భోగి శర్వానంద్ నుంచి ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్: సంపత్ నంది
Sampath Nandi Interview about Bhogiచార్మింగ్ స్టార్ శర్వా పూర్తిగా రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 27న ‘భోగి’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంపత్ నంది విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలను పంచుకున్నారు.
‘భోగి’ కథ రాయడానికి మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశాలు ఏమిటి?
-‘భోగి’ మొదలవడానికి నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ ఒక కారణం. మా ఊరికి 50 కిలోమీటర్ల దూరంలో రామగిరి గుట్ట అని ఒక చోటు ఉండేది. అక్కడ ఒక పర్టిక్యులర్ వ్యక్తి గురించి చాలా విషయాలు చెప్పేవారు. ఆ గుట్ట దగ్గర మూఢ శక్తుల కోసం ఒక వ్యక్తి ఏదో చేస్తున్నాడని అనేవారు. ఆ వ్యక్తి వస్తే మేమంతా చిన్న పిల్లలం పరిగెత్తేవాళ్లం. ఆ వ్యక్తి ఎందుకు వచ్చేవాడు? మేమంతా ఎందుకు పరిగెత్తేవాళ్లం? అనేది నేను ఇప్పుడే చెప్పను. కాకపోతే ఆ ఇన్సిడెంట్ నా మనసులో నిలిచిపోయింది. కమర్షియల్‌గా ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు, ఇలా రూటెడ్‌గా ఒక కథ చేయాలని అనిపించింది.
-ఊరంతా భయపడింది కదా.. అలా భయపడటానికి ఒక కారణం పెడదాం. అక్కడ జరిగిన ఆ ఇన్సిడెంట్‌నే తీసుకుందాం అనుకున్నాం. అదే సమయంలో ఇదే తరహాలో మహారాష్ట్ర బోర్డర్లో కూడా ఒక సంఘటన జరిగిందని ఒకరు పేపర్ కటింగ్ తీసుకొచ్చారు. అలా దీనికి ‘బొగ్గుల గుట్ట’ అనే ఫిక్షనల్ విలేజ్ క్రియేట్ చేసి, ఆ విలేజ్‌లో ఒక ఇన్సిడెంట్ను సృష్టించాం. అది పాత రోజుల్లో జరిగిన కథ కాబట్టి వెనక్కి వెళ్లి అప్పటి పరిస్థితులు, కల్చర్, కట్టుబాట్లు, పద్ధతులు, ప్రేమలు.. ఇవన్నీ చూపిస్తూ ఒక పీరియాడిక్ సినిమాలా రూపొందించాం.
సెన్సార్ రివైజింగ్ కమిటీకి ఎందుకు వెళ్లింది?
-రక్తపాతం ఎక్కువగా ఉండటం వల్ల సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లింది. ఈ కథకు అలాంటి రక్తపాతం అవసరం. నేను తీసుకున్న కథలో రక్తపాతానికి సంబంధించిన అంశాలు ఉంటాయి. రివైజింగ్ కమిటీలో కూడా మా సన్నివేశాల్ని ఏమీ తొలగించలేదు. మేము ఏదైతే తీశామో అది అలాగే ఉంది. కాకపోతే కొన్ని మ్యూట్స్ చెప్పారు. ఇందులో మూఢనమ్మకం అంశం కూడా ఉంది. అది మీరు థియేటర్లోనే చూడాలి.
-ఇది అందరూ చూడగలిగే సినిమా. ట్రైలర్లోనే వైలెన్స్ ఉంటుందని చెప్పాను. ఒక మాస్ యాక్షన్, విలేజ్ రూటెడ్ కథ చేశాం. ఇప్పటివరకు శర్వానంద్ గారు ఇలాంటి సినిమా చేయలేదు. నేను కూడా చేయలేదు. శర్వానంద్ గారు మంచి కథలు చేస్తుంటారు. ఆయన ఇలాంటి హై వయలెన్స్ ఉండే యాక్షన్ సినిమా చేయడంతో ఆయన లుక్, ఆయన మాట్లాడే ప్రతి మాట కొత్తగా అనిపిస్తాయి. ఈ సినిమాలో శర్వా గారు తెలంగాణ యాసను అద్భుతంగా, పర్ఫెక్ట్గా మాట్లాడారు.
శర్వానంద్‌కు కథ చెప్పినప్పుడు ఆయన స్పందన ఎలా ఉంది? ఈ లుక్ కోసం ఎంత కష్టపడ్డారు?
-శర్వానంద్ గారికి ఈ కథను ఒక 15 నిమిషాల పాటు చెప్పాను. మనం కలిసి చేస్తే ఇలాంటి అద్భుతమైన కథ చేయాలని ఆయన చెప్పారు. వెంటనే ఓకే అన్నారు. తర్వాత మా జర్నీ మొదలైంది. ఇందులో ఆయన లుక్‌ను సెట్ చేయడానికి దాదాపు రెండు నెలలు పట్టింది. ఈ సినిమా కోసం ఒక డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ కావాలి. అప్పటి మనుషులు తినే దానికంటే ఎక్కువగా కష్టపడేవాళ్లు. అలాంటి లుక్ కావాలి. శర్వా పూర్తిగా సన్నబడ్డారు. ఇందులో మీసాలు, గడ్డాలు కూడా కావాలి. అలా ఆ పాత్రకు తగ్గట్టుగా ఎంతో కేర్ తీసుకుని ఆయనను మలిచాం. నాలుగైదు లుక్ ట్రయల్స్ తర్వాత ఫైనల్‌గా ఒక లుక్ సెట్ అయింది.
-శర్వానంద్ గారు ఈ సినిమాను చూసి చాలా అప్రిషియేట్ చేశారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నానని అనిపించింది. అది ఒక ఫిల్మ్ మేకర్‌గా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
ఈ సినిమా కోసం భారీ విలేజ్ సెట్ నిర్మించారని తెలిసింది. దాని గురించి?
-ఈ సినిమా కోసం 15 ఎకరాల్లో బొగ్గుల గుట్ట విలేజ్ సెట్ నిర్మించాం. అప్పట్లో చెట్లు, అన్ని వసతుల మధ్య గ్రామాలు ఉండేవి. అలాంటి ఒక ప్రాంతాన్ని చూసుకుని అక్కడ ఈ సెట్ నిర్మించాం. బడ్జెట్ పరంగా మేము అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అయింది. అలాగే టైమ్ కూడా ఎక్కువ పట్టింది. ఇది మూడేళ్ల ప్రాజెక్ట్. నిర్మాత రాధమోహన్ గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.
మీ ‘గాంజా శంకర్’ కథనే ఇలా చేశారని ఒక వార్త ప్రచారంలో ఉంది. అది ఎంతవరకు నిజం?
- లేదండి. అది కంప్లీట్‌గా క్రిమినల్ స్టోరీ. ఇది రూటెడ్ కథ. అన్నాచెల్లెళ్ల కథ. అన్నాచెల్లెళ్ల ఎమోషన్ చుట్టూ తిరిగే కథ.
‘భోగి’ టైటిల్ గురించి చెప్పండి?
-ఇది సంక్రాంతికి ముందు వచ్చే భోగి కాదు. పాత విషయాల్ని, చెడును పాతరేసి, చంపిన తర్వాత వచ్చిన భోగి. ఆ ఊరు కొన్ని విషయాలను నమ్మింది. అవి కరెక్ట్ కాదని ప్రూవ్ చేయడమే కథానాయకుడి లక్ష్యం.
చంద్రబోస్ గారు ఈ సినిమా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆయనతో మీ జర్నీ ఎలా సాగింది?
-చంద్రబోస్ గారు సినిమా చూశారు. ఆయనకు చాలా నచ్చింది. ఈ సినిమాలో సింగిల్ కార్డ్ అంతా ఆయనతోనే రాయించాను. ప్రతి అక్షరం ఆయనే రాశారు. కథ విని లొకేషన్‌కు వచ్చి, ఆఫీస్‌కు వచ్చి ఈ సినిమాతో చాలా జర్నీ చేశారు.
ఇది ఒక కొత్త డైరెక్టర్ తీసిన సినిమాగా చూడండి అని చెప్పడానికి కారణం ఏమిటి?
-మొన్న ఒక స్నేహితుడు ఐటెం సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావని అడిగాడు. నా గత సినిమాలను పరిశీలించి ఆయన అలా అని ఉండవచ్చు. కాకపోతే ఈ సినిమా ఆ మీటర్లో ఉండదు. నా మీటర్‌కు కాస్త భిన్నంగా చేసిన సినిమా ఇది. చాలా కొత్తగా చేసే ప్రయత్నం చేశాను. నిజానికి ఇందులో ఒక ప్రత్యేకమైన గీతం ఉంది. కానీ అది కథకు అడ్డొస్తుందని భావించి చిత్రీకరించలేదు. కాకపోతే నా నుంచి ఎలాంటి ఎలిమెంట్స్ కోరుకుంటారో అవన్నీ ఇందులో ఉంటాయి. మంచి కమర్షియల్ యాక్షన్ సినిమానే తీశాను. కాకపోతే ఇది నా వైపు నుంచి చాలా కొత్త సినిమా.
డింపుల్ హయాతి, అనుపమ పాత్రల గురించి?
ఇందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంది. కాకపోతే అది రెగ్యులర్ లవ్ స్టోరీలా ఉండదు. పల్లెటూర్లో ఉండే ఒక ప్రేమకథ ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటుంది. చాలా అందమైన రిలేషన్షిప్ ఉంటుంది.
-డింపుల్ హయాతి, అనుపమ ఇద్దరూ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. ఆ పాత్రలు చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఇందులో అనుపమ పాత్రకు స్వయంగా తనే డబ్బింగ్ చెప్పింది.
ఇందులో తెలంగాణ యాసలో ప్రత్యేకంగా ఏముంటుంది?
నిజానికి ఒకప్పుడు ఉర్దూ భాష కలవని తెలంగాణ ఉండేది. అలాంటి స్వచ్ఛమైన తెలంగాణ యాసలో మాట్లాడించే ప్రయత్నం చేశాను. నేను స్వతహాగా తెలంగాణ వాసిని. చిన్నప్పటి నుంచి నాకు ఆ భాష, యాస మీద పట్టు ఉంది. సాహిత్యం మీద కూడా పట్టు ఉంది. ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా డైలాగ్స్ అన్నీ రాశాను.
బీమ్స్ మ్యూజిక్ గురించి?
బీమ్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ సక్సెస్ అయ్యాయి. తనలో చాలా ప్రతిభ ఉంది. గంటకో ట్యూన్ ఇవ్వగలడు. తను ఈ సినిమాకు ప్రాణం పెట్టాడు.
శర్వానంద్ నుంచి ప్రేక్షకులు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఆశించవచ్చు?
-శర్వానంద్ గారి నుంచి ఇది చాలా సర్ప్రైజ్ ప్యాకేజ్. ఆడియన్స్ ఆయన నుంచి ఇలాంటి పెర్ఫార్మెన్స్ను ఊహించలేరు. ఆయన ప్రతి క్లోజప్ డైనమైట్లా పేలింది.
















































