రాజకీయాలపై విజయ్ సేతుపతి క్లారిటీ!
Vijay Sethupathi says politics is about serviceసమాజానికి మేలు చేయాలంటే రాజకీయాల్లోకి రావాల్సిన పనిలేదని, రాజకీయాలు అంటే ఆశయం కాదని, అది కేవలం సేవ అని నటుడు విజయ్ సేతుపతి అభిప్రాయపడ్డారు. కొత్త సినిమా `ట్రైన్` ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో రాజకీయ ప్రవేశం, ప్రభుత్వ నిర్ణయాలపై వ్యాఖ్యలు చేయకపోవడానికి గల కారణాలను సేతుపతి వివరించారు. విధానపరమైన అంశాలు, రాజకీయ విషయాలను విశ్లేషించడం తన పని కాదని, ప్రజలకు సాయం చేయడానికి రాజకీయ పదవే మార్గం కాదని స్పష్టం చేశారు.
తాను నడిపే సంస్థ ద్వారా ఇప్పటివరకు రెండు లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పించామని, చెరువుల పునరుద్ధరణతో పాటు ఎంతోమంది చదువుకు అండగా నిలిచామని విజయ్ సేతుపతి వెల్లడించారు. సంపాదించిన సొమ్మును ఇలాంటి సామాజిక కార్యక్రమాలకు ఖర్చు చేయడంలోనే తనకు సంతోషం దొరుకుతుందని, ఇదే తనకు నిజమైన రాజకీయమన్నారు.
ఇక రాజకీయ వ్యాఖ్యల విషయంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలు వాటిని తేలిగ్గా తీసుకోరని, సరైన అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. తమ మాటలపై సోషల్ మీడియాలో వచ్చే విమర్శల ప్రభావం సినిమాలపై పడకూడదనే ఉద్దేశంతోనే దూరంగా ఉంటానని తెలిపారు.















































