బాలయ్య కోసం దర్శకుడు స్పెషల్ హోమం
Special Homam for NBK recovery
NBK 111 సెట్ లో గాయపడి ప్రస్తుతం హైదరాబాద్ AIG ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి బాలకృష్ణ ను ఈరోజు ఆదివారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించి వచ్చారు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్న బాలయ్య ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య NBK 111 చేస్తున్నారు. కాకినాడ పోర్ట్ లో షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలయ్య కాలు జారీ పడిపోవడంతో ఆయన మోకాలికి గాయమైంది. దానితో షూటింగ్ వాయిదాపడింది. అయితే బాలయ్య త్వరగా కోలుకోవాలి అంటూ అభిమానులే కాదు NBK 111 దర్శకుడు గోపీచంద్ మలినేని, మరికొంతమంది ప్రముఖులు స్పెషల్ హోమం నిర్వహించారు.
దర్శకుడు గోపీచంద్ మలినేని నేతృత్వంలో ఈరోజు ఆదివారం ఉదయం బెంగళూరు సమీపంలోని హోస్కోట్, కంబలిపుర ప్రాంతంలో వేంచేసి ఉన్న ప్రసిద్ధ శ్రీ కాటేరమ్మ అమ్మవారి దివ్య క్షేత్రంలో హోమం అలాగే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బాలకృష్ణకు ఎలాంటి విఘ్నాలు కలగకూడదని, ఆయన శారీరకంగా మరింత దృఢంగా మారాలని పండితులు ప్రత్యేక మంత్రోచ్ఛారణల నడుమ ఈ చండీ యాగాన్ని నిర్వహించారు.
ఈ పవిత్ర క్రతువులో దర్శకుడు గోపీచంద్ మలినేనితో పాటు నందమూరి అభిమానులు, చిత్ర సీమకు చెందిన పలువురు పాల్గొని బాలయ్య ఆరోగ్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.








































