దృశ్యం-3 బాలీవుడ్ లో ఫైనల్ చాప్టర్!
Bollywood Drishyam 3థ్రిల్లర్ చిత్రాల చరిత్రలో సరికొత్త సంచలనం సృష్టించిన `దృశ్యం` ఫ్రాంచైజీ నుంచి మోస్ట్ అవేటెడ్ అప్‌డేట్ వచ్చేసింది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సిరీస్ చివరి భాగానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి `దృశ్యం 3: ది కన్‌క్లూజన్` అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేసారు. ఈ చిత్రంలో అందరికీ సుపరిచితమైన విజయ్ సల్గావ్కర్ పాత్రలో అజయ్ దేవ్‌గన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కుటుంబం కోసం ఎంతటి సాహసానికైనా తెగించే సాధారణ కేబుల్ ఆపరేటర్ పాత్రలో ఆయన చూపించిన నటన గతంలో ఏ స్థాయిలో ప్రశంసలు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఈ ఫ్రాంచైజీకి ముగింపు పలికే ఫైనల్ చాప్టర్ కోసం ఆయన మళ్లీ ఆ గెటప్‌లోకి మారుతుండటం అభిమా నులను ఉర్రూతలూగిస్తోంది.
మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ఒరిజినల్ చిత్రానికి రీమేక్‌గా వచ్చినప్పటికీ హిందీలో అజయ్ దేవ్‌గన్ ఈ సిరీస్‌ను తనదైన నటనతో వేరే లెవెల్‌కు తీసుకెళ్లారు. మొదటి రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. తాజాగా రాబోతున్న మూడో భాగం క్రైమ్ థ్రిల్లర్ కథకు పరిపూర్ణమైన ముగింపును ఇస్తుందని, మునుపటి భాగాల కంటే సరికొత్త ట్విస్టులు ఉంటాయని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.
ఫైనల్ చాప్టర్‌కు సంబంధించి ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. పోలీస్ డిపార్ట్‌మెంట్ .. విజయ్ సల్గావ్కర్ కుటుంబం మధ్య జరిగే మైండ్ గేమ్‌కు ఈ చిత్రంతో పూర్తి తెరపడనుంది. ఈసారి కథ మరింత గ్రిప్పింగ్‌గా, ఊహకందని మలుపులతో ఉండబోతుందని ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అజయ్ దేవ్‌గన్ ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం.







































