అవతార్‌ను మించిన విజువల్స్‌తో రాకా!
Raaka has better visuals than Avatarఐకాన్ స్టార్ అల్లు అర్జున్- అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం `రాకా` పై ఎలాంటి అంచనా లున్నాయో చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఓ సినిమా వేడుకలో తమిళ దర్శకుడు శిబి చక్రవర్తి `రాకా` మూవీకి సంబంధించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అట్లీ రాకా చిత్రానికి సంబంధించిన కొన్ని విజువల్స్ చూపించారని వెల్లడించారు.
హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన వండర్ `అవతార్` వంటి మైండ్ బ్లోయింగ్ విజువల్స్ కంటే కూడా `రాకా` విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 21న అట్లీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రానున్న ప్రత్యేక గ్లింప్స్ చూస్తే తను చెప్పేది ఎంతవరకు నిజమో అందరికీ అర్థమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో గేయ రచయిత వివేక్ కూడా ఇలాంటి విజువల్స్ కేవలం హాలీవుడ్ చిత్రాల్లోనే చూశామని కొనియాడారు.
అలాగే దర్శకుడు అట్లీని భారతీయ సినిమా గర్వించదగ్గ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో శిబి పోల్చారు. తెలుగు సినిమా స్థాయిని దాటి రాజమౌళి ఎలాగైతే ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారో? అదే రీతిలో అట్లీ కూడా భారతీయ చిత్రాన్ని గ్లోబల్ మ్యాప్‌లో నిలబెడతారని శిబి ఆశాభావం వ్యక్తం చేశారు. అట్లీకి శిష్యుడిగా ఉండడం తనకు ఎంతో గర్వకారణమని సభామొఖంగా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా శిబి తన వ్యక్తిగత సినీ ప్రయాణంలోని ఒడిదొడుకులను కూడా పంచుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేయాల్సిన సినిమా ప్రాజెక్ట్ చేజారినప్పుడు తాను తీవ్ర నిరాశకు గురయ్యానని, ఆ క్లిష్ట సమయంలో అట్లీ తనకు ఫోన్ చేసి ధైర్యాన్ని నింపారని చెప్పారు.















































