Advertisement

సినీజోష్‌ రివ్యూ: సింగం 123

Fri 05th Jun 2015 10:13 AM
singham 123 review,singham 123 movie review,sampoornesh babu,manchu vishnu,cinejosh review singham 123  సినీజోష్‌ రివ్యూ: సింగం 123
సినీజోష్‌ రివ్యూ: సింగం 123
Advertisement

సినీజోష్‌ రివ్యూ: సింగం 123

24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ

సింగం 123

నటీనటులు: సంపూర్ణేష్‌బాబు, సనమ్‌, భవానిప్రసాద్‌,

పృథ్వి, అన్నపూర్ణ తదితరులు

కథ, స్క్రీన్‌ప్లే: మంచు విష్ణు

మాటలు: డైమండ్‌ రత్నం

సినిమాటోగ్రఫీ: ముత్యాల సతీష్‌

సంగీతం: శేషు కె.ఎం.ఆర్‌.

ఎడిటింగ్‌: ఎం.ఆర్‌.వర్మ

సమర్పణ: డా॥ ఎం.మోహన్‌బాబు

నిర్మాత: మంచు విష్ణు

దర్శకత్వం: అక్షత్‌ అజయ్‌శర్మ

విడుదల తేదీ: 05.06.2015

‘హృదయ కాలేయం’తో ప్రేక్షకుల్నే కాదు, సినీ ప్రముఖుల్ని సైతం తనవైపు తిప్పుకున్న సంపూర్ణేష్‌బాబు ఇప్పుడు ‘సింగం123’తో మరోసారి ఎంటర్‌టైన్‌ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డా॥ ఎం.మోహన్‌బాబు సమర్పణలో  24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ పతాకంపై అక్షత్‌ అజయ్‌శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే మంచు విష్ణు అందించారు. మరి ఈ బర్నింగ్‌స్టార్‌ ‘సింగం 123’గా చేసిన కామెడీ ఎలా వుందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: ఈ చిత్రానికి బలమైన కథంటూ ఏమీ లేదు. సింగరాయకొండని లింగం(భవానీ ప్రసాద్‌) అనే రౌడీ ఏలుతుంటాడు. దొంగనోట్లు, కబ్జాలు, హత్యలు.. ఇలా అన్ని రకాల నేరాలకు సంబంధించిన ఫైల్స్‌ బస్తాల నిండా వుంటాయి. కానీ, అతన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరు. పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా పేరు వున్న సింగం ని ఆ ఊరికి పంపిస్తారు. ఫ్లాష్‌బ్యాక్‌ని చెప్పి ఊరికి వెళ్ళడానికి వీల్లేదంటుంది అతని తల్లి. ఆమె మాట లెక్క చేయకుండా ప్రీ క్లైమాక్స్‌లో కలుస్తానంటూ వెళ్ళిపోతాడు సింగం. ఇక అక్కడి నుంచి హీరో, విలన్‌ల మధ్య ఛాలెంజ్‌లు, ఫైట్స్‌.. ఇలా అన్నీ వుంటాయి. మధ్యలో ఈ పోలీసాఫీసర్‌ అందాన్ని చూసి పడిపోయిన హీరోయిన్‌ అతని ప్రేమలో కూడా పడిపోతుంది. ఇదిలా వుంటే సింగం పోలీస్‌ ఆఫీసర్‌ కాదని, ఒక ఖైదీ అని, పోలీసాఫీసర్‌గా అందర్నీ మోసం చేస్తున్నాడన్న వార్త బయటికి వస్తుంది. ఇంతకీ సింగం పోలీసా, ఖైదీనా? సింగంకి, సింగరాయకొండకి వున్న సంబంధం ఏమిటి? ఆ ఊరి పేరు చెప్తే అతని తల్లి ఎందుకు షాక్‌ అయ్యింది? అనేది తెరమీద చూడాల్సిందే.

ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌: స్ఫూఫ్‌ కామెడీతోనే అందర్నీ ఆకట్టుకున్న సంపూర్ణేష్‌బాబు ఈ సినిమాలో కూడా దాన్నే ఫాలో అయ్యేలా చేశారు రచయిత, దర్శకులు. విక్రమార్కుడు, లెజెండ్‌ వంటి చిత్రాల్లోని డైలాగ్స్‌ని యాజిటీజ్‌గా సంపూతో చెప్పించి నవ్వించే ప్రయత్నం చేశారు. సంపూ కూడా అతని శక్తిమేరకు ఆ డైలాగ్స్‌తో కామెడీని తవ్వి తీయడానికి ట్రై చేశాడు. డైలాగ్‌ డెలివరీగానీ, డాన్స్‌గానీ, ఫైట్స్‌గానీ అన్నీ కామెడీగా చేసి మెప్పించడానికి శాయశక్తులా కృషి చేశాడు. ఇక హీరోయిన్‌ సనమ్‌ తన గ్లామర్‌తో వీలైనంత ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది. విలన్‌గా నటించిన భవానీ ప్రసాద్‌ రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాల్లో విలన్‌లాగే చాలా సీరియస్‌గా ట్రై చేశాడు. ఎందుకంటే అతనికి కామెడీ చెయ్యాల్సిన అవసరం లేదు కాబట్టి. పృథ్వి తన క్యారెక్టర్‌కి వున్న లిమిట్స్‌ మేరకు కొన్ని జోకులు పేల్చాడు. వైవా హర్ష కూడా అక్కడక్కడా నవ్వించాడు. 

టెక్నీషియన్స్‌: టెక్నికల్‌గా ఈ సినిమాకి పెద్ద ఎస్సెట్స్‌ ఏమీ లేవని చెప్పొచ్చు. ముత్యాల సతీష్‌ సినిమాటోగ్రఫీ చాలా సాధారణంగా వుంది. బి గ్రేడ్‌, సి గ్రేడ్‌ సినిమాల ఫోటోగ్రఫీని మించి ఈ సినిమాలో విజువల్‌గా వండర్స్‌ ఏమీ చేయలేదు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ శేషు కూడా ఎక్కడా కష్టపడిన దాఖలాలు కనిపించవు. ఒక్క పాట కూడా ఆకట్టుకునేలా లేదు. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ కూడా చాలా పేలవంగా వెరీ లోబడ్జెట్‌ మూవీకి చేసినట్టుగా వుంది. మంచు విష్ణు కథ, స్క్రీన్‌ప్లే అందించినట్టుగా చెప్తున్న ఈ సినిమాలో అసలు కథంటూ ఏమీ లేదు, పైగా స్క్రీన్‌ప్లే అనేది సినిమాలో ఎక్కడా కనిపించదు. అతుకుల బొంతలా సీన్స్‌ వస్తుంటాయి, పోతుంటాయి. ఒక దానికి ఒకటి సంబంధం వుందా లేదా అని ఆలోచించుకునే టైమ్‌ కూడా వుండదు. ఒక ఫైట్‌ జరుగుతుంది, వున్నట్టుండి వెంటనే ఒక లవ్‌ సీన్‌, ఆ వెంటనే ఒక కామెడీ డైలాగ్స్‌తో కూడిన సీన్‌..ఇలా ఏ సీన్‌కి ఆ సీన్‌ తీసినట్టుగా వుంటుంది తప్ప సినిమాకి ఒక ఫ్లో అనేది లేదు. డైరెక్టర్‌ అక్షత్‌ అజయ్‌శర్మ టాలెంట్‌ ఏమిటో ఒక్క సీన్‌లో కూడా మనకు అర్థం కాదు. కథ, కథనాలను బట్టే అతనూ ఫాలో అయిపోయి వుంటాడు తప్ప కొత్తగా ఆలోచించేందుకు కూడా ఏమీ కనిపించదు. ఇక డైమండ్‌ రత్నం రాసిన డైలాగ్స్‌ కొన్ని మాత్రమే బాగున్నాయి. కొన్ని డైలాగ్స్‌ లెంగ్తీగా వుండడమే కాకుండా వినడానికి చిరాకు పుట్టించేవిగా వున్నాయి. తన డైలాగ్స్‌తో కామెడీ పుట్టించాలని రత్నం చేసిన ప్రయత్నం పూర్తిగా సఫలం కాలేదు. 

ప్లస్‌ పాయింట్‌:

అక్కడక్కడ పేలిన డైలాగ్స్‌

మైనస్‌ పాయింట్స్‌:

కథ లేకపోవడం

స్క్రీన్‌ప్లే

అతి కామెడీ

ఓవర్‌ స్ఫూఫ్‌ డైలాగ్స్‌

విశ్లేషణ: ‘హృదయ కాలేయం’ సాధించిన విజయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి సినిమా ఒకటి చెయ్యాలని డిసైడ్‌ అయ్యాడు మంచు విష్ణు బృందం. అందులో భాగంగా ఒక వెరైటీ టైటిల్‌ని సెలెక్ట్‌ చేసుకున్నారు. రిలీజ్‌ రోజు ఓపెనింగ్స్‌ ఆ టైటిల్‌ని బట్టే రావాలి తప్ప మరో రీజన్‌ ఏమీ లేదు. ఒక పోలీస్‌ ఆఫీసర్‌గా సంపూర్ణేష్‌బాబు ఎలాంటి కామెడీని చేస్తాడో చూద్దామన్న క్యూరియాసిటీతో వచ్చే ప్రేక్షకులను నిరాశ పరిచాడు సంపూ. అతని రెండో సినిమాకి ఎంచుకున్న కథ దెబ్బ తీసింది. ఎంతసేపూ హిట్‌ అయిన సినిమాల్లోని డైలాగ్స్‌తోనే సినిమా అంతా రన్‌ చేద్దామనుకుంటే పొరపాటు. ఒకటి, రెండు డైలాగ్స్‌ వింటే నవ్వొస్తుంది కానీ, సినిమా అంతా అలాంటి డైలాగ్స్‌ని భరించడానికి ఆడియన్స్‌కి సహనం వుండదనేది సింగం 123 ప్రూవ్‌ చేసింది. సినిమా స్టార్ట్‌ అయిన మొదటి 15 నిముషాల్లో సంపూ ఎంట్రీ ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్‌, ఆ సీన్స్‌లోని డైలాగ్స్‌ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చేసాయి. ఆ తర్వాత అతను ఎంత కామెడీగా డైలాగ్స్‌ చెప్పినా, ఎంత కామెడీగా ఫైట్స్‌ చేసినా ఆడియన్స్‌లో రెస్పాన్స్‌ లేదు. అక్కడక్కడా నవ్వక చస్తామా అన్నట్టు నవ్వుతున్నారే తప్ప నిజానికి ఆ సీన్స్‌లోగానీ, ఆ డైలాగ్స్‌లోగానీ అంత విషయం లేదు. ఇక ప్రొడక్షన్‌ వేల్యూస్‌ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో అది శూన్యం అని చెప్పాలి. చాలా తక్కువ బడ్జెట్‌లో సినిమాని చుట్టేసినట్టుగా అనిపిస్తుంది తప్ప ఎక్కడా రిచ్‌నెస్‌ అనేది కనిపించదు. కొన్ని సీన్స్‌ చూస్తుంటే సినిమా అంతా ఒకేరోజులో తీసేశారా అన్న ఫీలింగ్‌ కూడా కలుగుతుంది. సంపూ మొదటి సినిమా ‘హృదయ కాలేయం’లో అతిశయోక్తిగా అనిపించే చాలా సీన్స్‌ వున్నప్పటికీ వాటిని కన్విన్సింగ్‌ చెప్పడం, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుండడం వల్ల అందరూ చూసి ఎంజాయ్‌ చెయ్యగలిగారు. కానీ, ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. మరో విషయం ఏమిటంటే 1 గంట 55 నిముషాల సినిమాలో విలన్‌గా నటించిన భవానీ ప్రసాద్‌ మొదటి నుంచి చివరి వరకు ఒక్కో సీన్‌లో ఒక్కోలా కనిపించడం విశేషం. అదేమిటంటే ఒక సీన్‌లో ఫుల్‌గా గడ్డంతో, మరో సీన్‌లో ట్రిమ్‌ చేసిన గడ్డంతో.. అలా వెంట వెంటనే వచ్చే సీన్స్‌లో కూడా కనిపించాడు. దీన్నిబట్టి సినిమాని ఏ రేంజ్‌లో చుట్టేసారో అర్థమవుతుంది. సినిమా ఫస్ట్‌ హాఫ్‌లో ఎలా వుంటుందో, సెకండాఫ్‌ కూడా అలాగే వుంటుంది. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కానీ, క్లైమాక్స్‌గానీ, ప్రీ క్లైమాక్స్‌గానీ ఏదీ డిఫరెంట్‌గా వుండదు. ఫైనల్‌గా చెప్పాలంటే హిట్‌ అయిన తెలుగు సినిమాల్లోని డైలాగ్స్‌ని సంపూర్ణేష్‌బాబు నోట విని ఎంజాయ్‌ చేయాలనుకునేవారు మాత్రం ఈ సినిమా చూడొచ్చు. సంపూ రెండో సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అవకాశాలు తక్కువ. 

ఫినిషింగ్‌ టచ్‌: అతుకుల బొంత.. కలగూర గంప

సినీజోష్‌ రేటింగ్‌: 2.25/5

- హరా జి. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement