షోమాన్ టైటిల్ బక్వాస్ అంటూ కొట్టిపారేసిన లెజెండరీ డైరెక్టర్!
Legendary director dismisses the Showman title as nonsense!బాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దిగ్గజ దర్శకుడు సుభాష్ ఘాయ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తనను అందరూ పిలిచే `షోమాన్` అనే బిరుదుపై ఆయన స్పందిస్తూ ఆ టైటిల్ తనకు అస్సలు ఇష్టం లేదని.. అది కేవలం బక్వాస్ అని కొట్టిపారేశారు. ఎలాంటి అహంకారంతో జీవించడానికి తాను ఇష్టపడనని.. ఎప్పుడూ సాధారణ సినిమా విద్యార్థిగానే ఉండాలని కోరుకుంటానని స్పష్టం చేశారు.
సినిమా రంగంలో దశాబ్దాలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించిన సుభాష్ ఘాయ్ ఇండస్ట్రీలో పేరు ప్రఖ్యాతలు వచ్చినా తాను ఎప్పుడూ సాధారణ జీవితాన్నే గడపడానికి ఇష్టపడతానని తెలిపారు. రాజ్ కపూర్ తర్వాత ఆ స్థాయి షోమాన్ బిరుదును మీడియా తనకు ఆపాదించినా? తాను మాత్రం ఎప్పుడూ ఆ బిరుదును ప్రచారం కోసం వాడుకోలేదన్నారు. తన విజయాలను, అపజయాలను ఒకేలా స్వీకరిస్తూ ముందుకు సాగే నిజమైన సినిమా ప్రేమికుడిగా ఉండటమే ఇష్టమని వెల్లడించారు.
ప్రస్తుత కాలంలో మారుతున్న చిత్ర పరిశ్రమ పోకడలపై కూడా ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. నేటి తరం యువ దర్శకులు తమ సొంత ఆలోచనలు, వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని.. అయితే అప్పట్లో తాము మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాలు తెరకెక్కించేవారమని పేర్కొ న్నారు. వయసుతో సంబంధం లేకుండా టెక్నాలజీని, సరికొత్త ట్రెండ్స్‌ను నేర్చుకుంటూ ముందుకు సాగడంలోనే అసలైన సంతోషం ఉందని సుభాష్ ఘాయ్ అభిప్రాయపడ్డారు.







































