తండ్రీ-తనయులిద్దరి మధ్య వార్!
Dulquer Salmaan vs Mammootty
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తండ్రీ-తనయులైన మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇద్దరూ తమదైన విలక్షణ నటనతో విభిన్న భాషల్లో అపారమైన అభిమాన గణాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇద్దరు దిగ్గజ నటుల సినిమాలు ఒకే రోజు థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన తండ్రీ-తనయుల సమరం నెలకొనబోతోంది.
దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫీల్-గుడ్ డ్రామా `ఆకాశంలో ఒక్కతార` చిత్రం నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అదే రోజున మమ్ముట్టి, ధనుష్ కాంబినేషన్‌లో రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందిన భారీ తమిళ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్ `ఓమ్` కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఒకే తేదీన వేర్వేరు జానర్లలో తండ్రీ-కొడుకుల చిత్రాలు పోటీకి దిగుతుండటం సినీ వర్గాల్లోనూ ఆసక్తికరంగా మారింది.
భిన్నమైన కథాంశాలతో వస్తున్న రెండు చిత్రాలపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవైపు లవ్, ఎమోషన్స్ నేపధ్యంలో దుల్కర్ `ఆకాశంలో ఒక్కతార`తో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతుంటే? మరోవైపు గ్యాంగ్‌స్టర్ శైలిలో మమ్ముట్టి గంభీరమైన ప్రదర్శనతో థ్రిల్ అందించేందుకు వస్తున్నారు. ఒకే రోజున విడు దలవుతున్న రెండు సినిమాల్లో ఏ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధిస్తుందో చూడాలని సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
















































