అతడు హిందూ వ్యతిరేకి అంటూ ముద్ర వేసారు. ఉగ్ర మూకల ముసల్మాన్ దేశానికి వంత పాడుతున్నాడు అంటూ అతడిని సీరియస్ గా చూస్తున్నారు ఒక వర్గం ప్రజలు, రాజకీయ నాయకులు. వీలున్న ప్రతి వేదికపైనా అతడి పేరును ప్రస్తావిస్తూ వివాదాగ్ని రాజేస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి కారణంగా, పాకిస్తానీ నటితో కలిసి నటించినందున అతడిని బహిష్కరించాలని పలు హిందూ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే అతడికి మాత్రమే కాదు అతడికి మద్ధతుగా ఉన్న సహ నటులకు కూడా హెచ్చరికలు, బెదిరింపులు ఎదురవుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో మనోభావాలు దెబ్బ తింటే పరిస్థితి ఎలా ఉంటుందో ఇది రివీల్ చేస్తోంది. ఈ ఎపిసోడ్ అంతా గాయకుడు కం నటుడు దిల్జీత్ దోసాంజ్ గురించే. అతడు నటించిన సర్దార్జీ 3 చిత్రంలో పాకిస్తానీ నటి హనియా అమీర్ కి అవకాశం కల్పించడంతో ఈ సినిమాని దేశంలో రిలీజ్ కానివ్వలేదు. పహల్గామ్ దాడికి చాలా ముందే పాకిస్తానీ నటికి అవకాశం కల్పించినా కానీ, ధైర్యం చేసి సినిమాని రిలీజ్ చేయలేకపోయారు. ఇదిలా ఉంటే, ఇప్పుడు దిల్జీత్ దోసాంజ్ ని ప్రతిష్ఠాత్మక బార్డర్ 2 చిత్రం నుంచి తొలగించారని ప్రచారం సాగిపోతోంది. సన్నీడియోల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో దిల్జీత్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. కానీ పలు హిందూ సంఘాలు దర్శకనిర్మాతలను హెచ్చరిస్తూ అతడిని సినిమా నుంచి తొలగించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది. అయితే అది సాధ్యపడదు అంటూ చిత్రబృందం తిరస్కరించిందట. పహల్గామ్ దాడికి 9నెలల ముందే అతడిని ఎంపిక చేసుకున్నాం. తనపై చిత్రీకరణ పూర్తయిందని చెప్పారట.
తాజాగా దిల్జీత్ దోసాంజ్ మీసం మెలేస్తూ కారవ్యాన్ నుంచి సెట్లో దిగుతున్న ఓ వీడియోని రిలీజ్ చేసారు. అక్కడ ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. సెట్లో దిల్జీత్ చాలా ధీమాగా కనిపిస్తున్నాడు. ఒక రకంగా ఈ హిందూవాదులు ఎంతగా అరిచి గోలపెట్టినా తనను ఏమీ చేయలేరనే సందేశాన్ని ఇచ్చాడు.