ఇండియాకు గుడ్ బై చెప్పేసిన న‌టి!

Mandana Karimi Says Goodbye To IndiaMandana Karimi Says Goodbye To India

ఇరాన్ సంతతికి చెందిన బాలీవుడ్ నటి బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ మందనా కరీమీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 16 ఏళ్లుగా తన రెండో ఇల్లుగా భావించిన భారతదేశాన్ని వదిలి వెళ్తున్నట్లు  ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఓ భావోద్వేగపూరిత వీడియోలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. `భారతదేశానికి గుడ్ బై చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇది నాకు చాలా కష్టమైన నిర్ణయం` అంటూ  కన్నీటి పర్యంతమయ్యారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలు , ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణం తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మందనా కరీమీ గత కొంతకాలంగా ఇరాన్ రాజకీయ పరిస్థితులపై బహిరంగంగా గొంతు విప్పుతున్నారు. అయితే తన పోరాటానికి భారతదేశంలో ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్నినెలలుగా తాను ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి, ఆన్‌లైన్ ట్రోలింగ్ , భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ ఉండటం తనకు సురక్షితం కాదని ఆమె భావిస్తున్నారు. ప్రాణహాని హెచ్చరికలు రావడంతో అజ్ఞాత ప్రదేశంలో గడపాల్సి వచ్చిందని కనీసం  సన్నిహితులకు కూడా తన ఆచూకీ తెలియని పరిస్థితుల్లో ఉన్నానని పేర్కొన్నారు. తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయలేకపోవడం వల్లే తాను ఈ దేశాన్ని వీడుతున్నట్లు  స్పష్టం చేశారు.

అయితే భారత్‌ను వదిలి వెళ్తున్న మందనా కరీమీ తన స్వదేశమైన ఇరాన్‌కు మాత్రం తిరిగి వెళ్లడం లేదు. దశాబ్దం క్రితమే ఇరాన్ ప్రభుత్వం ఆమెపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. `నేను భారత్‌ను వదిలి వెళ్తున్నాను కానీ ఇరాన్‌కు వెళ్లడం లేదు. అక్కడి ప్రభుత్వం పడిపోయినప్పుడే నేను నా మాతృభూమికి చేరుకుంటాను` అని ఆమె వివరించారు. 16 ఏళ్ల పాటు తనకు గుర్తింపునిచ్చిన భారతదేశంపై తనకు ఎంతో ప్రేమ ఉందని కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులే తనను దూరంగా వెళ్లేలా చేస్తున్నాయని భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. మందనా తీసుకున్న ఈ నిర్ణయం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Actor Mandana Karimi Says Goodbye To India After 16 Years