తక్కువ విండోతో `సినిమా` సంక్షోభం!
Theatre vs OTTతెలుగు చిత్ర పరిశ్రమలో థియేట్రికల్ విడుదలకు- ఓటీటీ స్ట్రీమింగ్‌కు నడుమ ఉండే వ్యత్యాసం రోజురోజుకూ తగ్గిపోతుండటంతో వ్యాపార సమీకరణాలను వేగంగా మార్చేస్తోంది. ఒకప్పుడు సినిమా థియేటర్లలో విడుదలై 60 నుండి 90 రోజుల తర్వాత మాత్రమే బుల్లితెరపై .. డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో ప్రత్యక్షమయ్యేది. కానీ ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆ వ్యవధి మూడు నుంచి నాలుగు వారాలకు, కొన్ని సందర్భాల్లో మరింత తక్కువ సమయానికే పరిమితమవుతోంది. ఈ ప్రక్రియ వల్ల నిర్మాతలకు తక్షణ ముందస్తు ఆదాయం దక్కతున్నా? మరోవైపు థియేటర్ల వ్యవస్థ తీవ్రమైన ప్రతికూల ప్రభావానికి గురవుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
తక్కువ వ్యవధిలోనే సినిమాలు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి వస్తుండటంతో సగటు సినీ ప్రేక్షకుని ప్రవర్తనలో స్పష్టమైన మార్పు వచ్చింది. టికెట్ ధరలు, కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అయ్యే ఖర్చులు పెరగడంతో, ప్రేక్షకులు ప్రతి సినిమాను థియేటర్‌లోనే చూడాలనే ఆలోచనను విరమించుకుంటున్నారు. టాక్ సాధారణంగా ఉన్నా లేదా చిన్న, మిడ్-బడ్జెట్ సినిమాలు అయినా మరో రెండు వారాల్లో ఓటీటీలోకి వస్తుంది కదా! ఇంట్లోనే చూసుకోవచ్చు అనే ధోరణి వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా మొదటి వారాంతం దాటిన తర్వాత థియేటర్లలో ఆక్యుపెన్సీ గణనీయంగా పడిపోతోంది.
ఈ విండో తగ్గడం వల్ల ఎక్కువ నష్టపోతోంది ప్రదర్శన రంగానికి చెందిన థియేటర్ యాజమానులు , డిస్ట్రిబ్యూటర్లే. బాక్సాఫీస్ వద్ద సుదీర్ఘకాలం ఆడే సామర్థ్యం ఉన్న సినిమాలకు కూడా ఓటీటీ ముందస్తు ప్రకటనల వల్ల వసూళ్లు నిలిచిపోతున్నాయి. ఫలితంగా సింగిల్ స్క్రీన్‌లు మనుగడ సాగించడం కష్టంగా మారి, మల్టీప్లెక్స్‌లు సైతం విజు వల్ వండర్స్ ..భారీ స్టార్ సినిమాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కంటెంట్ ఆధారిత చిన్న సినిమాలకు థియేటర్లలో నిలదొక్కుకోవడానికి తగినంత సమయం లభించడం లేదు.
మరోవైపు ఈ విధానం వెనుక నిర్మాతల ఆర్థిక సమీకరణాలు కూడా ప్రధాన కారణంగా ఉన్నాయి. నేటి రోజుల్లో సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, థియేట్రికల్ హక్కుల రికవరీపై స్పష్టత లేకపోవడంతో నిర్మాతలు డిజిటల్ హక్కుల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలు , మీడియం రేంజ్ సినిమాలు కూడా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు ఇచ్చే ముందస్తు డీల్స్ ద్వారా తమ పెట్టుబడిలో గణనీయమైన భాగాన్ని రికవర్ చేసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇది నిర్మాతలకు రక్షణ కవచంగా మారినా? సమగ్ర సినిమా రంగానికి స్వల్పకాలిక ప్రయోజనంగానే మిగిలిపోతోంది.
పరిశ్రమలోని పలువురు విశ్లేషకులు - నటీనటులు కూడా ఈ విధానంపై పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. థియేటర్ అనుభూతిని కాపాడాలన్నా? ఎగ్జిబిషన్ రంగాన్ని నిలబెట్టాలన్నా? థియేటర్ విడుదలకు, ఓటీటీ స్ట్రీమింగ్‌కు మధ్య కనీసం 45 నుంచి 50 రోజుల గ్యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచిస్తున్నారు. పరిశ్రమలోని ప్రధాన వాటాదారులైన నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు , ఓటీటీ సంస్థలు కలిసి స్థిరమైన నిబంధనను రూపొందించుకోకపోతే థియేటర్ వ్యవస్థ మరింత బలహీనపడే ప్రమాదం ఉంది.
ముగింపుగా డిజిటల్ విప్లవం చలనచిత్ర రంగానికి కొత్త మార్కెట్‌ను అందించినా? థియేట్రికల్ అనుభవాన్ని పూర్తిగా భర్తీ చేయలేదనేది వాస్తవం. థియేటర్లు , ఓటీటీలు పోటీగా కాకుండా సమాంతరంగా అభివృద్ధి చెందేలా సమతుల్య విధానాన్ని అవలంబించడమే టాలీవుడ్ భవిష్యత్తుకు శుభపరిణామం.
















































