అసిస్టెంట్ డైరెక్టర్ టూ లీడ్ రోల్
Shobinaw Satyaa from a second assistant director to lead role
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం `హనుమాన్ అంశ` బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం పాధించిన సంగతి తెలిసిందే. 1.80 కోట్ల పరిమిత బడ్జెట్‌తో నిర్మితమైన సినిమా అనూహ్యంగా 45 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ చిత్రం సాధించిన విజయం ఎంత గొప్పదో ఇందులో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త నీమ్ కరోలీ బాబా (మహారాజ్ జీ) పాత్ర పోషించిన శోభినవ్ సత్యా నటుడిగా మారిన తీరు కూడా అంతే అద్భుతంగా నిలిచింది. అసలు నటుడే కాని ఆయన సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి అనుకోకుండా లీడ్ రోల్‌లోకి రావడం చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
చిత్రీకరణ ప్రారంభమైన సమయంలో ప్రధాన పాత్ర కోసం ఎంపిక చేసిన నటుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. షూటింగ్ సెట్ సిద్ధంగా ఉండటం, సాంకేతిక నిపుణులు సమకూరడంతో చిత్రీకరణను ఆపకూడదని దర్శకుడు విశాల్ చతుర్వేది నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ప్రొడక్షన్, ప్రాప్స్ పనులు చూసుకుంటున్న శోభినవ్ సత్యాను చూసిన దర్శకుడు, ఆయనలో నీమ్ కరోలీ బాబా రూపురేఖలను గమనించారు. వెంటనే ఆయనకు ఐదు గంటల పాటు ఆడిషన్ నిర్వహించి బాబా పాత్రకు సరిగ్గా సరిపోతారని భావించి ఆ కీలక బాధ్యతను అప్పగించారు. ఈ అనూహ్య మార్పుతో ఒక్కరాత్రిలోనే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రధాన నటుడిగా మారిపోయానని శోభినవ్ వెల్లడించారు.
ఈ అరుదైన అవకాశాన్ని శోభినవ్ సత్యా ఒక దైవిక లీలగా అభివర్ణించారు. తాను 2009 నుంచి నీమ్ కరోలీ బాబాకు తీవ్ర భక్తుడినని ఈ పాత్రను పోషించడం వెనుక ఏదో అదృశ్య శక్తి నడిపించిందని విశ్వసిస్తున్నారు. ప్రేక్షకులు తనను ఎలా స్వీకరిస్తారో? అని ప్రారంభంలో కొంత ఆందోళన చెందినా? తెరపై ఆయన కనబరిచిన సహజమైన అభినయం, బాబాతో ఉన్న శారీరక పోలికలు ప్రేక్షకులను కట్టిపడేసాయి. సాధారణ సెకండ్ అసిస్టెంట్ డైరెక్టర్ తెరముందుకు వచ్చి నటనతో బాబా రూపానికి జీవం పోసి కోట్ల మంది హృదయాలను గెలుచుకోవడం `హనుమాన్ అంశ` చిత్రానికి అతిపెద్ద బలంగా నిలిచింది.







































