తెలుగులో `వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్` చిత్రంతో ఆరంగేట్రం చేసిన ఇషా కొప్పికర్ ఆ తర్వాత నాగార్జున సరసన `చంద్రలేఖ`లో నటించింది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అయితే తనదైన అందం, బోల్డ్ పెర్ఫామెన్స్ తో ఇషా అందరి దృష్టిని ఆకర్షించింది. అటు బాలీవుడ్ లోను వరుస చిత్రాల్లో నటించి మంచి పేరే తెచ్చుకుంది. కానీ స్టార్ డమ్ ఆశించిన స్థాయికి చేరుకోలేదు. అయితే ఇషా కెరీర్ ఒక దశలో ఉండగానే పెళ్లితో సినిమాలకు దూరమైంది.
ఆమె ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ మేన్ టిమ్మీ నారంగ్ ని ప్రేమ వివాహం చేసుకుంది. టిమ్మీ రెస్టారెంట్స్, లాడ్జింగ్ బిజినెస్ లో నిష్ణాతుడు. ఈ జంటకు ఒక అందమైన కుమార్తె కూడా ఉంది. అయితే 14 ఏళ్ల సంసార జీవితం తర్వాత ఈ జంట మనస్ఫర్థలతో విడిపోయింది. దానికి టిమ్మీనే కారకుడు అని ఇషా నిందించింది. అతడి బాధ్యతారాహిత్యాన్ని ఇషా కొప్పికర్ నిలదీసింది. అతడి బాధ్యతారాహిత్యం కారణంగా తన కూతురును కవలకూడదని కూడా కండీషన్ పెట్టి మరీ ఇషా అతడి నుంచి విడిపోయినట్టు టిమ్మీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చివరికి వారు స్నేహపూర్వకంగా విడిపోయారు.
ఒక జిమ్ లో కలుసుకున్నప్పుడు ఈ జంట ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత మూడేళ్ల పాటు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. నవంబర్ 2009లో వివాహం చేసుకున్నారు. కుమార్తె రియానా జూలై 2014లో జన్మించింది. కానీ 2023లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. చిన్నారి రియానాకు ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా తడబడ్డానని ఇషా కొప్పికర్ అంగీకరించారు.