విజయ్-అజిత్ అభిమానుల పరిస్థితి ఏంటి?

తమిళ చిత్రసీమలో కోలీవుడ్ బాక్సాఫీస్‌ను ఏలిన ఇద్దరు అగ్ర కథానాయకులు దళపతి విజయ్, తల అజిత్ కుమార్. ఇద్దరి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయంటే అభిమానుల మధ్య వాతావరణం యుద్ధ రంగాన్ని తలపించేది. కటౌట్ల రికార్డుల నుంచి ఫ్లెక్సీల వివాదాల వరకు, సోషల్ మీడియా ట్రోలింగ్స్ నుంచి థియేటర్ల బయట భౌతిక దాడుల వరకు ఫ్యాన్స్ మధ్య రచ్చ రంబోలా జరిగేది. తమ అభిమాన హీరోనే గొప్ప అని చాటుకోవడానికి ఇరువర్గాల ఫ్యాన్స్ పడే తాపత్రయం తరచూ వివాదాలకు, ఉద్రిక్తతలకు దారితీసేది.
అయితే కాలం మారింది. వారితో పాటు ఇద్దరు స్టార్ల బాటలు కూడా మారాయి. విజయ్ నటనకు రిటైర్మెంట్ ఇచ్చి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవలో బిజీ అయ్యారు. మరొకవైపు అజిత్ కుమార్ తనకిష్టమైన మోటార్ రేసింగ్, ఫార్ములా రేసింగ్ ప్రపంచంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ అంతర్జాతీయ వేదికలపై భారత పతాకాన్ని ఎగురవేస్తున్నారు. ఎవరి లక్ష్యాలు వారు ఎంచుకుని ఒకరికొకరు ఎంతో గౌరవంతో ముందుకు సాగుతున్నారు.
ఇటీవల బ్రిటన్‌లోని సిల్వర్‌స్టోన్ రేసింగ్ ట్రాక్‌పై జరిగిన ప్రతిష్టాత్మక రేస్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించగా అక్కడ తమిళ నటుడు విజయ్ - అజిత్ సతీమణి షాలిని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేసింగ్ ట్రాక్ వద్ద అజిత్ టీమ్‌ను ప్రోత్సహించడానికి విజయ్ స్వయంగా రావడం, అజిత్ కుమార్‌తో ఎంతో ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలుపడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య ఉన్న ఈ ఆత్మీయ అనుబంధం, స్నేహపూర్వక వాతావరణం చూసి సినీ వర్గాలు సైతం ముచ్చటపడ్డాయి.
గతంలో హీరోల కోసం థియేటర్ల వద్ద కొట్లాడుకున్న ఫ్యాన్స్‌కు ఇప్పుడు ఈ దృశ్యాలు పెద్ద కన్నువిప్పులా మారాయి. వెండితెరపై పోటీ పడినా? వ్యక్తిగత జీవితంలో ఇద్దరూ ఎంత మంచి స్నేహితులో.. ఒకరి విజయాలను మరొకరు ఎలా ఆస్వాదిస్తున్నారో చూసి అభిమానులు కూడా వైఖరిని మార్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో పరస్పర ద్వేషాన్ని పక్కనబెట్టి ఇద్దరు హీరోలు కలిసి ఉన్న పిక్స్, వీడియోలను షేర్ చేస్తూ ఇదీ అసలైన క్లాస్ అంటూ ఇరువర్గాల అభిమానులు ఆనందం వ్యక్తం చేయడం విశేషం.
















































