Advertisement

సినీజోష్‌ రివ్యూ: కేరింత

Sat 13th Jun 2015 07:43 AM
telugu movie kerintha review,dil raju,saikiran adivi,micky j.mayor,sumanth aswin  సినీజోష్‌ రివ్యూ: కేరింత
సినీజోష్‌ రివ్యూ: కేరింత
Advertisement

శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌

కేరింత

నటీనటులు: సుమంత్‌ అశ్విన్‌, శ్రీదివ్య, తేజస్వీ, విశ్వనాథ్‌, 

పార్వతీశం, సుకృతి, నిత్యనరేష్‌, ప్రగతి, అనితాచౌదరి

కథ: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ టీమ్‌

సినిమాటోగ్రఫీ: విజయ్‌ కె.చక్రవర్తి

సంగీతం: మిక్కీ జె.మేయర్‌

ఎడిటింగ్‌: మధు

సమర్పణ: శ్రీమతి అనిత

నిర్మాత: రాజు

దర్శకత్వం: సాయికిరణ్‌ అడివి

విడుదల తేదీ: 12.06.2015

యూత్‌ఫుల్‌ మూవీస్‌ అంటే డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌తో, లెక్చరర్స్‌ని బఫూన్స్‌ని చేసే మితిమీరిన సన్నివేశాలతో, లైఫ్‌లో ఒక గోల్‌ అంటూ లేని కుర్రాళ్ళనే హీరోలుగా చూపించిన సినిమాలు మనం ఎన్నో చూశాం. మధ్య, మధ్య కాలేజ్‌ లైఫ్‌ అంటే ఏమిటి? ఫ్రెండ్‌షిప్‌ అంటే ఏమిటి? తల్లిదండ్రుల్ని ఎలా గౌరవించాలి? వంటి మంచి విషయాల్ని ఎంటర్‌టైనింగ్‌గా చెప్పిన సినిమాల్నీ చూశాం. కాలేజ్‌ లైఫ్‌లో ఫ్రెండ్‌షిప్‌ ప్రేమగా మారడం, ఆ ప్రేమని నిలబెట్టుకోవడానికి యువతీ యువకులు పడే ఆరాటం, ఆ ప్రేమ చేజారిపోతుంటే పడే వేదన, తమ ప్రేమని గెలిపించుకోవడానికి పడే తపన వీటన్నింటినీ మిళితం చేసి ‘కేరింత’గా మన ముందుకు తీసుకొచ్చారు దర్శకనిర్మాతలు సాయికిరణ్‌ అడివి, దిల్‌రాజు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కేరింత’ యువత మనోభావాల్ని ఎంత వరకు ఆవిష్కరించగలిగింది? వారి ఎమోషన్స్‌ని అందరికీ ఆమోదయోగ్యంగా చూపించడంలో ఎంతవరకు సక్సెస్‌ అయింది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే. 

కథ: ఓపెన్‌ చేస్తే కాలేజ్‌ లైఫ్‌ని కంప్లీట్‌ చేసి లైఫ్‌లో సెటిల్‌ అయిన నూకరాజు(పార్వతీశం) ఎంట్రీతో సినిమా స్టార్ట్‌ అవుతుంది. సూటు, బూటుతో కారులో తను చదువుకున్న కాలేజీకి వచ్చిన నూకరాజు తన గురించి, తన ఫ్రెండ్స్‌ గురించి, తమ ప్రేమకథల గురించి మనకు చెప్తుంటాడు. జై(సుమంత్‌ అశ్విన్‌), సిద్ధు(విశ్వనాథ్‌), భావన(సుకృతి), ప్రియ(తేజస్వి) అతని ఫ్రెండ్స్‌. బస్సులో తనతో ప్రయాణం చేసిన మనస్విని(శ్రీదివ్య) ప్రేమలో పడి, బస్సులో మిస్‌ అయిన ఆమెను సిటీ అంతా వెతుకుతుంటాడు. తల్లికి ఎక్కువగా భయపడే సిద్ధు తనకి ఎంతో ఇష్టమైన మ్యూజిక్‌లో ఎం.ఎ. చేస్తూ తల్లితో ఎం.సి.ఎ. చేస్తున్నానని అబద్ధం చెప్తాడు. తన తల్లిదండ్రులు చదివిన కాలేజ్‌ కావడంతో ఆ సెంటిమెంట్‌తో అమెరికా నుంచి వచ్చి ఆ కాలేజ్‌లో జాయిన్‌ అవుతుంది ప్రియ. తండ్రి కూలి చేసి సంపాదించిన డబ్బుతో కాలేజీలో చదువుకోవడానికి వస్తాడు మన నూకరాజు. ఇలా ఎవరి సెంటిమెంట్స్‌ వారివి, ఎవరి బాధలు వారివి. వారంతా ఫ్రెండ్స్‌గా మారతారు. ఒకరి బాధల్ని మరొకరు షేర్‌ చేసుకుంటూ వుంటారు. వీరందరికీ గైడ్‌లా అవసరమైన సలహాలిస్తూ వారి ప్రాబ్లమ్స్‌ సాల్వ్‌ చెయ్యడంలో ముందుంటాడు జై. ఇలా జరుగుతున్న టైమ్‌లో సిద్ధు, ప్రియ లవ్‌లో పడతారు. ఒకరినొకరు ఇష్టపడతారు. చదువుకంటే ఎంజాయ్‌ చెయ్యడానికే ఎక్కువ ఇష్టపడే నూకరాజు ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌తో లవ్‌లో పడతాడు. తను బస్సులో చూసిన మనస్విని అడ్రస్‌ కనుక్కొని ఆమె ప్రేమను పొందడానికి ట్రై చేస్తుంటాడు జై. తనకు తెలియకుండానే నూకరాజు అంటే ఇష్టపడుతుంది భావన. సిద్ధు ఓ సందర్భంలో ప్రియతో సహా ఓ షాపింగ్‌ మాల్‌లో తల్లి కంట పడతాడు. తల్లి అంటే భయపడే సిద్ధు ప్రియ ఎవరో తెలీదంటాడు. తండ్రి కష్టపడి సంపాదించి ఫీజు కట్టడానికి పంపిన డబ్బుని ఫేస్‌బుక్‌ ఫ్రెండ్‌కి ఇస్తాడు నూకరాజు. అది నిలదీసిన భావనను అవమానిస్తాడు. తనని కలవడానికి వచ్చిన జైకి కొన్ని కారణాల వల్ల హ్యాండ్‌ ఇస్తుంది మనస్విని. ఇలా అప్పటివరకు అందరి జీవితాల్లో వున్న సంతోషం కాస్తా ప్రేమ వల్ల ఆవిరైపోతుంది. మళ్ళీ వాళ్ళ జీవితాల్లోకి సంతోషం ఎలా వచ్చింది? ఈ మూడు జంటల ప్రేమకథలు ఎన్ని మలుపులు తిరిగాయి? చివరికి ఈ మూడు జంటలు ఎలా కలుసుకున్నాయి అనేది మిగతా కథ. 

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: సుమంత్‌ అశ్విన్‌, శ్రీదివ్య, తేజస్వీ, విశ్వనాథ్‌, పార్వతీశం, సుకృతి ఈ ఆరుగురూ తమ తమ పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేశారా అన్నంతగా పెర్‌ఫార్మ్‌ చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఒకర్ని మించి ఒకరు తమ క్యారెక్టర్లలో జీవించారని చెప్పాలి. ఫ్రెండ్‌ షిప్‌ని గానీ, ప్రేమను ఎక్స్‌ప్రెస్‌ చేసే సన్నివేశాల్లోగానీ, ఫ్రెండ్స్‌కి హెల్ప్‌ చేసే సందర్భాల్లోగానీ వీరి పెర్‌ఫార్మెన్స్‌కి ఎక్కడా వంక పెట్టలేని విధంగా చేశారు. జై క్యారెక్టర్‌లో సుమంత్‌ అశ్విన్‌ చాలా సెటిల్డ్‌గా పెర్‌ఫార్మ్‌ చేశాడు. ఫ్రెండ్స్‌కి సమస్య వస్తే దాన్ని ఈజీగా సాల్వ్‌ చేసే ఫ్రెండ్‌గా, ప్రయత్న పూర్వకంగా ప్రియురాలి ప్రేమను పొందకుండా, తన యాటిట్యూడ్‌తో ప్రేమను గెలుచుకునే ప్రియుడిగా అద్భుతంగా నటించాడు. శ్రీకాకుళం యాసలో మాట్లాడుతూ కామెడీని పండిరచడమే కాకుండా తన అమాయకమైన మాటలతో, చేష్టలతో స్నేహితుల ప్రేమను పొందే నూకరాజు క్యారెక్టర్‌లో పార్వతీశం బాగా చేశాడు. సినిమాలో కామెడీ ఏదైనా వుందీ అంటే అది నూకరాజు క్యారెక్టర్‌ ద్వారానే వచ్చింది. తల్లికి భయపడుతూనే మ్యూజిక్‌లో ఎం.ఎ. చేస్తూ, ప్రియతో ప్రేమలో పడి తల్లితో చెప్పలేక సతమతమయ్యే సిద్ధు క్యారెక్టర్‌లో విశ్వనాథ్‌ ఇమిడిపోయాడు. సిద్ధుని అమితంగా ప్రేమించే ప్రియ క్యారెక్టర్‌ తేజస్వి, ఫ్రెండ్స్‌కి మంచి చెడ్డలు చెప్పి, నూకరాజు అజ్ఞానాన్ని పోగొట్టి, అతన్ని ప్రేమించే భావన క్యారెక్టర్‌లో సుకృతి పెర్‌ఫార్మెన్స్‌ అందరికీ కంటతడి పెట్టిస్తుంది. ఇలా సినిమాలో నటించిన ప్రతి ఆర్టిస్టు తమ క్యారెక్టర్స్‌ని అద్భుతంగా పోషించారు. వారి నుంచి హండ్రెడ్‌ పర్సెంట్‌ పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో డైరెక్టర్‌ సాయికిరణ్‌ సక్సెస్‌ అయ్యాడు. 

టెక్నీషియన్స్‌: టెక్నీషియన్స్‌లో ముందుగా చెప్పుకోవాల్సింది మిక్కీ జె. మేయర్‌ గురించి. అతని గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడని చెప్పలేం. అయితే సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా మధ్య మధ్య వచ్చే పాటలు ఆడియన్స్‌ని డిస్ట్రబ్‌ చెయ్యకుండా వుండేలా జాగ్రత్త తీసుకున్నాడని మాత్రం చెప్పాలి. సినిమా ఆద్యంతం స్నేహితుల మధ్య సరదాలు, ఎమోషన్స్‌, తిరస్కారాలు వంటి ఎన్నో సందర్భాల్లో మిక్కీ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాని ముందుకు నడిపించాడు. విజయ్‌ కె.చక్రవర్తి ఆహ్లాదకరమైన ఫోటోగ్రఫీని అందించాడు. సినిమాలో కొత్త లొకేషన్స్‌ అంటూ ఏమీ లేకపోయినా వున్నంతలోనే అందంగా చూపించే ప్రయత్నం చేశాడు. మధు ఎడిటింగ్‌లో అక్కడక్కడా జర్క్‌ వచ్చినట్టుగా అనిపించింది. కొన్ని సన్నివేశాలు సడెన్‌గా ఎండ్‌ అయినట్టు అనిపిస్తాయి. అయినప్పటికీ ఎడిటింగ్‌ కూడా ఓకే అనిపించాడు. డైరెక్టర్‌ సాయికిరణ్‌ విషయానికి వస్తే కాలేజ్‌ లైఫ్‌లో యువతీ యువకుల మధ్య స్నేహం, ప్రేమ వంటి విషయాలు గతంలో వచ్చిన హ్యాపీడేస్‌లో చూసేశాం. అదే బ్యాక్‌డ్రాప్‌ అయినప్పటికీ, అక్కడక్కడా ఆ సినిమా తాలూకు ఛాయలు కనిపించినప్పటికీ కాసేపు సినిమా చూసిన తర్వాత అసలు కథలోకి వెళ్ళిన తర్వాత మనకు ఇక ఏ సినిమా గుర్తు రానంత ఇన్‌వాల్వ్‌ చెయ్యగలిగాడు. ప్రతి క్యారెక్టర్‌కి ఇంపార్టెన్స్‌ ఇస్తూ ఆ క్యారెక్టర్‌ ద్వారా ఏదో ఒక మెసేజ్‌ కూడా ఇచ్చే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని రాబట్టుకొని ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని ఆడియన్స్‌కి కలిగించాడు. 

విశ్లేషణ: సినిమా స్టార్టింగ్‌లోనే మనకు హ్యాపీడేస్‌ గుర్తొస్తుంది. ఎందుకంటే ఆ సినిమాలో వరుణ్‌ సందేశ్‌ ఆ సినిమాకి సంబంధించిన క్యారెక్టర్ల గురించి మనకు ఇంట్రడ్యూస్‌ చేస్తుంటాడు. ఈ సినిమాలో నూకరాజు ఎంటర్‌ అయి అందరి గురించి చెప్తుంటాడు. అందరి క్యారెక్టర్ల గురించి వరసగా చెప్తున్నంత సేపు మనం హ్యాపీడేస్‌ మూడ్‌లోనే వుంటాం. ఆ తర్వాత ఏ క్యారెక్టర్‌ ఏమిటి? అనేది తెలిసిన తర్వాత మరో కొత్త కథలోకి వెళ్తున్నామన్న ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఫస్ట్‌ హాఫ్‌లో ప్రతి సీన్‌ చాలా స్లోగా వెళ్ళడం వల్ల అక్కడక్కడ బోర్‌ కొడుతుంది. ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ప్రేమలో పడిన మూడు జంటల తాలూకు ప్రేమలకు క్వశ్చన్‌ మార్క్‌ ఇవ్వడంతో సెకండాఫ్‌లో ఏం జరుగుతుందీ అనేదానిపై క్యూరియాసిటీని కలిగించాడు దర్శకుడు. ఇక సెకండాఫ్‌లో ఒక్కొక్క ప్రేమకథకు సంబంధించి అందరి అపార్థాలను, భయాలను తొలగించి చివరికి కథను సుఖాంతం చెయ్యడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. మూడు ప్రేమ జంటల ప్రేమకథల ద్వారా ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడమే కాకుండా మంచి సందేశం కూడా ఇచ్చాడు. ఇది తప్పకుండా యూత్‌కి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్‌ అయ్యే కథ. టోటల్‌ సినిమాలో అక్కడక్కడా బోర్‌ కొట్టించినా ఫైనల్‌గా సినిమా బాగుందన్న ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటికి వస్తారు. 

ఫినిషింగ్‌ టచ్‌: హ్యాపీడేస్‌ని మరో కోణంలో చూపించిన ‘కేరింత’

సినీజోష్‌ రేటింగ్‌: 3/5.

- హరా జి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement