చేజారిన అవకాశంపై నటి ఆసక్తికర వ్యాఖ్యలు!

బాలీవుడ్ విలక్షణ నటి చిత్రంగద సింగ్ తాజాగా కెరీర్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. `ఉరి: ద సర్జికల్ స్ట్రైక్` వంటి సంచలన చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకుడు ఆదిత్య ధర్ దర్శకత్వంలో తాను నటించాల్సిందని తెలిపారు. ఒకానొక సమయంలో ఈ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైందని షూటింగ్ ప్రారంభించడానికి అంతా సిద్ధమైందని పేర్కొన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆ సినిమా పట్టాలెక్కలేదన్నారు. ఆ అవకాశం చేజారిపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.
చిత్రంగద సింగ్ మాట్లాడుతూ, `ఆదిత్య ధర్ అప్పట్లో ఓ అద్భుతమైన స్క్రిప్ట్‌తో తనను సంప్రదించారని తన పాత్ర కూడా చాలా బలంగా డిజైన్ చేసారని గుర్తు చేసుకున్నారు. `మేము సినిమా గురించి సుదీర్ఘంగా చర్చించాం. అన్నీ అనుకూలించాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు` అని వివరించారు. ఆదిత్య ధర్ మేకింగ్ స్టైల్ , ఆయన విజన్ తనకు చాలా ఇష్టమని, భవిష్యత్తులో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నట్లు చిత్రంగద మనసులోని మాటను బయట పెట్టారు.
ప్రస్తుతం ఆదిత్య ధర్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండగా చిత్రంగద సింగ్ కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ , సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలను ఎంచు కుంటు న్నారు. గొప్ప దర్శకుడితో పని చేసే అవకాశం మిస్ అయినా? సరైన సమయం వచ్చినప్పుడు మళ్ళీ తమ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







































