ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న్యూ వర్కింగ్ స్టైల్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పనితీరులో భారీ మార్పు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఒక సినిమా పూర్తిగా పూర్తయిన తర్వాతే మరొక ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే సాంప్రదాయాన్ని బన్నీ పాటించారు. ప్రతి సినిమాకు పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తూ పాత్రలకు తగిన మేకోవర్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ఆయన స్టైల్. అయితే మారిన పరిశ్రమ ధోరణులు .. పక్కా ముందస్తు ప్రణాళికల తో ఇకపై ఒకే సమయంలో రెండు సినిమాల షూటింగ్స్‌ను సమాంతరంగా నిర్వహించేందుకు బన్నీ సిద్ధమవుతున్నారు.
ప్రస్తుతం కోలీవుడ్ దర్శకుడు అట్లీ తో ప్రాజెక్ట్ `రాకా` పనుల్లో ఐకాన్ స్టార్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తి కాగానే బన్నీ వర్కింగ్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకోనున్నారు. ఒకేసారి రెండు ప్రాజెక్టులను సెట్స్ మీదికి తీసుకెళ్లి, డేట్లను బ్యాలెన్స్ చేస్తూ షూటింగ్స్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. బన్నీ తీసుకున్న సరికొత్త నిర్ణయం ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
కొత్త వర్కింగ్ ప్లాన్‌లో భాగంగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ (AA 23)తో పాటు, మలయాళంలో మిన్నల్ మురళి వంటి వినూత్న చిత్రంతో మెప్పించిన బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందే సూపర్ హీరో మూవీని ఒకేసారి పట్టాలెక్కించనున్నారు. లోకేష్ కనగరాజ్ మార్క్ పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా, బాసిల్ జోసెఫ్ మార్క్ లార్జర్ దాన్ లైఫ్ సూపర్ హీరో కాన్సెప్ట్ రెండూ పూర్తి భిన్నమైన శైలులు కావడం విశేషం.
ఒకే సమయంలో రెండు భిన్నమైన జోనర్లలో నటించడం అల్లు అర్జున్ నటనలోని వర్సటైలిటీకి గొప్ప సవాల్. సుదీర్ఘకాలం గ్యాప్ తీసుకోకుండా క్రమం తప్పకుండా వరుస సినిమాలను ప్రేక్షకు ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతోనే బన్నీ మాస్టర్ ప్లాన్ రూపొందించారు. న్యూ వర్కింగ్ స్టైల్ తో బాక్సాఫీస్ వద్ద ఐకాన్ స్టార్ సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది.
















































