నాని గుండెల్లో రైళ్లు రాకపోకలు ఆగాలంటే?
Nani on feeling pressure ahead of The Paradise releaseనేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ `ది పారడైజ్` సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో రూపొందిన చిత్రం విడుదల సమీపిస్తున్న వేళ నాని ఓ ఇంటర్వ్యూలో తనపై ఉన్న ఒత్తిడి గురించి స్పందించారు. అయితే ఈ ఒత్తిడి తన వ్యక్తిగత కెరీర్ గురించో లేదా ఒక నటుడిగా తనకు వచ్చే పేరు గురించో కాదని సినిమా కోసం కేటాయించిన సమయం .. భారీ నిర్మాణ వ్యయం వల్లే కలుగుతోందని స్పష్టం చేశారు.
సినిమాపై చాలామంది నమ్మకంతో పెట్టుబడులు పెట్టారని అందువల్ల నిర్మాణంలో భాగస్వాములైన (స్టేక్‌హోల్డర్స్) ప్రతి ఒక్కరూ లాభాలు పొంది సంతోషంగా ఉండాలన్నదే కోరిక అని నాని వెల్లడించారు. మొదటిసారిగా ఇంత పెద్ద స్థాయిలో ప్రయోగాత్మక సినిమా చేసినందున అందరికీ ఆర్థికంగా మంచి ఫలితాలు రావాలని, సినిమా విడుదలయ్యాకే తనకు ఊరట లభిస్తుందన్నారు. అలాగే తన తొలి చిత్రం నుంచే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం .. వారిని నిరాశపరచకుండా ఉండటమే తన ప్రధాన లక్ష్యమన్నారు.
`దసరా` వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శ్రీకాంత్ ఓదెలతో మళ్లీ పనిచేయడంపై మాట్లాడిన నాని మొదటి సినిమాతో పోలిస్తే ఈ చిత్రానికి శ్రీకాంత్‌లో మేకింగ్ పరంగా పరిణతి, ఆత్మవిశ్వాసం బాగా పెరిగాయని ప్రశంసించారు. హైదరాబాద్‌లోని `పారడైజ్` ప్రాంతం నేపథ్యంలో అణచివేతకు గురైన వర్గాల హక్కుల పోరాటం చుట్టూ ఈ కథ సాగుతుంది.
















































