్న కథలో కుక్కల కిడ్నాప్‌తో పాటు హీరోయిన్‌ కిడ్నాప్‌ని కూడా జోడించి రెండింటి మధ్య కన్‌ఫ్యూజన్‌ క్రియేట్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడు. సాయిమాధవ్‌ బుర్రా రాసిన డైలాగుల్లో కామెడీ డైలాగ్స్‌ బాగా పేలాయి. శ్రీకాంత్‌ కథకి వంశీకృష్ణ రాసుకున్న స్క్రీన్‌ప్లే బాగుంది. అయితే అది ఫస్ట్‌ హాఫ్‌ వరకే పరిమితమైపోయింది. ఫస్ట్‌హాఫ్‌ని మంచి గ్రిప్‌తో రన్‌ చేసిన వంశీ సెకండాఫ్‌కి వచ్చే సరికి కథకి అవసరం లేని రఘుబాబు ట్రాక్‌ని ఎక్కువ సేపు నడిపించడం, అవసరం లేకపోయినా ఒక ఐటమ్‌సాంగ్‌ పెట్టడం వంటివి నిడివిని పెంచేట్టుగా వున్నాయి తప్ప కథకి ఎలాంటి ఉపయోగం లేనివి. తనకు తెలీకుండానే హీరోయిన్‌ కుక్కని హీరో కిడ్నాప్‌ చెయ్యడం అనే ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బాగుంది. సెకండాఫ్‌లో ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీని క్రియేట్‌ చేసింది. అదే క్యూరియాసిటీని సెకండాఫ్‌లో కూడా సరిగ్గా మెయిన్‌టెయిన్‌ చెయ్యలేకపోవడం, దేశంలోని కోటీశ్వరులను, క్రికెట్‌ ప్లేయర్లను గడగడలాడించే మాఫియా డాన్‌ని కూడా బఫూన్‌లా చూపించడం వంటివి కథలోని సీరియస్‌నెస్‌ని పోగొట్టింది. రఘుబాబు ట్రాక్‌ వల్ల సీరియస్‌గా నడిచే కథ గాడి తప్పింది. కథ, కథనాల విషయం పక్కన పెడితే మధ్య మధ్యలో వచ్చే కొన్ని కామెడీ సీన్స్‌, కామెడీ డైలాగ్స్‌ వల్ల ఆడియన్స్‌కి అనుకున్నంత అన్యాయం జరగలేదు. థియేటర్‌కి వెళ్ళినందుకు ఏదో ఒకటి గిట్టుబాటు అయ్యిందిలే అని సరిపెట్టుకుంటారు. రాజ్‌ తరుణ్‌ పెర్‌ఫార్మెన్స్‌, క్రైమ్‌ కంటే కామెడీకి ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇవ్వడం, పృథ్వీ క్యారెక్టర్‌ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌ కాగా, సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్‌, నిడివిని పెంచేందుకు క్రియేట్‌ చేసిన క్యారెక్టర్స్‌, మ్యూజిక్‌ మైనస్‌ పాయింట్స్‌గా నిలిచాయి. ఫైనల్‌గా చెప్పాలంటే కథ, కథనాలు, లాజిక్‌లు పక్కన పెట్టి కాసేపు నవ్వుకోవడానికి కిట్టు ఉన్నాడు జాగ్రత్త చూడొచ్చు. 

ఫినిషింగ్‌ టచ్‌: కాసేపు నవ్వుకోవడానికి ఓకే! 

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement