Advertisement

సినీజోష్‌ రివ్యూ: యమన్‌

Sat 25th Feb 2017 11:26 AM
vijay antony new movie yaman,yaman movie review,yaman movie review in cinejosh,yaman cinejosh review  సినీజోష్‌ రివ్యూ: యమన్‌
సినీజోష్‌ రివ్యూ: యమన్‌
Advertisement

ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ 

యమన్‌ 

తారాగణం: విజయ్‌ ఆంటోనీ, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, అరుళ్‌ డి.కుమార్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: జీవశంకర్‌ 

సంగీతం: విజయ్‌ ఆంటోని 

ఎడిటింగ్‌: వీర సెంథిల్‌రాజ్‌ 

మాటలు, పాటలు: భాష్యశ్రీ 

సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి 

నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి 

రచన, దర్శకత్వం: జీవశంకర్‌ 

విడుదల తేదీ: 24.02.2017 

అనువాద చిత్రం నకిలితో హీరోగా పరిచయమైన విజయ్‌ ఆంటోని ఆ తర్వాత వచ్చిన డా. సలీమ్‌, బిచ్చగాడు చిత్రాలు సూపర్‌హిట్‌ కావడంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. బిచ్చగాడు తర్వాత ఎన్నో అంచనాల మధ్య రిలీజ్‌ అయిన బేతాళుడు అనుకున్నంత హిట్‌ అవ్వలేదు. లేటెస్ట్‌గా నకిలి దర్శకుడు జీవశంకర్‌ దర్శకత్వంలో రూపొందిన యమన్‌తో మరోసారి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి వచ్చాడు విజయ్‌ ఆంటోనీ. తమిళ్‌లో విజయ్‌ ఆంటోని ఫిల్మ్‌ కార్పొరేషన్‌, లైకా ప్రొడక్షన్స్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై మిర్యాల రవీందర్‌రెడ్డి తెలుగులో అందించారు. విజయ్‌ ఆంటోని ఇప్పటి వరకు చేయని పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఈరోజు విడుదలైంది. బిచ్చగాడుతో హీరోగా మంచి ఇమేజ్‌ని సంపాదించుకున్న విజయ్‌ ఆంటోని యమన్‌తో తన రేంజ్‌ని పెంచుకోగలిగాడా? డిఫరెంట్‌గా వుండే సబ్జెక్ట్స్‌తోనే సినిమాలు చేసే అతనికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది? నకిలి దర్శకుడు జీవశంకర్‌.. విజయ్‌ ఆంటోనికి మరో సూపర్‌హిట్‌ ఇవ్వగలిగాడా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

సాధారణ వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగి మినిస్టర్‌ ఎలా అయ్యాడనేది ఈ చిత్ర కథాంశం. దేవరకొండ అనే గ్రామంలో మంచి పేరు తెచ్చుకున్న గాంధీ(విజయ్‌ ఆంటోని) అహల్యను ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. దీంతో అహల్య అన్నయ్య గాంధీపై పగ పెంచుకుంటాడు. గాంధీ, అహల్యలకు కొడుకు పుడతాడు. ఈ విషయాన్ని తనే స్వయంగా అహల్య ఊరు వెళ్ళి చెప్పాలనుకుంటాడు. అదే క్రమంలో గాంధీ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధపడతాడు. ఇది రుచించని పాండురంగారావు అనే వ్యక్తి అహల్య అన్నయ్య మనసులో దురాలోచన కలిగిస్తాడు పాండు. ఒక పథకం ప్రకారం గాంధీని హత్య చేస్తారు. ఇది విని తట్టుకోలేని అహల్య ఆత్మహత్య చేసుకుంటుంది. కట్‌ చేస్తే పెరిగి పెద్దవాడైన గాంధీ కొడుకు అశోకచక్రవర్తి(విజయ్‌ ఆంటోని) తన తాతయ్యతో కలిసి జీవనం సాగిస్తుంటాడు. తాతయ్యకు క్యాన్సర్‌ అని తేలడం, ఆపరేషన్‌కి మూడు లక్షల అవసరం రావడంతో డబ్బు కోసం తను చేయని నేరాన్ని నెత్తిన వేసుకొని జైలుకు వెళ్తాడు అశోక్‌. అక్కడ పరిచయమైన నరసింహ అనే వ్యక్తి తన కోసం పనిచేస్తే జైలు నుంచి విడిపిస్తానని చెప్తాడు. చెప్పినట్టుగానే అశోక్‌ విడుదలవుతాడు. ప్రత్యర్థులైన నరసింహ, సాంబల రగులుతున్న పగకి అశోక్‌ ఆజ్యం పోస్తాడు. మాజీ మంత్రి కరుణాకర్‌(త్యాగరాజన్‌), మంత్రి పాండురంగారావుల అండతో ఒక్కో మెట్టు ఎదుగుతుంటాడు అశోక్‌. ఈ క్రమంలో అశోక్‌ ఎమ్మెల్యేగా పోటీ చెయ్యాలనుకుంటాడు. గాంధీని పోలివున్న అశోక్‌ని చూసి పాండు ఎలా రియాక్టయ్యాడు? అశోక్‌ ఎమెల్యేగా పోటీ చేయడంపై కరుణాకర్‌, పాండు ఎలా స్పందించారు? అందర్నీ పక్కకు నెట్టి ఎమ్మెల్యేగా గెలిచిన అశోక్‌ మినిస్టర్‌ ఎలా అయ్యాడు? అనేది మిగతా కథ. 

తన సహజ సిద్ధమైన నటనతో అందర్నీ ఆకట్టుకుంటూ వస్తున్న విజయ్‌ ఆంటోని ఈ చిత్రంలో మరోసారి తన పెర్‌ఫార్మెన్స్‌తో అలరించాడు. ఇప్పటివరకు చేయని పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలో గాంధీగా, అశోకచక్రవర్తిగా విజయ్‌ ఆంటోని తన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు దాదాపు ప్రతి సీన్‌లో విజయ్‌ ఆంటోని కనిపిస్తాడు. క్యారెక్టర్‌ పరంగా ఎక్కడా ఎక్స్‌ట్రాలు లేకపోవడంతో అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా దానికి తగ్గట్టుగానే నేచురల్‌గా వుంది. మియా జార్జ్‌ గ్లామర్‌తోపాటు ప్రాధాన్యం వున్న క్యారెక్టర్‌లో నటించింది. విజయ్‌ ఆంటోని తర్వాత మాజీమంత్రి కరుణాకర్‌గా నటించిన త్యాగరాజన్‌, మినిస్టర్‌ పాండురంగారావుగా నటించిన అరుళ్‌ జోతి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చారు. ఈ సినిమాలోని మిగతా నటీనటులు తమ తమ క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారు. 

టెక్నికల్‌ డిపార్ట్‌మెంట్స్‌ గురించి చెప్పాల్సి వస్తే జీవశంకర్‌ ఫోటోగ్రఫీ చాలా నీట్‌గా, నేచురల్‌గా వుంది. విజయ్‌ ఆంటోని మ్యూజిక్‌ చాలా బాగుంది. పాటలన్నీ వినసొంపుగా వున్నాయి. ఈ సినిమాకి కథ ఎంత ఇంపార్టెంట్‌ అనిపిస్తుందో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా అంతే ఇంపార్టెంట్‌ అనే ఫీలింగ్‌ కలుగుతుంది. అందుకే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో విజయ్‌ ఎంతో కేర్‌ తీసుకొని తన మ్యూజిక్‌తో ప్రతి సీన్‌ని హైలైట్‌ అయ్యేలా చేశాడు. ఎడిటర్‌ వీరసెంథిల్‌రాజ్‌ సినిమాని పర్‌ఫెక్ట్‌గా ఎడిట్‌ చేశాడు. మాటలు, పాటలు రాసిన భాష్యశ్రీ పూర్తి స్థాయిలో సక్సెస్‌ అయ్యాడు. మాటలు ఎంతో అర్థవంతంగా, ప్రస్తుత రాజకీయ స్థితిగతులకు తగ్గట్టుగా వున్నాయి. డైరెక్టర్‌ గురించి చెప్పాలంటే మంచి కథ, మంచి గ్రిప్పింగ్‌ వున్న స్క్రీన్‌ప్లేతో సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు మ్యాజిక్‌ చేశాడని చెప్పాలి. ఎక్కడా బోర్‌ అనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్ట్‌ నుంచి చక్కని పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకున్నాడు. ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా నిలిచినవి కథ, స్క్రీన్‌ప్లే, నటీనటుల పెర్‌ఫార్మెన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌. మైనస్‌ పాయింట్స్‌గా చెప్పుకోదగ్గవి స్లో నేరేషన్‌, సినిమా నిడివి ఎక్కువగా వుండడం. ఇవి మైనస్‌లు కావు అనుకునే వారికి సినిమాలో బోలెడంత స్టఫ్‌ దొరుకుతుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఎన్నో ఎక్స్‌పెక్టేషన్స్‌ మధ్య వచ్చిన ఈ సినిమా టేకింగ్‌ పరంగా బాగుందనే టాక్‌ తెచ్చుకున్నా బి, సి సెంటర్స్‌లోని ఆడియన్స్‌ ఈ చిత్రాన్ని ఎంతవరకు యాక్సెప్ట్‌ చేస్తారు, ఏ రేంజ్‌లో కలెక్షన్స్‌ వస్తాయి అనేది తెలియాల్సి వుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్న యమన్‌ 

సినీజోష్‌ రేటింగ్‌: 2.5/5 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement