Advertisement

సినీజోష్‌ రివ్యూ: జిల్లా

Sun 26th Jul 2015 08:01 AM
telugu movie jilla review,jilla cinejosh review,tamil hero vijay new movie jilla,kajal agarwal,mohanlal  సినీజోష్‌ రివ్యూ: జిల్లా
సినీజోష్‌ రివ్యూ: జిల్లా
Advertisement

శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ 

జిల్లా 

నటీనటులు: విజయ్‌, మోహన్‌లాల్‌, కాజల్‌, సంపత్‌రాజ్‌, 

ప్రదీప్‌ రావత్‌, మహత్‌ రాఘవేంద్ర, నివేదా థామస్‌ తదితరులు 

మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి 

సినిమాటోగ్రఫీ: గణేష్‌ రాజవేలు 

సంగీతం: డి.ఇమ్మన్‌ 

ఎడిటింగ్‌: డాన్‌ మాక్స్‌ 

సమర్పణ: ఆర్‌.బి.చౌదరి 

నిర్మాతలు: తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నితి 

రచన, దర్శకత్వం: ఆర్‌.టి.నేసన్‌ 

విడుదల తేదీ: 24.07.2015 

తమిళ్‌లో స్టార్‌ హీరోగా వెలుగొందుతున్న విజయ్‌కి తెలుగులో అంతగా ఫాలోయింగ్‌ లేదు. అక్కడ మాస్‌ హీరోగా మంచి పేరున్న విజయ్‌ సినిమాలను ఈమధ్యకాలంలో తెలుగులోకి అనువదించి రిలీజ్‌ చేస్తూ సక్సెస్‌ అవుతున్నారు మన నిర్మాతలు. అదే కోవలో తమిళ్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన 'జిల్లా' చిత్రాన్ని అదే పేరుతో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకంపై తమటం కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నితి తెలుగులో విడుదల చేశారు. ఈ శుక్రవారం రిలీజ్‌ అయిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఎంతవరకు ఎంటర్‌టైన్‌ చెయ్యగలిగింది? విజయ్‌కి ఈ చిత్రంతో తెలుగులో కూడా ఫాలోయింగ్‌ పెరిగే అవకాశం వుందా? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

కథ: విజయవాడ సిటీలో పేరు మోసిన అసాంఘిక శక్తి శివయ్య(మోహన్‌లాల్‌). సిటీలో ఏ ఇల్లీగల్‌ యాక్టివిటీ అయినా శివయ్య తప్ప మరొకరు చెయ్యలేరు అనేంతగా పేరు తెచ్చుకుంటాడు. ఒక గొడవలో అతని దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న హీరో శక్తి(విజయ్‌) తండ్రి చనిపోతాడు. దాంతో అనాథగా మారిన శక్తిని చేరదీసి కన్నకొడుకులా పెంచుతాడు. తను చేస్తున్న దందాలో తన వారసుడు శక్తి అని చెప్తుంటాడు శివయ్య. అతను చేసే ప్రతి తప్పునీ సమర్థిస్తూ వెన్నంటి వుండే శక్తికి పోలీసులన్నా, పోలీస్‌ యూనిఫామ్‌ అన్నా ఎలర్జీ. అలాంటిది అతను ప్రేమించిన అమ్మాయి కూడా పోలీసే కావడం తట్టుకోలేకపోతాడు. ఇలా వుండగా ఒక సిన్సియర్‌ పోలీస్‌ కమిషనర్‌ శివయ్యని అరెస్ట్‌ చేసి కొన్ని గంటల తర్వాత ఊరి బయట వదిలేస్తాడు. ఆ అవమానాన్ని భరించలేని శివయ్య ఇకపై తప్పు చేసేవాడు, పోలీస్‌ ఇద్దరూ తమ వాళ్ళే అయి వుండాలని నిర్ణయించుకొని శక్తిని పోలీస్‌ అవ్వమని అడుగుతాడు. పోలీస్‌ యూనిఫామ్‌ అంటేనే గిట్టని శక్తి తను ససేమిరా పోలీస్‌ని అవ్వనంటాడు. అయితే పోలీస్‌ కమిషనర్‌ వల్ల శివయ్య పొందిన అవమానం గుర్తొచ్చి సరేనంటాడు. అలా అక్రమ దారుల్లో శక్తి పోలీస్‌ని చేస్తాడు శివయ్య. అసిస్టెంట్‌ కమిషనర్‌గా ఛార్జ్‌ తీసుకున్న శక్తి శివయ్య వల్ల ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుసుకొని అతన్ని వ్యతిరేకిస్తాడు. ఇక అక్కడి నుంచి శివయ్య చేసే ప్రతి పనిలో అడ్డు తగులుతుంటాడు శక్తి. శివయ్య చేసే దందా ఆపెయ్యమంటాడు. అలా ఇద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. రోజు రోజుకీ వారి మధ్య దూరం పెరుగుతూ పోతుంది. తను పోలీస్‌ని చేసిన శక్తి తనకు అడ్డు తగులుతుంటే శివయ్య రియాక్షన్‌ ఏమిటి? శివయ్య, శక్తిల మధ్య దూరం పెరగడానికి కారణం ఎవరు? శక్తిని శివయ్య ఎలా ఎదుర్కొన్నాడు? శివయ్య తప్పులు చెయ్యకుండా శక్తి ఆపగలిగాడా? ఈ ఇద్దరి కథ ఎన్ని మలుపులు తిరిగింది? చివరికి ఏమైంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: ఈ చిత్రంలో నటించిన ప్రతి ఆర్టిస్టు నుండి హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో డైరెక్టన్‌ నేసన్‌ సక్సెస్‌ అయ్యాడు. శివయ్యగా మోహన్‌లాల్‌ నటన అద్భుతం. అతను చేసిన ప్రతి సీన్‌ని రక్తి కట్టించాడు. శివయ్య క్యారెక్టర్‌లోని హుందాతనం, ఎమోషన్‌ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. శక్తిగా విజయ్‌ ఎక్స్‌లెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ ఇచ్చాడు. కొడుకుగా, అన్నయ్యగా, లవర్‌గా, సిన్సియర్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా అన్నిరకాల ఎమోషన్స్‌ని అద్భుతంగా పండించాడు. విలన్‌గా నటించిన సంపత్‌రాజ్‌ ఇప్పటివరకు తను చేసిన క్యారెక్టర్స్‌కి భిన్నమైన క్యారెక్టర్‌ని ఈ చిత్రంలో చేశాడు. విజయ్‌కి తమ్ముడుగా నటించిన మహత్‌ రాఘవేంద్ర కూడా తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. శివయ్య భార్యగా నటించిన పూర్ణిమా భాగ్యరాజ్‌ తన పరిధిలో బాగానే చేసింది. ఇక హీరోయిన్‌ కాజల్‌ అంతగా ప్రాధాన్యంలేని క్యారెక్టర్‌లో నటించింది. హీరోకి హీరోయిన్‌గా పాటలకు, కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమైన కాజల్‌ పెర్‌ఫార్మెన్స్‌ విషయంలో చెప్పుకోవడానికి ఏమీ లేదు. అయితే రెండు పాటల్లో మాత్రం చాలా గ్లామరస్‌గా కనిపించింది. ఫస్ట్‌ హాఫ్‌లో హీరోని పోలీస్‌ని చెయ్యడానికి వచ్చిన క్యారెక్టర్‌ చేసిన బ్రహ్మానందం కామెడీ చెయ్యాలని, ఆడియన్స్‌ని నవ్వించాలని విశ్వ ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. 

టెక్నీషియన్స్‌: ఈ సినిమాకి మెయిన్‌ ఎస్సెట్స్‌గా నిలిచింది గణేష్‌ రాజవేలు ఫోటోగ్రఫీ. ఆద్యంతం సినిమాని కలర్‌ఫుల్‌గా చూపించడంలో గణేష్‌ ఎఫర్ట్‌ కనిపిస్తుంది. అలాగే పాటల్లో విజయ్‌, కాజల్‌లను మరింత గ్లామరస్‌గా చూపించడంలో సక్సెస్‌ అయ్యాడు. ఫోటోగ్రఫీకి తగ్గట్టుగానే డాన్‌ మాక్స్‌ ఎడిటింగ్‌ కూడా చాలా ఫాస్ట్‌ ఎక్కడా లాగ్‌ లేకుండా వుంది. మ్యూజిక్‌ విషయానికి వస్తే ఇమ్మన్‌ చేసిన పాటల్లో విజయ్‌, కాజల్‌ల మధ్య రెండు పాటలు మాత్రమే ఆకట్టుకునేలా వున్నాయి. మిగతా పాటల్లో తమిళ్‌ నేటివిటీ వుండడం వల్ల తెలుగు ఆడియన్స్‌కి నచ్చకపోవచ్చు. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండింగ్‌ వరకు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ మాత్రం బాగుందనిపిస్తుంది. సినిమాలో వుండే డిఫరెంట్‌ ఎమోషన్స్‌కి తగ్గట్టుగా మ్యూజిక్‌ చేశాడు ఇమ్మన్‌. శశాంక్‌ వెన్నెలకంటి రాసిన మాటల్లో విజయ్‌కి, మోహన్‌లాల్‌కి రాసినవి బాగున్నాయి. వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్‌లోని డైలాగ్స్‌ చాలా పవర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. తమిళ్‌లో సూపర్‌గుడ్‌ ఫిలింస్‌ నిర్మించిన ఈ చిత్రంలో ప్రొడక్షన్‌ వేల్యూస్‌ చాలా బాగున్నాయి. సినిమా అంతా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. దాన్ని అదే క్వాలిటీతో తెలుగులోకి అనువదించి తెలుగు నిర్మాతలు కూడా సక్సెస్‌ అయ్యారు. 

విశ్లేషణ: ఒక తమిళ స్టార్‌, ఒక మలయాళ సూపర్‌స్టార్‌.. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా అంటే తమిళ ప్రేక్షకుల్లో చాలా క్రేజ్‌ వుంటుంది. అయితే ఈ ఇద్దరికీ ఇక్కడ అంతగా ఫాలోయింగ్‌ లేకపోవడంవల్ల ఆ క్రేజ్‌ రాకపోయినా ఒక మంచి కథ, కథనం వున్న సినిమాగా మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకోవాలి. ఈ సినిమాకి మోహన్‌లాల్‌, విజయ్‌ల పెర్‌ఫార్మెన్స్‌ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. సినిమా మొత్తాన్ని వీళ్లిద్దరే నడిపించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అనవసరమైన లవ్‌ ట్రాక్‌, ఏమాత్రం నవ్వు తెప్పించని కామెడీ సీన్స్‌, పాటల్లో కనిపించే తమిళ్‌ ఫ్లేవర్‌ సినిమాకి మైనస్‌ పాయింట్స్‌ అయ్యాయి. వీటన్నింటితో ఫస్ట్‌ హాఫ్‌ బోర్‌ కొట్టించినా పోలీస్‌ అయిన తర్వాత ఎప్పుడైతే శివయ్యకు శక్తి అడ్డుగా మారతాడో అప్పటి నుంచి కథ ఒక గాడిలో పడుతుంది. శివయ్య, శక్తి విడిపోయే సీన్‌ చాలా ఆసక్తిని కలిగిస్తుంది. ఇక సెకండాఫ్‌ స్టార్ట్‌ అయినప్పటి నుంచి సినిమా ఎండ్‌ అయ్యే వరకు అదే స్పీడ్‌తో రన్‌ అవుతుంది. ఎలాంటి లాగ్‌ లేకుండా కథను ముందుకు నడిపించాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ అంతా ఆడియన్స్‌ని కథలో ఇన్‌వాల్వ్‌ చెయ్యడంలో సక్సెస్‌ అయ్యాడు నేసన్‌. ఫైనల్‌గా చెప్పాలంటే ఈమధ్యకాలంలో ఇలాంటి మాస్‌ మసాలా మూవీ రాలేదు. మంచి డైలాగ్స్‌, ఎమోషనల్‌ సీన్స్‌, మాస్‌ సాంగ్స్‌, థ్రిల్‌ చేసే ఫైట్స్‌ని ఎంజాయ్‌ చేసే వారికి ఈ సినిమా నచ్చుతుంది. తమిళ్‌లో బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బి, సి సెంటర్స్‌లో ఎక్కువగా కలెక్ట్‌ చేసే అవకాశాలు వున్నాయి. 

ఫినిషింగ్‌ టచ్‌: ఆకట్టుకునే మాస్‌ మసాలా 

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement