ఆ కొన్ని నిమిషాల నిశ్శబ్దమే నా రీఛార్జ్
Ranbir Kapoor shares insights on the importance of solitude in a busy lifeబాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ తెరపై ఎన్నో విలక్షణమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించినా? వ్యక్తిగత జీవితంలో సుదీర్ఘ షూటింగ్‌లు, నటనలోని ఒత్తిడులు, భర్తగా , తండ్రిగా బాధ్యతల మధ్య సమయం గడుపుతుంటారు. ఇన్ని బాధ్యతల నడుమ తన కోసం తాను కొద్ది సమయాన్ని కేటాయించుకోవడం ఓ గొప్ప విషయమని రణబీర్ అభిప్రాయపడ్డారు. రోజులో ఎక్కువ భాగం ప్రజలు, శబ్దాలు, నిరంతర కార్యకలాపాల మధ్య గడిపినప్పుడు ఒంటరిగా గడిపే ఆ కొన్ని నిమిషాలు మానసిక ప్రశాంతతను అందిస్తాయని తెలిపారు.
రణ్‌బీర్ ఆలోచనలను పంచుకుంటూ రోజంతా షూటింగ్ లేదా పనిలో మునిగిపోయిన తర్వాత ఎవరూ ఏమీ ఆశించని ఆ కొద్దిసేపటి ఏకాంత సమయాన్ని ఎంతో ఆస్వాదిస్తానని చెప్పారు. పనికి కాస్త విరామం ఇచ్చి ప్రశాంతంగా ఉండడం వల్ల మైండ్ రిఫ్రెష్ అవుతుందని, తద్వారా తదుపరి పనిపై కొత్త కోణంలో దృష్టి సారించడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. స్నానం చేసే సమయాన్ని కూడా ప్రత్యేకమైన వ్యక్తిగత అనుభూతిగా మార్చుకోవచ్చన్నారు. ముఖ్యంగా సుదీర్ఘమైన రోజు తర్వాత చల్లటి నీటి స్నానం , నిశ్శబ్దం మానసిక స్థితిని చక్కదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు.
ఈ ఆలోచనల నేపథ్యంతోనే రణబీర్ `ఫ్లక్స్ థియరీ` అనే పర్సనల్ కేర్ బ్రాండ్‌ను సహ భాగస్వామిగా ప్రారంభించారు. రోజువారీ జీవితంలో సాధారణంగా భావించే స్నానం , పర్సనల్ కేర్ ప్రక్రియను మరింత ఆసక్తికరంగా, వ్యక్తిగతంగా మార్చడమే ఈ వ్యాపార లక్ష్యమని వివరించారు. సినిమాలో నటుడిగా విభిన్న పాత్రలు పోషించినట్లే నిజ జీవితంలో కూడా రోజులోని విభిన్న సందర్భాల్లో మనలోని వేర్వేరు రూపాలను ఆవిష్కరించుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న అలవాట్లు దోహదపడతాయని రణ్‌బీర్ కపూర్ ముగించారు.
















































