ఒక సూపర్‌స్టార్ కి నటవారసుడిగా పరిశ్రమలో ప్రవేశించడం సవాళ్లతో కూడుకున్నది. అభిమానుల్లో అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. దానిని అందుకోవడానికి చాలా శ్రమించాల్సి ఉంటుంది. దానికి తోడు అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ ఇవేవీ తనకు అనుకూలించలేదు. అందుకే సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటవారసుడు అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. నటుడిగా ఒక స్థాయికి రావడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది.
ఆరంభం రిఫ్యూజీ సినిమా ఫర్వాలేదనిపించినా కానీ, ఆ తర్వాత అన్నీ పరాజయాలే. అసలు అతడు అమితాబ్ నటవారసుడేనా? అంటూ చీదరింపులు ఎదురయ్యాయి. తనను పబ్లిక్ కూడా పట్టించుకోలేదు. అసలు ఎవరూ గుర్తించలేదు. ఈ విషయాలన్నీ తాజా ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ చాలా నిజాయితీగా చెప్పుకొచ్చారు. తనకు పరాజయాలు ఎదురైనప్పుడు ఎవరూ పట్టించుకోలేదని అన్నాడు.
అంతేకాదు.. తన గురించి చాలా నెగెటివిటీ ప్రచారమైంది. తన నటన గురించి, తన కాపురం గురించి నెగెటివ్ గా మాట్లాడారు. అయితే అలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో తనకు అర్థం కాలేదు. కానీ తన భార్య సలహా మాత్రం బ్రహ్మాస్త్రంలా పని చేసిందని చెప్పాడు. నెగెటివిటీని పట్టించుకోకూడదు. పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలని, పట్టించుకోకపోతే ఏవీ మనల్ని ఏమీ చేయవు అని ఐశ్వర్యారాయ్ సలహా ఇచ్చారట. ఆ తర్వాత దానిని అనుసరించానని అభిషేక్ చెప్పాడు. చుట్టూ ఉన్నవారు ఆనందంగా ఉండాలని భావించే తరహా నేను. కానీ కొన్నిసార్లు పరిస్థితులు కఠినంగా ఉండాలని నేర్పిస్తాయి... కానీ నటులు కఠినంగా ఉండటం కుదరదు. దాని ప్రభావం కెరీర్ పైనా పడుతుంది. నేను అందరూ బావుండాలనుకుంటాను.. అని అన్నారు.
అభిషేక్ బచ్చన్ బాలీవుడ్ లో ఖాన్ ల త్రయంలా ఎదగలేదు. చాలామంది స్టార్లతో పోలిస్తే దిగువ స్థాయిలోనే ఉన్నాడు. కానీ అతడు తన ఉనికిని చాటుకునే సినిమాలు ఇటీవల చేస్తున్నాడు. స్క్రిప్టుల పరంగా పరిణతితో ఆలోచిస్తున్నాడు. నటుడిగా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు. నెమ్మదిగా అయినా అతడు రేసులో ముందుకు సాగుతున్నాడు.