Advertisement

సినీజోష్‌ రివ్యూ: మామ మంచు అల్లుడు కంచు

Fri 25th Dec 2015 09:52 PM
telugu movie mama manchu alludu kanchu,mama manchu alludu kanchu movie review,mama manchu alludu kanchu movie cinejosh review,mohan babu and allari naresh in mama manchu alludu kanchu,mama manchu alludu kanchu director srinivas reddy  సినీజోష్‌ రివ్యూ: మామ మంచు అల్లుడు కంచు
సినీజోష్‌ రివ్యూ: మామ మంచు అల్లుడు కంచు
Advertisement

24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ 

మామ మంచు అల్లుడు కంచు 

తారాగణం: మోహన్‌బాబు, అల్లరి నరేష్‌, పూర్ణ, 

మీనా, రమ్యకృష్ణ, ఆలీ, వరుణ్‌ సందేశ్‌, 

కృష్ణభగవాన్‌, రాజా రవీంద్ర తదితరులు 

సినిమాటోగ్రఫీ: బాలమురుగన్‌ 

ఎడిటింగ్‌: గౌతంరాజు 

సంగీతం: అచ్చు, రఘు కుంచె 

బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌: కోటి 

మాటలు: శ్రీధర్‌ సీపాన 

సమర్పణ: అరియానా, వివియానా, విద్యానిర్వాణ 

నిర్మాత: మంచు విష్ణు 

స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనివాస్‌రెడ్డి 

విడుదల తేదీ: 25.12.2015 

యాక్షన్‌, సెంటిమెంట్‌, మాస్‌ మసాలా, హార్రర్‌.. ఈ జోనర్స్‌లో సినిమాలు చెయ్యడానికి చాలా మంది డైరెక్టర్లు వున్నారు. కానీ, కామెడీ సినిమాలను పర్‌ఫెక్ట్‌ తీసేవాళ్ళను, అందులో తమకంటూ ఒక మార్క్‌ని ఏర్పరచుకున్న డైరెక్టర్లను వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి వారిలో జంధ్యాల, ఇ.వి.వి.సత్యనారాయణ, వంశీ వంటి డైరెక్టర్ల పేర్లు మాత్రమే వినిపిస్తాయి. ఈమధ్యకాలంలో కొంతమంది కామెడీ సినిమాలు చెయ్యాలని ట్రై చేసినా ఆ స్థాయిలో ప్రేక్షకుల్ని నవ్వించలేకపోయారు. మరికొందరు ప్రేక్షకుల్ని నవ్వించాలన్న ప్రయత్నంలో నవ్వుల పాలయ్యారు. స్టార్‌ హీరోలుగా పేరు తెచ్చుకున్న వారంతా మేం కామెడీ కూడా చెయ్యగలం అనిపించుకునేందుకు కొన్ని కామెడీ సినిమాలు కూడా చేశారు. అలాంటివారిలో మోహన్‌బాబు ఒకడు. విలన్‌గా, హీరోగా, కామెడీ విలన్‌గా..ఇలా అన్ని రకాల పాత్రలు పోషించాడు. ఇప్పుడు అల్లరి నరేష్‌ కేవలం కామెడీ సినిమాలతోనే హీరోగా ఎదిగాడు. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్‌ మూవీ మామ మంచు అల్లుడు కంచు. ప్రజెంట్‌ జనరేషన్‌లో కొన్ని కామెడీ సినిమాలు చేసి ఓకే అనిపించుకున్న శ్రీనివాస్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్‌ని నవ్వించగలిగింది? కొంత గ్యాప్‌ తర్వాత ఫుల్‌ ప్లెడ్జ్‌డ్‌ క్యారెక్టర్‌ చేసిన మోహన్‌బాబు ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాడా? మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ కలిసి సినిమా చేస్తున్నారంటే ఆడియన్స్‌లో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ వుంటాయి. డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అవ్వగలిగాడా? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

1992లో వచ్చిన అల్లరి మొగుడు సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. మోహన్‌బాబు, మీనా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఆ సినిమాకి ఎక్స్‌టెన్షనే మామ మంచు అల్లుడు కంచు. మోహన్‌బాబు, మీనా, రమ్యకృష్ణల కొడుకు, కూతరు, మరో కొత్త క్యారెక్టర్‌తో ఈ సినిమా రన్‌ అవుతుంది. 

భక్తవత్సలంనాయుడు(మోహన్‌బాబు) ఒక బిజినెస్‌మేన్‌. అంతేకాదు మంచి భర్తగా భార్య సూర్యకాంతం(మీనా) దగ్గర మార్కులు కొట్టేస్తుంటాడు. అలాగే కూతురు శృతి(పూర్ణ) దగ్గర కూడా మంచి డాడీగా పేరు తెచ్చుకుంటాడు. ఇదిలా వుంటే భక్తవత్సలం రెండో భార్య ప్రియంవద(రమ్యకృష్ణ) కూడా తన భర్త రాముడంతటి వాడు అనుకుంటుంది. ఆమె కొడుకు గౌతమ్‌నాయుడు(వరుణ్‌ సందేశ్‌) భక్తవత్సలం తనకు రోల్‌మోడల్‌ అని చెప్తుంటాడు. ఇలా రెండిళ్ళ పూజారిగా పాతిక సంవత్సరాల నుంచి కథ నడుపుతున్న భక్తవత్సలంకి ఓరోజు ఒక ప్రాబ్లమ్‌ వస్తుంది. పెద్ద భార్య కూతురు, చిన్న భార్య కొడుకుల పుట్టినరోజు ఒకేరోజు కావడంతో వారికి గిఫ్టులు కొని పంపిస్తాడు భక్తవత్సలం. కానీ, పొరపాటున అడ్రసులు తారుమారై ఒకరి గిఫ్ట్‌ మరొకరికి వెళ్తుంది. వాటిని ఎక్స్‌ఛేంజ్‌ చేసుకునేందుకు గౌతమ్‌, శృతి కలవాలనుకుంటారు. ఫస్ట్‌టైమ్‌ ఫోన్‌లో మాట్లాడుకున్నప్పుడే ఒకరంటే ఒకరు ఇంట్రెస్ట్‌ చూపిస్తారు. గిఫ్టులు మారిపోయాయన్న విషయం తెలుసుకున్న భక్తవత్సలం ఆ అన్నా చెల్లెళ్ళిద్దరూ కలవకుండా చెయ్యాలని ఒక చాకులాంటి కుర్రాడు బాలరాజు(అల్లరి నరేష్‌)ని గౌతమ్‌గా శృతి దగ్గరికి పంపిస్తాడు. కానీ, బాలరాజు అంతటితో ఆగకుండా శృతితో ప్రేమాయణం మొదలుపెడతాడు. రెండు గిఫ్టుల వల్ల పాతిక సంవత్సరాలు గుట్టుగా సాగిన రెండిళ్ళ సెటప్‌ ఒక్కసారిగా డిస్ట్రబ్‌ అయి భక్తవత్సలంకి కొత్త సమస్యల్ని తెచ్చి పెడుతుంది. గౌతమ్‌గా వెళ్ళిన బాలరాజు వల్ల భక్తవత్సలంకి ఎలాంటి సమస్యలు వచ్చాయి? వాటి నుంచి తప్పించుకోవడానికి అతను ఎన్ని నాటకాలు ఆడాడు? భక్తవత్సలం, బాలరాజు మధ్య మామా అల్లుళ్ళ ఆట ఎలా సాగింది? అనేది మిగతా కథ. 

మామ మంచు అల్లుడు కంచు అనే టైటిల్‌ ఎంత విచిత్రంగా వుందో ఈ సినిమాలో కథ, కథనాలు కూడా అంతే విచిత్రంగా వుంటాయి. సినిమా చూస్తున్నంత సేపు అల్లరిమొగుడు సినిమాకి ఇది సీక్వెల్‌లా అనిపిస్తుందే తప్ప కొత్త సినిమా చూస్తున్న ఫీలింగ్‌ కలగదు. ఈ సినిమాలోని సీన్స్‌గానీ, డైలాగ్స్‌గానీ, కామెడీ ఎపిసోడ్స్‌గానీ 1992లో వచ్చిన అల్లరిమొగుడు స్థాయిలో ఆ జనరేషన్‌ చూసి ఎంజాయ్‌ చేసేలా వుంటాయి తప్ప ప్రస్తుత జనరేషన్‌లోని యూత్‌కి గానీ, ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎంత మాత్రం రీచ్‌ అవ్వవు అని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఫీల్‌ అవుతారు. 

మామగా మోహన్‌బాబు క్యారెక్టరైజేషన్‌ చాలా విచిత్రంగానూ, చాలా అసహజంగానూ అనిపిస్తుంది. దానికి తగ్గట్టుగానే అతని పెర్‌ఫార్మెన్స్‌ కూడా ఎవరికీ అంతుపట్టదు. శ్రీధర్‌ సీపాన మరోసారి తన కలంతో కలకలం రేపాడు. సినిమా అంతా శ్రీధర్‌ రాసిన ప్రాస డైలాగ్స్‌, పంచ్‌ డైలాగ్స్‌ చెప్పడమే మోహన్‌బాబు పనైపోయింది. అల్లరిమొగుడు చిత్రంలో ఇద్దరు పెళ్ళాల ముద్దుల భర్తగా మోహన్‌బాబు పెర్‌ఫార్మెన్స్‌ ఓ రేంజ్‌లో వుంటే, ఈ సినిమాలో అతని పెర్‌ఫార్మెన్స్‌ని ఎలా కొలవాలో, ఏ రేంజ్‌ అని చెప్పాలో అర్థంకాని విధంగా వుంది. గెటప్‌కి తగ్గట్టుగానే ఒక పిచ్చి విగ్గు అతనికి పెట్టడంతో చాలా అసహజంగా, ఎంతో ఎబెట్టుగా అనిపిస్తుంది. ఇక అల్లుడు క్యారెక్టర్‌లో అల్లరి నరేష్‌ నటన యాజ్‌ ఇటీజ్‌గా వుంది. పెర్‌ఫార్మెన్స్‌లో అతను కొత్త పుంతలు తొక్కే అవకాశం లేదు. హీరోయిన్‌గా పూర్ణకు ఈ సినిమాలో ఎలాంటి ప్రాధాన్యత లేదు. ఇక భక్తవత్సలం భార్యలుగా నటించిన మీనా, రమ్యకృష్ణ పెర్‌ఫార్మెన్స్‌ గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. మోహన్‌బాబు ఫ్రెండ్‌గా ఆలీ పెర్‌ఫార్మెన్స్‌ ఓకే అనిపిస్తుంది. 

ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్‌గా ఎలాంటి ఎస్సెట్స్‌ లేవు అని చెప్పొచ్చు. బాలమురుగన్‌ ఫోటోగ్రఫీ, అచ్చు, రఘు కుంచె మ్యూజిక్‌, కోటి బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, గౌతంరాజు ఎడిటింగ్‌ సోసోగానే వున్నాయి తప్ప వాటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి గతంలో తీసిన కామెడీ సినిమాల కంటే కథ పరంగా, సీన్స్‌ పరంగా, కామెడీ పరంగా మామ మంచు అల్లుడు కంచు నాసిరకంగా వుందనే చెప్పాలి. ఇక శ్రీధర్‌ సీపాన రాసిన మాటల్లో పంచ్‌లు ప్రాసల కోసం పడ్డ తాపత్రయం కనిపించింది. కథలో కన్‌ఫ్యూజన్‌, కథనంలో హడావిడి, డైలాగ్స్‌లో ప్రాస, పంచ్‌ల గోలతో అంతా గందరగోళంగా వుంది తప్ప ప్రేక్షకులు ప్రశాంతంగా నవ్వుకునేలా సినిమాలో ఒక్క సీన్‌ కూడా కనిపించదు. పైగా ప్రతి సీన్‌ సహజత్వానికి దూరంగా వుంటూ ఆడియన్స్‌ అర్థం చేసుకోవడానికి టైమ్‌ పట్టేలా వుంటుంది. ఆర్టిస్టుల నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్‌ తీసుకోవడంలో డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి సక్సెస్‌ కాలేకపోయాడు. 

పాత కథ, పాత కథనం, పాత ఆర్టిస్టులు...ఇలా ఎందులోనూ కొత్తదనం లేని సినిమా ఇది. సినిమా స్టార్ట్‌ అవ్వడమే చాలా స్లోగా స్టార్ట్‌ అయి చాలా సాదా సీదా సీన్స్‌తో నడుస్తూ వుంటుంది. మధ్య మధ్యలో మోహన్‌బాబు, అల్లరి నరేష్‌ ప్రేక్షకుల్ని నవ్విస్తున్నామన్న భ్రమతో తమ తమ సీన్స్‌ని చేసుకుంటూ వెళ్తుంటారు తప్ప ఆడియన్స్‌ నుంచి ఎలాంటి రియాక్షన్‌ వుండదు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌గానీ, క్లైమాక్స్‌ గానీ ఆకట్టుకోదు. క్లైమాక్స్‌లో వచ్చే పెళ్ళిళ్ళ సీన్‌ ప్రతి ఒక్కరికీ బోర్‌ కొట్టిస్తుంది. ఫైనల్‌గా చెప్పాలంటే ఇప్పటి జనరేషన్‌కి కనెక్ట్‌ అయ్యే కంటెంట్‌ లేకపోవడం, వున్న కంటెంట్‌ని సరైన మార్గంలో సినిమాగా మలచడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అవ్వలేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌ అయ్యాయి. థియేటర్‌ నుంచి బయటికి వచ్చే ఆడియన్స్‌కి అప్పటి అల్లరి మొగుడు సినిమాకి రెండో పార్ట్‌ని చూసి వస్తున్న ఫీలింగ్‌ కలుగుతుందే తప్ప ఎలాంటి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఈ సినిమా ఇవ్వలేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: మంచు కరగలేదు.. కంచు మోగలేదు 

సినీజోష్‌ రేటింగ్‌: 1.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement