జియో- హాట్‌స్టార్‌పై `జీ` మ్యూజిక్ 25కోట్ల దావా

భారతీయ వినోద రంగంలో దిగ్గజ సంస్థలైన జీ ఎంటర్‌టైన్‌మెంట్ -రిలయన్స్-డిస్నీ (జియో స్టార్) మధ్య కాపీరైట్ వివాదం ముదిరి న్యాయపోరాటానికి దారితీసింది. లైసెన్స్ ఒప్పందాల గడువు ముగిసినా తన మ్యూజిక్ లైబ్రరీలోని పాటలను జియో హాట్‌స్టార్, ఇతర టీవీ ఛానళ్లలో అనధికారికంగా వాడుకున్నారని ఆరోపిస్తూ `జీ` సంస్థ కోర్టులో దావా వేసింది.
సుమారు 1800 పేజీలతో దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో కనీసం 50 సార్లు తమ మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన జరిగిందని పేర్కొంటూ.. ఇందుకు గాను 3 మిలియన్ డాలర్ల (దాదాపు 25 కోట్లు) నష్టపరిహారాన్ని జీ డిమాండ్ చేస్తోంది. ఈ వివాదంపై స్పందించిన న్యాయస్థానం.., విచారణ కొనసాగుతున్న సమయంలో జీ సంస్థకు చెందిన కంటెంట్‌ను వాడుకోకుండా చూడాలని జియో స్టార్‌ను ఆదేశించింది.
అయితే ఈ నష్టపరిహార డిమాండ్‌ను జియో స్టార్ తోసిపుచ్చింది. వివాదాస్పద కంటెంట్‌ను తొలగించడానికి తాము ఇప్పటికే చర్యలు తీసుకున్నామని.. అయితే పాత డేటా లేదా ఆర్కైవ్స్‌లో ఉండే కంటెంట్ కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని రిలయన్స్-డిస్నీ వాదిస్తోంది. ఇప్పటికే లండన్ ఆర్బిట్రేషన్‌లో క్రికెట్ లైసెన్సింగ్ డీల్‌కు సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య ఒక బిలియన్ డాలర్ల భారీ వివాదం నడుస్తోంది.
భారత మీడియా రంగంలో 8.5 బిలియన్ డాలర్ల మెగా విలీనం తర్వాత ఏర్పడిన జియో స్టార్‌తో `జీ` తలపడుతున్న తీరు... దేశీయ స్ట్రీమింగ్ - బ్రాడ్‌కాస్టింగ్ మార్కెట్‌లో కంటెంట్ హక్కుల కోసం పెరుగుతున్న పోరాటాలను ప్రతిబింబిస్తోంది.






































