మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ `మా` హెచ్చరిక

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సంక్షేమం కోసం పనిచేసే ఏకైక అధికారిక సంస్థ `మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్`` (MAA) మాత్రమేనని...దీనికి మించి మరే ఇతర సంఘాలకు గుర్తింపు లేదని `మా` కార్యవర్గం తాజా అధికారిక ప్ర‌క‌ట‌న‌లో స్పష్టం చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని కళాకారులకు ప్రాతినిధ్యం వహించే ఈ సంస్థ, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో అనుబంధం కలిగి ఉందని వెల్లడించింది.

అయితే ఇటీవల AP MAA లేదా MAA AP వంటి తప్పుదారి పట్టించే పేర్లతో కొందరు వ్యక్తులు, అనధికారిక గ్రూపులతో కొత్తగా పరిశ్రమలోకి వచ్చే వారిని మోసం చేస్తూ చట్టవిరుద్ధంగా డబ్బు వసూలు చేస్తున్నట్లు అసోసియేషన్ దృష్టికి వచ్చింది. ఇటువంటి నకిలీ సంస్థలతో గందరగోళం సృష్టించే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని `మా` గట్టి హెచ్చరిక జారీ చేసింది.

డబ్బు వసూళ్ల విషయంలో తాము ఎంతో పారదర్శకంగా ఉంటామని.. తమ తరపున నిధులు వసూలు చేసే అధికారం ఏ ఒక్క వ్యక్తికి లేదా బ‌య‌టి గ్రూపుల‌కు లేదని అసోసియేషన్ స్పష్టం చేసింది. ఆర్టిస్టులు ఎవరైనా ఇటువంటి మోసపూరిత సంఘాలలో సభ్యత్వాలు తీసుకోవద్దని.. ఎవరికీ ఎలాంటి చెల్లింపులు చేయవద్దని కోరింది. ఒకవేళ ఎవరైనా డబ్బు డిమాండ్ చేసినా లేదా త‌ప్పుడు సంఘాల గురించి సమాచారం తెలిసినా.. వెంటనే హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని `మా`' ప్రధాన కార్యాలయానికి ఫిర్యాదు చేయాల‌ని సూచించింది.

పరిశ్రమ ఐక్యతను.. నటీనటుల సమగ్రతను కాపాడటానికి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని.. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పేరును దుర్వినియోగం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని `మా` తన ప్రకటనలో పిలుపునిచ్చింది. ఆంధ్రప్ర‌దేశ్ లో ఒక కొత్త సినీప‌రిశ్ర‌మ ఏర్పాటు గురించి చ‌ర్చ జ‌రుగుతున్న ఈ సమ‌యంలో ఏపిలోను మా అసోసియేష‌న్ ఉండాలి. కానీ అవ‌న్నీ ఎవ‌రికి వారు ప్రారంభించేస్తే ఎలా కుదురుతుంది? అన్న‌దే `మా` అస‌లు పాయింట్!

.Official Statement from MAA Movie Artistes AssociationOfficial Statement from MAA