మహష్ కి లాంగ్ లీవ్ !
Mahesh Babu gets a long leaveసూపర్‌స్టార్ మహేష్ కెరీర్‌లో ఎన్నడు లేని విధంగా సుదీర్ఘ విరామానికి శ్రీకారం చుట్టారు. దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న `వారణాసి` చిత్రానికి సంబంధించి మహేష్ షూటింగ్ పోర్షన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. సాధారణంగా ఒక సినిమా సెట్స్‌పై ఉండగానే తదుపరి ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టడం లేదా షూట్ ముగిసిన వెంటనే కొత్త సినిమాను ప్రారంభించడం మహేష్‌కి అలవాటు. కానీ ఈసారి మాత్రం `వారణాసి` థియేటర్లలోకి వచ్చే వరకు అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు మహేష్ మరో కొత్త సినిమాను ప్రారంభించకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
వాస్తవానికి మహేష్ కెరీర్‌లో ఇంత లాంగ్ లీవ్ తీసుకోవడం ఇదే తొలిసారి. గత రెండేళ్లుగా `వారణాసి` పాత్ర కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో శ్రమించిన మహేష్, షూటింగ్ పూర్తి కావడంతోనే క్లాసిక్ క్లీన్ షేవ్ లుక్‌లోకి మారిపోయారు. సినిమా విడుదలకి ఇంకా ఆరు నెలల సమయం ఉన్నందున ఈ మధ్యకాలంలో కుటుంబంతో కలిసి సమయం గడపాలని, మైండ్ అండ్ బాడీని రీఛార్జ్ చేసుకోవాలని భావిస్తున్నారు. అలాగే ఈ విరామం తర్వాత జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి ప్లాన్ చేసిన `వారణాసి` ప్రమోషనల్ టూర్స్ ఈవెంట్స్‌కే మహేష్ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంది.
ఇంతటి పెద్ద గ్యాప్ తీసుకోవడం మహేష్ కి అలవాటు లేకపోయినా? ప్రస్తుత పరిస్థితుల రీత్యా తప్పనిసరిగా మారింది. `వారణాసి` వంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ తర్వాత మహేష్ చేయబోయే తదుపరి సినిమా స్కేల్ కూడా అంతే భారీగా ఉండాలి. అయితే ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా పాన్-ఇండియా చిత్రాలను తెరకెక్కించగల సందీప్ రెడ్డి వంగా, సుకుమార్, ప్రశాంత్ నీల్ వంటి అగ్ర దర్శకులందరూ ముందస్తు కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. అందువల్ల వారు ఫ్రీ అయ్యేంత వరకు ,`వారణాసి` విడుదల ద్వారా మహేష్ గ్లోబల్ మార్కెట్ రీచ్‌పై స్పష్టత వచ్చేంత వరకు వేచి చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
















































