అప్పట్లో అమల బ్రేక్ లేకుండా 9 టు 9 షిఫ్టులు!
Amala recalls a time when she worked 9-to-9 shifts for 8 years
పరిశ్రమలో పని గంటలు.. షిఫ్టుల వ్యవస్థపై ఇటీవల జోరుగా చర్చ జరుగుతున్న వేళ సీనియర్ నటి అమల అక్కినేని చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన కెరీర్ ప్రారంభంలో ఎనిమిదేళ్ల పాటు విరామం లేకుండా రోజూ ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు 12 గంటల షిఫ్టుల్లో పనిచేశానని అమల గుర్తుచేసుకున్నారు. ఉదయం 7 గంటలకే ఇంటి నుంచి బయలుదేరి చెన్నైలోని టీ నగర్ లొకేషన్‌కు చేరుకునేదానినని.. 8 గంటలకు రెడీ అయ్యి 9 గంటలకు మొదటి షాట్ ఇచ్చేదానినని చెప్పారు.
రాత్రి 9 గంటలకు ప్యాకప్ చెప్పిన తర్వాత ఇంటికి చేరి నిద్రపోయేసరికి 10 దాటేదని.. అలా ఆగకుండా కష్టపడిన రోజులవి అని వివరించారు. అప్పట్లో కేబుల్ టీవీ కొత్తగా రావడంతో జనం థియేటర్లకు రావడం తగ్గించారని.. ఆ పరిస్థితుల్లో బడ్జెట్లు తగ్గిపోయి నిర్మాతలు వేగంగా షూటింగ్‌లు పూర్తి చేయాల్సి వచ్చేదని అమల తెలిపారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నట్లు అప్పుడు 9-టు-5 షిఫ్టులు ఉండేవి కావని..మరో షిఫ్ట్ తీసుకునే తీరిక కూడా ఉండేది కాదన్నారు. తమిళ సినిమా తనకు తల్లి లాంటిదని.. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణుల మధ్య పనిచేసిన ఆ కాలాన్ని తాను స్వర్ణయుగంగా భావిస్తానన్నారు.
ఇక వ్యక్తిగత జీవితం.. కెరీర్ విషయానికొస్తే 1992లో నాగార్జునతో వివాహం తర్వాత సినిమాలకు దూరమైన అమల సేవా కార్యక్రమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అప్పుడప్పుడు మంచి చిత్రాల్లో బలమైన పాత్రల్లో నటించే అవకాశం వస్తే కాదనుకుండా ముందుకెళ్తున్నారు.
















































