Advertisement

సినీజోష్‌ రివ్యూ: డా.సలీమ్‌

Fri 13th Mar 2015 07:37 AM
telugu movie dr.salim,dr.salim review,vijay antony,aksha,n.v.nirmal kumar  సినీజోష్‌ రివ్యూ: డా.సలీమ్‌
సినీజోష్‌ రివ్యూ: డా.సలీమ్‌
Advertisement

ఎస్‌.కె.పిక్చర్స్‌, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ 

డా.సలీమ్‌

నటీనటులు: విజయ్‌ ఆంటోని, అక్ష పార్థసాని తదితరులు 

సినిమాటోగ్రఫీ: ఎం.సి.గణేష్‌చంద్ర

సంగీతం: విజయ్‌ ఆంటోని

మాటలు: సాహితి

నిర్మాతలు: సురేష్‌ కొండేటి, తమటం కుమార్‌రెడ్డి

కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎన్‌.వి.నిర్మల్‌కుమార్‌

విడుదల తేదీ: 13.03.2015

సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోని హీరోగా వచ్చిన మొదటి సినిమా ‘నకిలి’ తమిళ్‌లో విజయం సాధించింది. అదే పేరుతో తెలుగులో వచ్చిన ఈ చిత్రానికి ఇక్కడ కూడా మంచి పేరు వచ్చింది. ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌ ఆంటోని హీరోగా ఎన్‌.వి.నిర్మల్‌కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో రూపొందిన ‘సలీమ్‌’ చిత్రం ఘనవిజయం సాధించడమే కాకుండా రికార్డు కలెక్షన్లు రాబట్టింది. ఈ చిత్రాన్ని ‘డా.సలీమ్‌’ పేరుతో ఎస్‌.కె. పిక్చర్స్‌, శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ పతాకాలపై సురేష్‌ కొండేటి, తమటం కుమార్‌రెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్‌లో పెద్ద హిట్‌ చిత్రంగా నిలిచిన ‘సలీమ్‌’ తెలుగులో ‘డా.సలీమ్‌’గా ఏమేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో తెలుసుకోవడానికి సమీక్షలోకి వెళ్దాం. 

కథ: సలీమ్‌(విజయ్‌ ఆంటోని). అతనొక నిజాయితీగల డాక్టర్‌. ఒక కార్పొరేట్‌ హాస్పిటల్‌లో డాక్టర్‌గా పనిచేసే అతనికి సేవా దృక్పథం ఎక్కువ. అనాధలకు సాయం చెయ్యడంలో, పేదవారికి తక్కువ ఖర్చుతో వైద్యం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. అతని వల్ల హాస్పిటల్‌ ఆదాయానికి గండి పడుతోందని తోటి డాక్టర్లు ఎం.డి. దగ్గర వాపోతుంటారు. దాంతో సలీమ్‌ని ఉద్యోగం నుంచి తొలగిస్తాడు హాస్పిటల్‌ ఎం.డి. ఉద్యోగంలో వుండగానే అతనికి నిషా(అక్ష) అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడతారు. సలీమ్‌తో సరదాగా గడపాలన్న నిషా కోరిక తీరదు. ఎప్పుడూ హాస్పిటల్‌, సోషల్‌ అవేర్‌నెస్‌ పేరుతో రోజురోజుకీ ఆమెకు దూరమవుతుంటాడు. విసిగిపోయిన నిషా అతనితో పెళ్ళి క్యాన్సిల్‌ చేసుకుంటుంది. ఆ వెంటనే అతని ఉద్యోగం కూడా పోతుంది. దాంతో విరక్తి చెందిన సలీమ్‌ మందు కొట్టి రోడ్డున పడతాడు. తన ఉద్యోగం పోవడానికి కారకులైన వారిని చితక బాదుతాడు. ఓరోజు ఓ హోటల్‌లో ఓ అమ్మాయిని వేధిస్తున్న నలుగురు కుర్రాళ్ళను అడ్డుకొని వారిని బంధిస్తాడు సలీమ్‌. అందులో ఓ కుర్రాడు హోం మినిస్టర్‌ కొడుకు. దీంతో పోలీసులు ఈ కేసుని ఛాలెంజ్‌గా తీసుకుంటారు. హోటల్‌ని చుట్టు ముడతారు. వైద్యం పేరుతో రోగుల్ని దోచుకుంటున్న హాస్పిటల్‌ యాజమాన్యాన్ని ఎదిరించిన సలీమ్‌కి హోం మినిస్టర్‌ కొడుకుని కిడ్నాప్‌ చెయ్యాల్సిన అవసరం ఏమొచ్చింది? అతని డిమాండ్స్‌ ఏమిటి? సలీమ్‌ని పోలీసులు పట్టుకోగలిగారా? సలీమ్‌ ఏం సాధించాలనుకున్నాడు? ఈ విషయాలు తెలసుకోవాలంటే మిగతా సినిమా చూడాల్సిందే.

ప్లస్‌ పాయింట్స్‌: ఒక మినిస్టర్‌ కొడుకుని కిడ్నాప్‌ చేసి తన డిమాండ్స్‌ పోలీసుల ముందుంచి వాటిని సాధించుకోవడం అనేది కొత్త పాయింటేమీ కాదు. ఇలాంటి కథలతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో కథ కంటే కథనానికి ప్రాధాన్యత వుంది. సినిమా స్టార్ట్‌ అయినప్పటి నుంచి ఎండిరగ్‌ వరకు హీరో ఏం చేయబోతున్నాడనే విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డాడు డైరెక్టర్‌. నిర్మల్‌కుమార్‌కి ఇది ఫస్ట్‌ మూవీ అయినప్పటికీ ఆ ఛాయలేవీ కనపడకుండా చాలా జాగ్రత్తగా హ్యాండిల్‌ చేశాడు. ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ విషయానికి వస్తే ఇది విజయ్‌ ఆంటోని ఒన్‌ మ్యాన్‌ షో అని చెప్పాలి. కథ అంతా సలీమ్‌ చుట్టే తిరుగుతూ వుంటుంది. సలీమ్‌ క్యారెక్టర్‌ని విజయ్‌ ఆంటోని పర్‌ఫెక్ట్‌గా చేశాడు. అక్ష క్యారెక్టర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఆమె పాత్ర పరిధి మేరకు ఫర్వాలేదనిపించింది. గణేష్‌ చంద్ర ఫోటోగ్రఫీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. ఇక విజయ్‌ ఆంటోని మ్యూజిక్‌ గురించి చెప్పాలంటే హీరో, హీరోయిన్‌పై వచ్చే ఫస్ట్‌ సాంగ్‌ని మంచి బీట్‌తో కంపోజ్‌ చేశాడు. ఈ పాటని ఔట్‌ డోర్‌లో రేర్‌ లొకేషన్స్‌లో అద్భుతంగా షూట్‌ చేశారు. ఈ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బ్యాక్‌బోన్‌గా నిలిచిందని చెప్పాలి. చాలా ఎక్స్‌లెంట్‌ ఆర్‌.ఆర్‌. చేశాడు విజయ్‌ ఆంటోని. 

మైనస్‌ పాయింట్స్‌: సినిమా స్టార్ట్‌ అవ్వడమే చాలా స్లోగా స్టార్ట్‌ అవుతుంది. స్లో నేరేషన్‌ అనేది సినిమా కంప్లీట్‌ అయ్యే వరకు కొనసాగుతుంది. అయితే కథలో ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ వుండడం వల్ల ఆడియన్స్‌ని సీట్లలో కూర్చొబెట్టగలిగాడు డైరెక్టర్‌. సినిమా ప్రారంభంలో హాస్పిటల్‌, అందులో పేషెంట్లను డాక్టర్లు, యాజమాన్యం ఎలా దోచుకుంటుందీ అనే అంశాలను చూపించారు. ఆ అన్యాయాలను డా. సలీమ్‌ ఎదుర్కొంటాడని, హాస్పిటల్‌ నేపథ్యంలోనే సినిమా అంతా వుంటుందని భావించిన ఆడియన్స్‌కి మరో కొత్త కథ చూపించాడు డైరెక్టర్‌. హీరో, హీరోయిన్‌ మధ్య కెమెస్ట్రీ అస్సలు కుదరలేదు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్‌ కూడా ఇంట్రెస్టింగ్‌గా వుండవు. నిశ్చితార్థం తర్వాత సలీమ్‌తో నిషా పెళ్ళిని రద్దు చేసుకునేంత పెద్ద కారణం మనకు కనిపించదు. ఈ విషయంలో నిషా క్యారెక్టర్‌ని పూర్తిగా నెగెటివ్‌గా చూపించారు. మినిస్టర్‌ కొడుకుని, అతని ఫ్రెండ్స్‌ని కిడ్నాప్‌ చేసి హోటల్‌లో బంధీలుగా వుంచిన తర్వాత అతనికి, పోలీసులకు, మినిస్టర్‌కి మధ్య జరిగే ఫోన్‌ సంభాషణలు ఎక్కువ కావడంతో ఆడియన్స్‌కి బోర్‌ కొడుతుంది. అంతేకాకుండా సినిమా  స్టార్టింగ్‌ టు ఎండిరగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది లేకపోవడంతో ఆడియన్స్‌ రిలాక్స్‌ అయ్యే ఛాన్స్‌ లేకుండా సీరియస్‌గా సినిమా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 

విశ్లేషణ: స్లో నేరేషన్‌ అయినా, కామెడీ అనేది లేకపోయినా ఒక కొత్త తరహా సినిమా చూశామన్న ఫీల్‌ కలిగిస్తుంది ‘డా.సలీమ్‌’. ఫస్ట్‌ హాఫ్‌లో హాస్పిటల్‌ సీన్స్‌, హీరో, హీరోయిన్‌ మధ్య సీన్స్‌, నిశ్చితార్థం, వాళ్ళిద్దరూ విడిపోవడం వంటి సీన్స్‌తో కథ ముందుకు వెళ్ళినట్టు అనిపించినా, సెకండాఫ్‌కి వచ్చేసరికి మినిస్టర్‌ కొడుకు కిడ్నాప్‌తో సినిమా అంతా ఆ హోటల్‌ చుట్టూనే తిరుగుతూ క్లైమాక్స్‌ వరకు కదలదు. అయితే సెకండాఫ్‌లో చాలా చోట్ల తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్ట్‌ కలుగుతుంది. సెకండాఫ్‌లోనే సినిమాని ముందుకు నడిపించడం కోసం కొన్ని అనవసరమైన సీన్స్‌ని కూడా ఇరికించారు. స్లో నేరేషన్‌ అయినా చూసే ఓపిక తమిళ ప్రేక్షకులకు వుంటుంది. తెలుగు ప్రేక్షకుల విషయానికి వస్తే డైరెక్టర్‌ చెప్పాలనుకున్న విషయం ఎంత ఫాస్ట్‌గా చెప్తే అంత మంచిది అనే మైండ్‌ సెట్‌లో వుంటారు. అయితే ఒక కొత్త డైరెక్టర్‌, కొత్త సినిమాటోగ్రాఫర్‌, కొత్త ఆర్ట్‌ డైరెక్టర్‌.. హీరో, హీరోయిన్‌ని మినసహాయిస్తే అందరూ కొత్త ఆర్టిస్టులే. అందరూ కొత్తవారితో విజయ్‌ ఆంటోని చేసిన ప్రయత్నాన్ని తప్పక అభినందించాల్సిందే. రొటీన్‌ సినిమాలు చూసి విసిగి వేసారిన ప్రేక్షకులకు ఈమధ్యకాలంలో అడపా దడపా కొన్ని డిఫరెంట్‌ మూవీస్‌ చూసే అవకాశం కలుగుతోంది. అలాంటి సినిమాల్లో ‘డా.సలీమ్‌’ కూడా ఒకటి అని చెప్పొచ్చు. తమిళ్‌లో కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ అయి మంచి కలెక్షన్లు సాధించిన ఈ సినిమా తెలుగులో ఎంతవరకు కమర్షియల్‌ సక్సెస్‌ అవుతుందో వెయిట్‌ అండ్‌ సీ. 

ఫినిషింగ్‌ టచ్‌: మరో కొత్త తరహా సినిమా

సినీజోష్‌ రేటింగ్‌: 3/5

telugu movie dr.salim,dr.salim review,vijay antony,aksha,n.v.nirmal kumar
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement