Advertisement

సినీజోష్‌ రివ్యూ: మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు

Fri 06th Feb 2015 09:11 PM
malli malli idi rani roju,sarvanand,nitya menon,kranthi madhav,ks ramarao  సినీజోష్‌ రివ్యూ: మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు
సినీజోష్‌ రివ్యూ: మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు
Advertisement

సి.సి. మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌

మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు

నటీనటులు: శర్వానంద్‌, నిత్యా మీనన్‌, పవిత్ర లోకేష్‌, సూర్య,

నాజర్‌, తేజస్విని తదితరులు

కెమెరా: జ్ఞానశేఖర్‌ వి.ఎస్‌.

ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: గోపిసుందర్‌

మాటలు: సాయిమాధవ్‌ బుర్రా

సమర్పణ: కె.ఎస్‌.రామారావు

నిర్మాత: కె.ఎ.వల్లభ

దర్శకత్వం: కె.క్రాంతిమాధవ్‌

విడుదల తేదీ: 6.2.2015

క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో ఎన్నో కమర్షియల్‌ హిట్స్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, ఫీల్‌గుడ్‌ మూవీస్‌ని నిర్మించిన కె.ఎస్‌.రామారావు తన సమర్పణలో తాజాగా సి.సి. మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ లిమిటెడ్‌ పతాకంపై ‘ఓనమాలు’ దర్శకుడు కె.క్రాంతిమాధవ్‌ దర్శకత్వంలో కె.ఎ.వల్లభ నిర్మాతగా నిర్మించిన చిత్రం ‘మళ్ళీమళ్ళీ ఇది రానిరోజు’. పవిత్ర ప్రేమకు అర్థం మారిపోయిన ఈరోజుల్లో ప్రేమ అంటే ఎలా వుంటుంది, దాని గొప్పతనం ఏమిటి? ప్రేమంటే డేటింగ్‌ కాదని, గంటల తరబడి ఫోన్‌లో మాట్లాడుకోవడం కాదని, ఇంటర్నెట్‌లో చాటింగ్‌ చేయడం కాదని, ప్రేమంటే ఒక అనిర్వచనీయమైన అనుభూతి అని ఈ చిత్రం ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. శర్వానంద్‌, నిత్యా మీనన్‌ ముఖ్యపాత్రల్లో రూపొందిన ఈ ప్రేమకథా చిత్రం ఈరోజు విడుదలైంది. కొత్తదనం వున్న చిత్రాలను ప్రేక్షకులకు అందించాలన్న తపన వున్న కె.ఎస్‌.రామారావు ఈ తరం ప్రేక్షకులకు ఎలాంటి ప్రేమకథను అందించారు? ఈ సినిమా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? అనే విషయాలు సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.

కథ: రాజారామ్‌(శర్వానంద్‌) కొన్ని సంవత్సరాల క్రితం ఒక అథ్లెట్‌. నేషనల్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రన్నర్‌. ప్రస్తుతానికి వస్తే టీనేజ్‌లో వున్న అమ్మాయికి తండ్రి. తను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న స్కైప్స్‌తో మాట్లాడుకుంటూ వుంటాడు. అలా మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే.. తండ్రిలేని రాజారామ్‌కి తోడుగా వున్న తల్లి మాత్రమే. సంగీతం పాఠాలు చెప్తూ ఇంటిని నడుపుతుంటుంది తల్లి పార్వతి(పవిత్ర లోకేష్‌). తన కొడుకు నేషనల్‌ లెవల్‌లో గెలిచి గోల్డ్‌ మెడల్‌ సాధించాలనేది ఆ తల్లి కోరిక. డిస్ట్రిక్ట్‌ లెవల్‌ పోటీల్లో రాజారామ్‌ని తొలిసారి చూస్తుంది నజీరా(నిత్యా మీనన్‌). ఆరు వేల రూపాయలతో స్పైక్స్‌ కొనుక్కునే స్థోమత కూడా లేని రాజారామ్‌ అంటే ఇష్టపడుతుంది నజీరా(నిత్యమీనన్‌). ఎప్పుడూ బుర్ఖాలో కనిపించే నజీరా కళ్ళతో మాత్రమే రాజారామ్‌కి పరిచయం వుంటుంది. అలా నజీరాతో ప్రేమలో పడతాడు రాజారామ్‌. ఖానం పేరుతో బుర్ఖా లేకుండా కళ్ళజోడుతో డిఫరెంట్‌ గెటప్‌తో పార్వతి దగ్గర సంగీతం నేర్చుకోవడానికి వస్తుంది నజీరా. రాజారామ్‌ తన ప్రేమ కోసం తపించడం, తన కోసం వెతకడం చూసి ముచ్చటపడిన నజీరా బుర్ఖాలోనే కొన్నాళ్ళు తన చుట్టూ తిప్పుకుంటుంది. కొన్నిరోజుల తర్వాత ఖానంగా ఇంటికి వస్తోంది నజీరాయేనని తెలుసుకుంటాడు రాజారామ్‌. ఓరోజు తను కూడా అతన్ని ప్రేమిస్తున్నానని చెప్తుంది. అదే టైమ్‌లో నజీరాను అర్జెంటుగా ఇంటికి రమ్మని బాబాయ్‌ నుంచి కబురు వస్తుంది. వెళ్తూ వెళ్తూ తనను సముద్రం ఒడ్డున కలుసుకొమ్మని సంకేతాలు ఇస్తుంది. నజీరా కోసం ఎదురుచూస్తున్న రాజారామ్‌కి అనుకోని షాక్‌ తగులుతుంది. తన తల్లి చనిపోయిందన్న విషయం తెలుసుకొని ఇంటికి పరిగెడతాడు. బాబాయ్‌తో కలిసి కారులో వెళ్తున్న నజీరా తల్లి శవాన్ని శ్మశానానికి తీసుకెళ్తున్న రాజారామ్‌ని చూసి షాక్‌ అవుతుంది. ఆ తర్వాత రాజారామ్‌కి నజీరా నుంచి ఒక లెటర్‌ అందుతుంది. తనకి పెళ్ళి నిశ్చయమైందని, తనని మర్చిపొమ్మని ఆ లెటర్‌లో వుంటుంది. హఠాత్తుగా నజీరా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? రాజారామ్‌ తన ప్రేమని, నజీరాని మర్చిపోగలిగాడా? నజీరాకు నిజంగానే పెళ్ళి జరిగిందా? రాజారామ్‌ పెళ్ళి చేసుకున్నాడా? తన  దగ్గర పార్వతి పేరుతో పెరిగిన అమ్మాయి ఎవరు? చివరికి రాజారామ్‌, నజీరాలు కలుసుకున్నారా? వాళ్ళిద్దరూ విడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలేమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మిగతా సినిమా. 

ప్లస్‌ పాయింట్స్‌: ఇప్పుడొస్తున్న రొటీన్‌ ప్రేమకథలకు భిన్నంగా ఒక పవిత్రమైన ప్రేమకథ అనే పాయింట్‌ ఈ సినిమాకి ఒక ప్లస్‌ పాయింట్‌. దానికి తగ్గట్టుగా కథను అల్లుకోవడం, కథకు తగినట్టుగా శర్వానంద్‌, నిత్యామీనన్‌ లాంటి ఆర్టిస్టుల్ని సెలెక్ట్‌ చేసుకోవడం పెర్‌ఫార్మెన్స్‌ పరంగా సినిమాకి బాగా ప్లస్‌ అయింది. రాజారామ్‌ పాత్రను శర్వానంద్‌, నజీరా పాత్రను నిత్యామీనన్‌ అద్భుతంగా పోషించారు. ఒక విధంగా నిత్యామీనన్‌కే ఈ విషయంలో ఎక్కువ మార్కులు వెయ్యాలి. సిట్యుయేషన్‌కి తగినట్టుగా తన ఎక్స్‌ప్రెషన్స్‌, డైలాగ్‌ డెలివరీ అన్నీ బాగా కుదిరాయి. నజీరా పాత్రకు హండ్రెడ్‌ పర్సెంట్‌ నిత్య సూట్‌ అయింది. ఒక అందమైన ప్రేమకథకు మంచి సినిమాటోగ్రఫీ, ఆహ్లాదకరమైన సంగీతం అవసరమవుతాయి. దానికి తగ్గట్టుగానే జ్ఞానశేఖర్‌ ఈ చిత్రాన్ని అద్భుతమైన ఫోటోగ్రఫీతో ఒక పెయింటింగ్‌లా చిత్రీకరించాడు. మలయాళంలో టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అయిన గోపిసుందర్‌ తన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌తో సినిమాకి ఒక ఫీల్‌ని తీసుకొచ్చాడు. ఈ సినిమాలో పాటలు అంత చెప్పుకోదగినట్టు లేకపోయినా బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాని నడిపించింది. డైరెక్టర్‌ క్రాంతి మాధవ్‌ ప్రతి ఫ్రేమ్‌ని జాగ్రత్తగా తీర్చిదిద్డాడు. ఆర్టిస్టుల నుంచి తనకు కావాల్సిన పెర్‌ఫార్మెన్స్‌ని, ఫీల్‌ని రాబట్టగలిగాడు. ఇక ఈ సినిమాకి చెప్పుకోదగ్గ మెయిన్‌ ప్లస్‌ డైలాగ్స్‌. సాయిమాధవ్‌ బుర్రా రాసిన ప్రతి డైలాగ్‌ గుండెకు హత్తుకునేలా వుంది. సినిమా స్టార్టింగ్‌ నుంచి ఎండిరగ్‌ వరకు డైలాగ్‌ రైటరే ఎక్కువ పనిచేసినట్టు సినిమా చూస్తే తెలుస్తుంది. ప్రతి డైలాగ్‌ అందరికీ అర్థమయ్యేలా రాయడంలో సాయిమాధవ్‌ హండ్రెడ్‌ పర్సెంట్‌ సక్సెస్‌ అయ్యాడు. 

మైనస్‌ పాయింట్స్‌: ఇది ఒక పవిత్రమైన ప్రేమకథ. అంతవరకూ ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఈ తరం ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు ఎంతవరకు రుచిస్తాయి, ఎంతమందికి ఈ పవిత్రమైన ప్రేమకథ రీచ్‌ అవుతుంది అనేది దర్శకనిర్మాతలు ఆలోచించాల్సిన విషయం. ఒక మంచి ప్రేమకథను ప్రేక్షకులకు చెప్పాలంటే స్టార్టింగ్‌  నుంచి ఎండిరగ్‌ వరకు సీరియస్‌గానే సినిమా వుండాలన్న రూలేం లేదు. ఆడియన్స్‌ థియేటర్స్‌కి వచ్చేది రిలాక్స్‌ అవడం కోసం, ఎంటర్‌టైన్‌ అవడం కోసం. ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటే కామెడీయే అవ్వక్కర్లేదు. దర్శకనిర్మాతలు ఒక మంచి సినిమా ప్రేక్షకులకు అందించాలన్న ప్రయత్నం మంచిదే. అయితే ప్రేక్షకుల పల్స్‌ ఏమిటి? వాళ్ళు ఎలాంటి సినిమాని ఆదరిస్తారు అనేది ఆలోచించడం కూడా అవసరమే. ఈ సినిమా విషయానికి వస్తే సినిమాలో ఎక్కడా కామెడీ అనేది లేదు. కామెడీ విషయం మర్చిపోయి పూర్తి తను అనుకున్న కథ మీదే కాన్‌సన్‌ట్రేట్‌ చేశాడు డైరెక్టర్‌. ఈమధ్యకాలంలో ఒన్‌ పర్సెంట్‌ కామెడీ కూడా లేకుండా వచ్చిన సినిమా ఇదేనని చెప్పొచ్చు. ప్రేమించుకొని విడిపోయిన ప్రేమికులిద్దరికీ టీనేజ్‌లో వున్న అమ్మాయిలు వున్నట్టు చూపిస్తూ నిజంగా వాళ్ళిద్దరికీ విడివిడిగా పెళ్ళిళ్ళు అయిపోయాయా అనే భ్రమలో ఎక్కువ సేపు వుంచే ప్రయత్నం చేశాడు డైరెక్టర్‌. ప్రియురాలి కోసం, ప్రియుడి కోసం ఏళ్ళ తరబడి వేచి వుండే క్యారెక్టర్స్‌ గతంలో ఎన్నో సినిమాల్లో చూసేసి వుండడం వల్ల ఆడియన్స్‌ అలాంటి భ్రమకు లోను అవరు. 

విశ్లేషణ: చాలా కాలం తర్వాత ఆడియన్స్‌కి ఒక మంచి ప్రేమకథ ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’. ఇందులో చాలా ప్లస్‌లు, చాలా మైనస్‌లు వున్నప్పటికీ రొటీన్‌గా మనం చూస్తున్న వెకిలి కామెడీ, హీరోహీరోయిన్ల అల్లరి ఇందులో లేకపోవడంవల్ల ఫ్యామిలీ ఆడియన్స్‌ చాలా హ్యాపీగా చూడొచ్చు. డైలాగ్స్‌ అందరికీ నచ్చే విధంగా వుండడమే కాకుండా ద్వంద్వార్థాలు అనే మాటే ఈ సినిమాలో ఎక్కడా కనిపించదు. హీరో, హీరోయిన్‌ పాత్రలు పవిత్రంగా చూపించే ప్రయత్నం చేశారు. హీరోయిన్‌ని ఎక్స్‌పోజ్‌ చెయ్యాలని ఎక్కడా ట్రై చెయ్యలేదు. సినిమాలో డైలాగ్స్‌ బాగున్నప్పటికీ అవసరానికి మించి డైలాగ్స్‌ వున్నాయోమోనన్న సందేహం కూడా కలుగుతుంది. స్పీడ్‌గా వుండే సినిమాలకు అలవాటుపడిన యూత్‌కి ఈ సినిమా నచ్చకపోవచ్చు. క్లీన్‌గా వుండే లవ్‌స్టోరీ అయినప్పటికీ స్లో నేరేషన్‌ వల్ల ఆడియన్స్‌కి చాలా చోట్ల బోర్‌ అనిపిస్తుంది. ఎంతసేపూ సముద్రం, హీరో ఇల్లు, కాలేజీ తప్ప కొత్త లొకేషన్స్‌ అనేవి సినిమాలో కనిపించవు. మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌కి మాత్రమే ఈ సినిమా నచ్చే అవకాశం వుంది. బి, సి సెంటర్స్‌ ఆడియన్స్‌కి ఈ కాన్సెప్ట్‌ నచ్చకపోవచ్చు. హీరో, హీరోయిన్‌ క్యారెక్టర్స్‌ కూడా వారికి కనెక్ట్‌ అవ్వవు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో వచ్చిన ఓ ఫీల్‌గుడ్‌ మూవీగా ఈ చిత్రం నిలుస్తుంది. ఈమధ్య కాలంలో ఇలాంటి ఫీల్‌గుడ్‌ లవ్‌స్టోరీ రాలేదు కాబట్టి లవ్‌ ఫీల్‌ అవ్వాలనుకునేవారు ఈ సినిమా హ్యాపీగా చూడొచ్చు. అయితే కమర్షియల్‌గా ఈ సినిమా ఎంతవరకు సక్సెస్‌ అవుతుందనేది ప్రేక్షకులే నిర్ణయించాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: మళ్ళీ మళ్ళీ ఇలాంటి సినిమా చూస్తారా?

సినీజోష్‌ రేటింగ్‌: 2.75/5

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement