ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rajamouli wraps IMAX action shoot for Varanasi

సినిమా స్కోప్ నుంచి ఐమ్యాక్స్ వైపు జ‌క్క‌న్న!

Rajamouli wraps IMAX action shoot for Varanasi

భారతీయ సినిమాను గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద నిలబెట్టిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, తన తదుపరి ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` కోసం సాంకేతికంగా సరికొత్త సాహసం చేస్తున్నారు. ఇన్నాళ్లూ తన కెరీర్‌లో అత్యంత ఇష్టమైన వైడ్ `సినిమాస్కోప్` ఫార్మాట్‌లోనే దృశ్యాలను ఆవిష్కరించిన జక్కన్న, ఈ సినిమాలోని కీలక భాగాన్ని భారీ 70ఎంఎం ఐమాక్స్ (IMAX) ఫిల్మ్‌పై చిత్రీకరిస్తున్నారు.

అత్యున్నత దృశ్య నాణ్యతతో థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త విజువల్ వండర్ ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ సాంకేతికతను వాడుతున్నారు. అయితే ఈ మార్పు తన సృజనాత్మక శైలిని ఏమాత్రం మార్చలేదని, కథను నమ్మి రాసుకున్న సన్నివేశాలు మొదటి నుంచే ఐమాక్స్ ఫార్మాట్‌కు అద్భుతంగా సరిపోయేలా డిజైన్ చేసుకున్నామని రాజమౌళి స్పష్టం చేశారు.

నిజానికి సుదీర్ఘకాలంగా అలవాటైన సినిమాస్కోప్ ఫ్రేమింగ్ నుండి ఐమాక్స్‌కు మారే క్రమంలో ఎదురైన సవాళ్లను రాజమౌళి తనదైన శైలిలో అధిగమించారు. ఐమాక్స్ స్క్రీన్లతో పాటు సాధారణ థియేటర్లలోని సినిమాస్కోప్ స్క్రీన్లపై కూడా ఒకే దృశ్యం ఏకకాలంలో పర్‌ఫెక్ట్‌గా కనిపించేలా (అనమార్ఫిక్ ఫ్రేమింగ్) కెమెరా యాంగిల్స్ సెట్ చేయడం ప్రారంభంలో కొంత సవాలుగా అనిపించిందని ఆయన వెల్లడించారు.

షూటింగ్ మొదలైన తొలి రోజుల్లో ఈ రెండు భిన్నమైన ఫార్మాట్లకు సరిపోయేలా సర్దుబాట్లు చేయడం కొంచెం ఇబ్బంది పెట్టినా.. ఆ తర్వాత ఈ విజువల్ బ్యాలెన్స్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో తమ టీమ్‌కు పూర్తి అవగాహన వచ్చిందని జక్కన్న వివరించారు. ఈ ప్రయోగంతో వెండితెరపై రాజమౌళి సృష్టించబోయే విజువల్ వింత కోసం ఇండస్ట్రీ సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Rajamouli Delighted as IMAX Returns to Hyderabad Ahead of Varanasi Release