Advertisement

జోష్ స్పెషల్: పూరి క్వశ్చన్ పేపర్ లీక్!

Wed 23rd Dec 2015 02:00 PM
puri jagannadh,pen counter prabhu,prabhu pen counter,puri jagannadh interview,puri tho prabhu,cinejosh special artical,puri jagannadh interview by prabhu,puri with prabhu,senior journalist prabhu pen counter  జోష్ స్పెషల్: పూరి క్వశ్చన్ పేపర్ లీక్!
జోష్ స్పెషల్: పూరి క్వశ్చన్ పేపర్ లీక్!
Advertisement

సంఖ్యాపరంగా..సక్సెస్‌పరంగా..టాలీవుడ్‌ దర్శకులలో టాప్‌ లైన్‌లో దర్శనమిచ్చే పూరి జగన్నాధ్‌ తన ఆలోచనలు, అభిప్రాయాల విషయంలో మాత్రం మిగతావారికంటే చాలా భిన్నంగా అనిపిస్తాడు..కనిపిస్తాడు. తాను వలచిందే రంభ, తను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు వంటి మొండి వాదన చేయడు కానీ.. అతని మాటలు, రాతలు, చేతలు ట్రెడిషనల్‌ ట్రెండ్‌కి భిన్నంగా ఉంటాయి. బేసికల్‌గా రైటర్‌ కమ్‌ డైరెక్టర్‌ అయిన పూరి డైలాగుల్లో నిగూఢార్ధాలు, గొప్ప పద ప్రయోగాలు కనిపించవు. కానీ సూటిగా, సుత్తిలేకుండా మంచి పవర్‌ఫుల్‌ పంచ్‌లు రాస్తాడు, తీస్తాడు. అతని మాటల్లో నీతులు కనిపించవు..కానీ నిజాలు గర్జిస్తాయి. అతని టైటిల్స్‌, డైలాగులు, తన హీరోల బాడీ లాంగ్వేజ్‌, కేర్‌లెస్‌ యాటిట్యూడ్‌ల ప్రభావం యూత్‌ మీద బాగానే పనిచేస్తుంది. 

మీ పాత్రలు, డైలాగులు, వాటి బాడీ లాంగ్వేజ్‌ యూత్‌ని చెడగొడుతున్నాయనే విమర్శలు వినిపిస్తుంటాయ్‌..ఈ విమర్శలకు మీ సమాధానం ఏమిటి అని అడిగితే..నేను చెడగొట్టలేనంతగా చెడిపోయారు ఈ జనం..నేను వాళ్ళని కొత్తగా చెడగొట్టేదేమిటి.. అంటూ ఎదురొస్తాడు పూరి. ఇంతకి ఎవరు ఎవర్ని చెడగొడుతున్నారన్నది ప్రక్కన పెడితే..పూరీ ప్రభావం మాత్రం..మన యూత్‌మీద చాలానే ఉంది. 

సినిమాలు, పాత్రల విషయంలోనే కాదు..వ్యక్తిగతంగా కూడా పూరిలో ఒక విలక్షణ వ్యక్తిత్వం గోచరిస్తుంది. మ్యాన్ ఈజ్ బోర్న్ ఫ్రీ.. బట్ ఈజ్ ఎవ్రీవేర్ హీజ్ ఇన్ చైన్స్.. అంటారు. పూరి ప్రతి కదిలికలోనూ..ఆ ఛైన్స్‌ తెంచుకోవాలనే స్వేచ్ఛా ప్రియత్వం కనిపిస్తుంది. జనజీవన స్రవంతిలో ఉంటూనే జనాభిప్రాయానికి దూరంగా జరిగే డిటాచ్‌డ్‌ థింకింగ్‌ వైపు సాగుతుంటాయి పూరి ఆలోచనలు. ఇట్లు శ్రావణి సుబ్రహ్మాణ్యం నాటి పూరి ఇప్పుడు లేడు. అందాలు-ఆనందాలు, అనుభవాలు-అనుభూతులు, అన్యాయాలు-అబద్ధాలు, విజయాలు-అపజయాలు, డిప్లమసీ-హిపోక్రసీల మధ్య నలిగి, కలగి, దొర్లి పొర్లిన..రాటుదేలిన తనంతో పాటు వీటికి దూరంగా పారిపోవాలని, ఏదో తెలియని ఆవలి తీరానికి చేరుకోవాలి అనే ప్రయత్నమూ కనిపిస్తుంటుంది పూరిలో. ఇలా ఎటాచ్‌డ్‌ ప్లస్‌ డిటాచ్‌డ్‌ క్యారక్లరైజేషన్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన ప్లేస్‌మెంట్‌ను సాధించుకున్న పూరినీ...ఓ ఇంటర్య్వూ కావాలని అడిగింది సినీజోష్‌. 

దానికి సారీ భయ్యా.., లోఫర్‌ ప్రమోషన్ బిజీలో ఉన్నాను. ఇప్పుడు టైమ్‌ లేదు..ఏం అనుకోకుండా...క్వశ్చన్స్‌ రాసి ఆఫీస్‌లో ఇస్తే.. రాత్రికి ఆన్సర్స్‌ రాసి పంపిస్తానంటూ.. హడావుడిగా కారెక్కాడు పూరి. ఫేస్‌ టు ఫేస్‌ కాకుండా..ఇలా ఇంటర్య్వూ చేయడం కూడా ఓ వెరైటీయే. అందుకే తన ప్రశ్నలను నీటుగా కంపోజ్‌ చేసి..పూరి ఆఫీస్‌లో అందించింది సినీజోష్‌. పూరి నుండి సమాధానాలు వచ్చేలోపు.. అసలు ఆ ప్రశ్నలెంటో తెలుసుకోవాలని ఉందా? అయితే ఇదిగో పేపరు లీక్‌ చేసేస్తున్నాం..ముందుగా ప్రశ్నలు ఎంజాయ్‌ చేయండి... రేపు పూరీ ఇవ్వబోయే సమాధానాలతో ఈ ప్రశ్నలను మ్యాచ్‌ చేసి చూసుకుందాం..సో గో త్రూ దా క్వశ్చన్స్‌  ఫస్ట్‌... 

                                                                                     Interview by      Prabhu 

పూరి జగన్నాథ్‌ - ఇంటర్వ్యూ - క్వశ్చన్స్‌ 

1. మీకు పూరి ఇష్టమా? జగన్‌ ఇష్టమా? పూరి జగన్నాధ్‌ ఇష్టమా? 

2. జగన్‌గారూ.. మీ మాట, మీ చేత, మీ రాతలలో ఓ గొప్ప ఫిలసాఫర్‌, ఓ తిక్క పురుషుడు, కలగాపులగంగా కనిపిస్తుంటారు. అసలింతకీ వాట్ యు ఆర్ మిస్టర్ పూరి?

3. ఇల్లు-ఇల్లాలు-పిల్లలు, హిట్లు-పట్లు, క్లాప్స్‌-ఫ్లాష్‌, బ్యాంకాక్‌-బ్యాంక్‌ బాలెన్స్‌, స్వీట్‌ సిక్స్‌టీన్‌-వాట్‌ సిక్స్‌టీ నైన్‌... వీటికి అతీతమైన..పూరి ఎక్కడో కనిపిస్తుంటాడు. ఎక్కడబ్బా! 

4. సంప్రదాయ ఆలోచనా విధానానికి భిన్నంగా వెళ్లే వాళ్లని లెఫ్టిస్ట్‌లు అంటారు. సినిమా ఇండస్ట్రీలో మీ భావాలు, ఆలోచనలు సంప్రదాయేతరంగా ఉంటాయి. మీ ఆలోచనల్లో ఈ లెఫ్ట్‌ ఓరియంటేషన్‌కు కారణం ఏమిటి? 

5. నా రూటే సెపరేటు, వీడు తేడా, వీడికి కొంచెం తిక్క లాంటి ఉపమానాలు, మేనరిజాలు మీకు ఎంతవరకు అప్లై అవుతాయి? 

6. మీరెవరిలా జీవించాలి అని అడిగితే మీ గురువు రాంగోపాల్‌వర్మలాగా అని చెప్పారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో అందరితో వివాదాలు కొని తెచ్చుకునే వర్మ మీకు ఆదర్శమైతే మరి మీకెందుకు అలాంటి కాంట్రవర్షియల్‌ ఇమేజ్‌ లేదు?

7. లైఫ్‌లో స్ట్రగుల్‌ ఈజ్‌ కామన్‌. దర్శకుడు కావడానికి ముందు, దర్శకుడుగా ఒక స్థాయికి వచ్చాక మీరు ఫేస్‌ చేసిన స్ట్రగుల్స్‌లో తేడా ఏమిటి? 

8. మీ హీరోల పాత్రలే మీరు అనుకోవచ్చా. మీ హీరోల పాత్రల్లో మీ వ్యక్తిత్వం ఎంతవరకు రిఫ్లెక్ట్‌ అవుతుంది? 

9. ఐడియాటిజమ్‌, పోకిరిజమ్‌, లోఫరిజమ్‌, రోగ్‌ ఇజమ్‌లను హీరోయిజమ్‌గా ప్రొజెక్ట్‌ చేస్తున్నాడు..పూరి అనే విమర్శల పట్ల మీ స్పందన ఏమిటి? 

10. మీ హీరో పాత్రలను నెగటివ్‌ ఏటిట్యూడ్‌ తో  స్టార్ట్‌ చేసి పాజిటివ్‌ ఏటిట్యూడ్‌తో ఎండ్‌ చేస్తారు. అంత నెగటివ్‌ టచ్‌ ఉన్న హీరోను, హీరోయిన్‌, ఇతర పాత్రలు ఓన్‌ చేసుకునేలా టర్న్‌ చేయటం చాలా పెద్ద సవాల్‌ కదా. ఎందుకంత  రిస్క్‌ తీసుకుంటారు? 

11. కమీషనర్ల కూతుర్లకు పెళ్లిళ్లు కావా? మొగుళ్లు రారా? అని ప్రశ్నించే మీ పాత్రల ఏటిట్యూడ్‌ను, హీరోయిజాన్ని ఎవడైనా కుర్రాడు ఎడాప్ట్‌ చేసుకుని రియల్‌ లైఫ్‌లో ప్రయత్నిస్తే వాడికి ఎలాంటి రిజల్ట్‌, రియాక్షన్‌ వస్తుందని మీరు అనుకుంటున్నారు? 

12. ఒక పబ్లిక్‌ ఫిగర్‌ ప్రయాణంలో పబ్లిక్‌ నుండి యాక్సెప్టింగ్‌, రెస్పెక్టింగ్‌ అనే రెండు దశలు ఉంటాయి. మీరు ఏ దశలో ఉన్నారు? 

13. మంచి చిత్రానికి ఓ మంచి నిర్వచనాన్ని ఇంతవరకు ఎవరూ ఇవ్వలేకపోయారు. డబ్బులొచ్చిందే మంచి సినిమా అని ఒకప్పుడు మహా నటుడు ఎన్‌.టి.ఆర్‌. గారు నిర్వచించి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. మరి మంచి చిత్రానికి మీరిచ్చే నిర్వచనం ఏమిటి? 

14. ఈమధ్య హర్రర్‌ అనేది ఒక సక్సెస్‌ఫుల్‌ జోనర్‌ అయింది. టెక్నాలజీ మీద మంచి పట్టు ఉన్న మీరు ఆ జోనర్‌ను ఎందుకు ట్రై చేయడం లేదు. మీలాంటి విలక్షణ ఆలోచనా విధానం ఉన్న దర్శకుడు పొలిటికల్‌ సెటైర్‌ తీస్తే ఇంపాక్ట్‌ బలంగా ఉంటుంది. బిజినెస్‌మ్యాన్‌, గంగతో రాంబాబుల్లో ఆ జోనర్‌ను కొంత టచ్‌ చేసినప్పటికీ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌ పొలిటికల్‌ ఫిలిం తీసే ఆలోచన ఏమైనా ఉందా? 

15. పోకిరి తో మీరు ఆల్‌టైమ్‌ రికార్డ్‌ క్రియేట్‌ చేస్తే రాజమౌళి దాన్ని మగధీర తో క్రాస్‌ చేశారు . దాన్ని అత్తారింటికి దారేది తో త్రివిక్రమ్‌ క్రాస్‌చేశాడు. మరలా దాన్ని బాహుబలి తో రాజమౌళి క్రాస్‌చేశాడు. మరలా మీ వంతు ఎప్పుడు? అసలు అలాంటి టార్గెట్‌ ఏదైనా ఉందా? 

16. సోషల్‌ కాజ్‌కు కమర్షియల్‌ వాల్యూస్‌ మిక్స్‌ చేస్తూ హిట్స్‌ కొట్టడంలో తమిళ దర్శకులకు ఉన్నంత కమిట్‌మెంట్‌, కమాండ్‌ మన దర్శకులకు లేదు అనే విమర్శలతో మీరు ఏకీభవిస్తారా? 

17. తమిళ సినిమాకు తెలుగులో ఉన్న మార్కెట్‌తో పోల్చితే తెలుగు సినిమాకు తమిళంలో అసలు మార్కెటే లేదు. ఎందుకు? ఇది తెలుగు దర్శకుల ఇష్యూనా, హీరోల ఇష్యూనా? 

18. నేషనల్‌ అవార్డ్స్‌, ఫిలిం ఫెస్టివల్స్‌ జరిగే సందర్భాలలో ఇతర భాషా చిత్రాలతోను, దర్శకులతోనూ పోల్చి మన వాళ్ళను మన వాళ్లే విమర్శిస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? 

19. చిరంజీవిగారి 150వ సినిమాయే ఒక ఎడతెగని సీరియల్‌ ఇష్యూగా సాగుతుంటే దానికి మీరు డైరెక్టర్‌ అనేది మరొక ఎండ్‌లెస్‌ ఎపిసోడ్‌ అయింది. దీనికి ఎండ్‌ ఎప్పుడు? 

20. మీరు టాప్‌ హీరోల టాప్‌ ఛాయిస్‌గా ఎదిగి చాలా కాలం అయింది. మరిప్పుడు ఎప్పటికైనా చిరంజీవిగారిని డైరెక్ట్‌ చేయాలని ఉంది అని మిమ్మల్ని మీరు ఆఫర్‌ చేసుకోవడంలో ఆంతర్యం ఏమిటి? 

21. రాజకీయాల్లోకి వెళ్లక ముందు చిరంజీవిగారు చేసిన శంకర్‌దాదా ఎంబిబిఎస్‌, శంకర్‌దాదా జిందాబాద్‌, ఠాగూర్‌, స్టాలిన్‌ చిత్రాలు మెసేజ్‌ ఓరియంటెడ్‌గా సాగాయి. ఆయన చిరుకాల రాజకీయ ప్రస్థానం తర్వాత ఇప్పుడు ఆయన మీద ఏ కథాంశాన్ని తీసుకున్నా అందులో సందేశాలుండడం అవసరం. మరి మీకేమో సినిమాల ద్వారా సందేశాలవ్వడం అంటేనే చిరాకు. మరి మెసేజ్‌లు ఇవ్వాలనుకునే హీరోకు వద్దనుకునే దర్శకుడికి మధ్య పొంతన ఎలా కుదురుతుంది? 

22. బ్రూస్‌లీయే చిరంజీవిగారి 150వ సినిమా అని మీ గురువు రాంగోపాల్‌వర్మ కుండబద్దలు కొట్టారు. 150వ సినిమా అనే ప్రెస్టీజియస్‌ నెంబర్‌ మిస్‌ అయ్యాక కూడా మీరు చిరంజీవిగారితో సినిమా చేయాలనుకోవడానికి కారణం ఏమిటి? 

23. లోఫర్‌లో వరుణ్‌తేజ్‌ పర్ఫామెన్స్‌తో పాటు సెట్స్‌మీద తన బిహేవియర్‌ను కూడా మీరు చాలా మెచ్చుకున్నారు. మీ దృష్టిలో హీరో బిహేవియర్‌ అంటే దర్శకుడికి అనుకూలంగా ఉంటూ దేంట్లోనూ ఇంటర్‌ఫియర్‌ అవ్వకుండా ఉండటమా? ఈ కోణంలో యాజ్‌ ఏ డైరెక్టర్‌ గా మీరు బాగా కంఫర్ట్‌బుల్‌గా ఫీలైన హీరో ఎవరు? 

24. ఇక వీడి పని అయిపోయింది అనుకునే టైమ్‌కు ఎవరైనా ఆర్ధికంగా బ్రహ్మాండంగా సెటిల్‌ అయి ఉంటారు. కానీ డైరెక్టర్‌గా ఫుల్‌ ఫామ్‌లో ఉండగానే మీరు ఆర్ధికంగా చావుదెబ్బ తిన్నారు. ఆల్‌మోస్ట్‌ ఆల్‌ రోడ్డున పడే పరిస్ధితికి వెళ్లారు. మరలా సంవత్సరం తిరక్కుండానే పోయింది మొత్తం సంపాదించుకున్నారు. సినిమా వాళ్లలో ఇంకెవరికీ లేదు అనేంత గొప్పగా ఆఫీసు కట్టుకున్నారు. ఫైనాన్షియల్‌గా బాగా సౌండ్‌ అయ్యారు. ఎలా? అప్పటి మీ మానసిక స్ధితి ఏంటి? 

25. మీరు ఇడియట్‌, పోకిరి అనే తిట్లను టైటిల్స్‌గా పెట్టి ఆడుతూ పాడుతూ సినిమాలు తీస్తే అవి హిట్‌ అయ్యాయి. 143, నేనింతే అనే టైటిల్స్‌తో మంచి ఎమోషనల్‌ సబ్జెక్ట్స్‌తో, ఒక కమిట్‌మెంట్‌తో తీసిన సినిమాలు ఫ్లాప్‌ అయ్యాయి. దీనికి మీరిచ్చే ఇంటర్‌ప్రటేషన్‌ ఏమిటి? 

26. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు ఒక టాప్‌ డైరెక్టర్‌. మీతోపాటు రాజమౌళి, త్రివిక్రమ్‌, వినాయక్‌, శ్రీను వైట్ల, గుణశేఖర్‌, క్రిష్‌లాంటి మంచి పేరున్న దర్శకులు చాలామంది ఉన్నారు. కానీ ఇండస్ట్రీ సవాలక్ష సమస్యలతో సతమతమవుతుంటే మీరెవరూ పట్టించుకోరెందుకు? ఎప్పుడు, ఎక్కడా, ఏ సమస్యలోనూ మీ వాయిస్‌ వినిపించదెందుకు? ఇండస్ట్రీ సమస్యల పట్ల మీకెవరికీ బాధ్యత లేదా? 

27.వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, రేవతి అమ్మ సెంటిమెంట్, పోసాని లోఫరిజం.. ఇలా రిలీజ్ కు ముందు మీరు చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ బాగా ఉన్నాయి. బాగున్నాయి. ఒక్క మరో ఇలియానా అన్న స్టేట్మెంట్ తప్ప. హీరోయిన్ సెలక్షన్ విషయంలో ఎప్పుడు గురి తప్పని మీరు ఈ సారి ఎందుకిలా?

28.లోఫర్ చూసాక అనిపించింది.. మంచి సినిమాలు తీసి రాంగ్ టైటిల్స్ పెట్టడంలో మీకు మీరే సాటి అని.. అప్పుడు ఇడియట్, పోకిరి, ఇప్పుడు లోఫర్ తో నిరూపించుకున్నారు. ఆ సినిమాల సక్సెస్ కు కారణం మీ కథ. ట్రీట్ మెంటే తప్ప మీ మిస్ గైడింగ్ టైటిల్స్ కాదు. ఎందుకిలాంటి టైటిల్స్ పెట్టి జనాన్ని మీరే చెడగొడుతున్నారనే అపవాదు మోయడం?

29.ఏ జూనియర్ ను.. ఏ సీనియర్ నూ ఓన్ చేసుకోనంతగా దాసరి నారాయణరావు గారు మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. ఏకంగా మిమ్మల్ని తన వారసుడు అని ప్రకటించారు.. ఎందుకు ఆ పెద్దాయనకు మీరంటే అంత లవ్వు.. ఇంతకీ ఆ వారసత్వాన్ని స్వీకరించారా..?

30.టెంపర్ లో హే భగవాన్ సాంగ్ లో ప్రతి మనిషికి అప్లై అయ్యే గొప్ప ఫిలాసఫీ ఉంది. దేవుడు ప్రత్యక్షమై మీ జీవితాన్ని మీకు తిరిగి ఇస్తానంటే ఎక్కడి నుంచి రిపీట్ అడుగుతారు..?

31.రీల్ లైఫ్ లో రెండు సార్లు అమ్మ సెంటిమెంట్ మీద హిట్ కొట్టారు.. మరి రియల్ లైఫ్ లో మీ అమ్మ సెంటిమెంట్ గురించి చెప్పండి..?

32.సంఖ్య విషయంలో కానీ.. సబ్జెక్ట్స్ విషయంలో కానీ.. మీకు ఏమైనా టార్గెట్స్ ఉన్నాయా..?

33.చివరిగా...ఈ జనరేషన్ దర్శకులలో సక్సెస్ పరంగా కాకుండా, సంఖ్య పరంగా కూడా మీరే టాప్. పెనం మీద దోస వేసినంత ఈజీగా భారీ సినిమాలు తీసి పడేస్తుంటారు. స్పీడ్ మేకర్ అనే కాంప్లిమెంట్ కొట్టేయడానికి మీకు దోహదపడిన మీ క్వాలిఫికేషన్స్ ఏంటి..?

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement