Advertisement

సినీజోష్‌ రివ్యూ: ఊపిరి

Sat 26th Mar 2016 12:45 PM
telugu movie oopiri,nagarjuna latest movie oopiri,nagarjuna and karthi movie oopiri,telugu movie oopiri review,oopiri review in cinejosh,oopiri cinejosh review,oopiri director vamsy paidipally,oopiri producer pvp  సినీజోష్‌ రివ్యూ: ఊపిరి
సినీజోష్‌ రివ్యూ: ఊపిరి
Advertisement

పి.వి.పి. సినిమా 

ఊపిరి 

తారాగణం: అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా, ప్రకాష్‌రాజ్‌, 

ఆలీ, జయసుధ తదితరులు. స్పెషల్‌ అప్పియరెన్స్‌: అనుష్క, శ్రీయ 

సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌ 

సంగీతం: గోపీసుందర్‌ 

ఎడిటింగ్‌: మధు 

స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి 

మాటలు: అబ్బూరి రవి 

సమర్పణ: పెరల్‌ వి. పొట్లూరి 

నిర్మాత: పరమ్‌ వి.పొట్లూరి 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి 

విడుదల తేదీ: 25.03.2016 

మూస కథల జోలికి వెళ్ళకుండా తమ ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త ఎలిమెంట్‌ వుండాలని కొంతమంది టాలీవుడ్‌ హీరోలు ట్రై చేస్తున్నారు. అలాంటి వారిలో నాగార్జున కూడా ఒకరు. ఫ్రెంచ్‌ మూవీ ఇన్‌టచ్‌బుల్స్‌ ఆధారంగా వంశీ పైడిపల్లి తయారు చేసిన కథ నాగార్జునను ఇంప్రెస్‌ చెయ్యడంతో ఊపిరి చిత్రం ప్రారంభమైంది. తమిళ హీరో కార్తీ ఫస్ట్‌ టైమ్‌ తెలుగులో చేసిన స్ట్రెయిట్‌ సినిమా ఇదే కావడం విశేషం. పివిపి సినిమా పతాకంపై ప్రసాద్‌ వి. పొట్లూరి తెలుగు, తమిళ్ భాషల్లో నిర్మించిన ఈ మల్టీస్టారర్‌ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ని ఆడియన్స్‌ ఎలా రిసీవ్‌ చేసుకున్నారు? ఇన్‌టచ్‌బుల్స్‌ కథపై నాగార్జున, వంశీ పైడిపల్లి పెట్టుకున్న నమ్మకానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఈ సినిమాకి సంబంధించి మొదట అభినందించాల్సిన వ్యక్తి నాగార్జున. కేవలం కథ మీద నమ్మకంతో వీల్‌ చైర్‌కే పరిమితమయ్యే క్యారెక్టర్‌ చెయ్యాలనుకోవడం సాహసంతో కూడుకున్న నిర్ణయమే. సోగ్గాడే చిన్ని నాయనా వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చేసి వెంటనే ఊపిరి వంటి ఫీల్‌గుడ్‌ మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడం నాగార్జునకే చెల్లింది. తెలుగులో స్ట్రెయిట్‌ మూవీ చెయ్యాలన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్న కార్తీకి పివిపి సినిమా వంటి పెద్ద బేనర్‌లో నాగార్జునతో కలిసి నటించే అవకాశం రావడం అతని అదృష్టమనే చెప్పాలి. ఈ కథ మీద, కాంబినేషన్‌ మీద వున్న పూర్తి నమ్మకంతో ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు పివిపి. 

ఇక కథ విషయానికి వస్తే కోట్లకు అధిపతి అయిన విక్రమ్‌ ఆదిత్య(అక్కినేని నాగార్జున)కు జరిగిన ఓ యాక్సిడెంట్‌లో అతని కాళ్ళు, చేతులు చచ్చుబడిపోతాయి. దాంతో వీల్‌ చెయిర్‌కే పరిమితమైపోతాడు. అతనికి కేర్‌ టేకర్‌ అవసరం రావడంతో ఆ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఆ ఇంటర్వ్యూకు హాజరవుతాడు శ్రీను(కార్తీ). ఓ దొంగతనం కేసులో అంతకుముందు రోజే జైలు నుంచి పెరోల్‌పై విడుదలవుతాడు శ్రీను. కొడుకు జైలుకి వెళ్ళి రావడంతో అతని తల్లి, చెల్లి, తమ్ముడు అందరూ అతన్ని అసహ్యించుకుంటారు. ఇంట్లో వుండడానికి వీల్లేదంటారు. దాంతో ఇంటి నుంచి వచ్చేస్తాడు శ్రీను. పెరోల్‌లో వున్నప్పుడు సత్ప్రవర్తనతో నడుచుకోవాలని స్నేహితుడు ఆలీ చెప్పిన మాటలు విని ఆ ఇంటర్వ్యూకి అటెండ్‌ అవుతాడు శ్రీను. ఇంటర్వ్యూకి వచ్చినవారిలో టిపికల్‌గా వున్న శ్రీనుని సెలెక్ట్‌ చేసుకుంటాడు విక్రమ్‌. మరుసటి రోజు నుంచి విక్రమ్‌కి కేర్‌ టేకర్‌గా చార్జ్‌ తీసుకుంటాడు. అలా విక్రమ్‌, శ్రీనుల జర్నీ స్టార్ట్‌ అవుతుంది. తను కోల్పోయిన సంతోషాన్ని వెతుక్కుంటున్న విక్రమ్‌లో శ్రీను సాన్నిహిత్యం ఎలాంటి మార్పును తీసుకొచ్చింది. అప్పటివరకు అల్లరి చిల్లరగా తిరిగిన శ్రీను.. విక్రమ్‌ దగ్గర చేరిన తర్వాత అతని దగ్గర ఏం తెలుసుకున్నాడు? చివరికి ఆ ఇద్దరూ తమ జీవితాల్లో సంతోషాన్ని చూడగలిగారా? అనేది మిగతా కథ. 

విక్రమ్‌ ఆదిత్యగా నాగార్జున పెర్‌ఫార్మెన్స్‌ ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పాలి. వీల్‌ చెయిర్‌లో ఎలాంటి మూమెంట్స్‌ లేకుండా కేవలం డైలాగ్స్‌తో, ఫేస్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఒక మంచి ఫీల్‌ని తీసుకురాగలిగాడు. ఇప్పటివరకు నాగార్జున చేసిన బెస్ట్‌ క్యారెక్టర్స్‌లో విక్రమ్‌ ఆదిత్య క్యారెక్టర్‌ కూడా ఒకటిగా నిలుస్తుందని చెప్పొచ్చు. ఇక కార్తీ గురించి చెప్పాలంటే సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఫస్ట్‌ హాఫ్‌ వరకు తన డైలాగ్స్‌తో, ఎక్స్‌ప్రెషన్స్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇవ్వగలిగాడు. కామెడీ పరంగా, సెంటిమెంట్‌ పరంగా కార్తీ హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇవ్వగలిగాడు. దానికి తగ్గట్టుగానే కార్తీకి రాసిన డైలాగ్స్‌ చాలా బాగున్నాయి. కథ, కథనాల్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా మిక్స్‌ అయివుండడం ఈ సినిమాకి పెద్ద ప్లస్‌ అయిందని చెప్పాలి. విక్రమ్‌కి పి.ఎ.గా కీర్తి క్యారెక్టర్‌లో తమన్నా ఓకే అనిపించింది. సినిమా మొత్తం చాలా గ్లామరస్‌గా కనిపించింది. విక్రమ్‌ స్నేహితుడు ప్రసాద్‌గా ప్రకాష్‌రాజ్‌ క్యారెక్టర్‌ కూడా అందర్నీ ఆకట్టుకుంటుంది. అతను కూడా తన శక్తి మేర నవ్వించే ప్రయత్నం చేశాడు. మిగతా క్యారెక్టర్స్‌లో తనికెళ్ళ భరణి, జయసుధ ఫర్వాలేదనిపించారు. నాగార్జున సరసన హీరోయిన్లుగా నటించిన అనుష్క, శ్రీయ ఈ చిత్రంలో ఇచ్చిన స్పెషల్‌ అప్పియరెన్స్‌ కూడా సినిమాకి ప్లస్‌ అయింది. 

సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు నీట్‌గా వుండడంలో సినిమాటోగ్రాఫర్‌ పి.ఎస్‌.వినోద్‌ పనితనం బాగా కనిపిస్తుంది. తన ఫోటోగ్రఫీతో సినిమాకి ఒక రిచ్‌నెస్‌ని తీసుకొచ్చాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్యారిస్‌ రోడ్లపై కార్‌ ఛేజింగ్‌ సీన్‌ని బాగా చేశాడు. మ్యూజిక్‌ విషయానికి వస్తే గోపీసుందర్‌ చేసిన పాటలన్నీ ప్లెజెంట్‌గా అనిపించాయి. సినిమాలోని ఫీల్‌ని క్యారీ చేస్తూ అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా ఆకట్టుకుంటుంది. మధు ఎడిటింగ్‌ బాగుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి సంబంధించి అబ్బూరి రవి రాసిన మాటలు బాగున్నాయి. స్టోరీ అడాప్షన్‌లో వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి కష్టం మనకు స్క్రీన్‌పై కనిపిస్తుంది. సినిమాలోని ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. పివిపి ఎక్కడా కాంప్రమైజ్‌ అవకుండా సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి గురించి చెప్పాలంటే ఒక ఫ్రెంచ్‌ సినిమాని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మలచడంలో సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌ హాఫ్‌ సెంటిమెంట్‌, ఫీల్‌ క్యారీ చేస్తూనే కార్తీతో ఎంటర్‌టైన్‌మెంట్‌ని కూడా అందించగలిగాడు. ఆర్టిస్టుల నుంచి మంచి పెర్‌పార్మెన్స్‌ రాబట్టుకోవడంలో వంశీ సక్సెస్‌ అయ్యాడు. ఫస్ట్‌ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ వీక్‌ అనే చెప్పాలి. సెకండాఫ్‌ ప్రేక్షకుల్ని విసిగించకపోయినా 15 నిముషాల క్లైమాక్స్‌ కోసం గంట సేపు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టినట్టుగా అనిపిస్తుంది. 

యాక్షన్‌ సినిమాలు, ఫార్ములా సినిమాలు, ఎవరికీ అర్థం కాని ఎక్స్‌పెరిమెంట్‌ సినిమాలు చూసి చూసి విసిగి వేసారిన ప్రేక్షకులకు ఊపిరి మంచి రిలీఫ్‌నిస్తుంది. ఫస్ట్‌ హాఫ్‌ అంతా కార్తీ కామెడీని ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తారు. సెకండాఫ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అవడం, క్లైమాక్స్‌ వరకు సినిమాని సాగదీయడం సినిమాకి మైనస్‌ పాయింట్స్‌గా అనిపిస్తాయి. అయితే ఓవరాల్‌గా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రంగా ఊపిరి నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే మంచి కథ, ఆసక్తిగా వుండే కథనం, మంచి పాటలు, మంచి ఫోటోగ్రఫీ, చక్కని ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో రూపొందిన ఊపిరి మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా అందర్నీ ఆకట్టుకుంటుంది. 

ఫినిషింగ్‌ టచ్‌: కూల్‌ అండ్‌ ఫీల్‌గుడ్‌ మూవీ 

సినీజోష్‌ రేటింగ్‌: 3.25/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement