Advertisement

సినీజోష్‌ రివ్యూ: హిప్పీ

Fri 07th Jun 2019 12:45 PM
telugu movie hippi,hippi movie review,hippi movie review in cinejosh,hippi movie cinejosh review,karthikeya new movie hippi  సినీజోష్‌ రివ్యూ: హిప్పీ
telugu movie hippi review సినీజోష్‌ రివ్యూ: హిప్పీ
సినీజోష్‌ రివ్యూ: హిప్పీ Rating: 2 / 5
Advertisement

వి క్రియేషన్స్‌ 

హిప్పీ 

నటీనటులు: కార్తికేయ, దిగంగన సూర్యవంశీ, శ్రద్ధా దాస్‌, జె.డి.చక్రవర్తి, జజ్బా సింగ్‌, వెన్నెల కిశోర్‌, సుదర్శన్‌, బ్రహ్మాజీ, హరితేజ తదితరులు 

సంగీతం: నివాస్‌ కె. ప్రసన్న 

సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌ 

ఎడిటింగ్‌: ప్రవీణ్‌ కె.ఎల్‌. 

సంగీతం: నివాస్‌ కె.ప్రసన్న 

నిర్మాత: కలైపులి ఎస్‌.థాను 

రచన, దర్శకత్వం: టి.ఎన్‌.కృష్ణ 

విడుదల తేదీ: 06.06.2019 

ఆర్‌ఎక్స్‌ 100 సాధించిన అనూహ్య విజయంతో హీరో కార్తికేయకు ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ వచ్చేసింది. దాన్ని క్యాష్‌ చేసుకునేందుకు సెకండ్‌ మూవీని స్టార్ట్‌ చేసేశారు నిర్మాత కలైపులి ఎస్‌.థాను. నువ్వు నేను ప్రేమ ఫేమ్‌ టి.ఎన్‌.కృష్ణ దర్శకత్వంలో హిప్పీ అనే డిఫరెంట్‌ టైటిల్‌తో సినిమా మొదలైంది. కార్తికేయ హీరోగా నటించిన రెండో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి హిప్పీ సినిమా ప్రేక్షకుల అంచనాలను రీచ్‌ అయ్యిందా? కార్తికేయకు ఈ సినిమా ఎలాంటి పేరుని తెచ్చింది? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

ఓపెన్‌ చేస్తే హిప్పీగా పిలవబడే దేవా(కార్తికేయ) ఆత్మహత్య చేసుకోవడానికి ఓ పెద్ద బిల్డింగ్‌ పైకి ఎక్కుతాడు. ఆ బిల్డింగ్‌ చుట్టూ జనం చేరతారు. తను ప్రేమించిన అమ్మాయి ఆముక్త మాల్యద(దిగంగన సూర్యవంశీ) మోసం చేసిందని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్తాడు దేవా. ఫ్లాష్‌బ్యాక్‌కి వెళితే.. కిక్‌ బాక్సర్‌ అయిన హిప్పీ అంటే అమ్మాయిలకు పిచ్చి. అయితే స్నేహ(జజ్బా సింగ్‌) అనే అమ్మాయి హిప్పీని తన లవర్‌గా మార్చుకుంటుంది. ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్‌ చేసుకునే ఇద్దర్నీ స్నేహ ఫ్రెండ్‌ ఆముక్త మాల్యద ఓరోజు కలుస్తుంది. ఆముక్తను చూస్తే లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ అన్నట్టుగా ఆమె ప్రేమలో పడిపోతాడు హిప్పీ. ఆ విషయం తెలుసుకున్న స్నేహ వారిద్దర్నీ కలిపి తను తప్పుకుంటుంది. అలా మొదలైన హిప్పీ, ఆముక్త ప్రేమ రకరకాల మలుపులు తిరుగుతుంది. ప్రేమ, ద్వేషం, అవమానం, అసహనం, అసూయ...ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ వారి ప్రేమలో కనిపిస్తాయి. అలా జరుగుతుండగానే హిప్పీ ఆత్మహత్య చేసుకోవడానికి డిసైడ్‌ అవుతాడు. హిప్పీ అలా ఎందుకు చెయ్యాల్సి వచ్చింది? హిప్పీ, ఆముక్తల ప్రేమ ఎలాంటి మలుపులకు దారి తీసింది? చివరికి ఇద్దరూ కలుసుకున్నారా? పెళ్లి చేసుకున్నారా? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

ఆర్‌ ఎక్స్‌ 100 సినిమాలో ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌ ద్వారా పరిచయమై అందర్నీ ఆకట్టుకున్న కార్తికేయ ఈ సినిమాలో చేసిన హిప్పీ క్యారెక్టర్‌లో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. డాన్సుల్లో, ఫైట్స్‌లో ఫర్వాలేదనిపించినా.. పెర్‌ఫార్మెన్స్‌ పరంగా అన్ని ఎమోషన్స్‌ని పండించలేకోయాడు. ఈ విషయంలో హీరోయిన్‌ దిగంగనకు మంచి మార్కులే పడతాయి. తన క్యారెక్టర్‌కి హండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేసింది దిగంగన. హీరోయిన్‌ ఫ్రెండ్‌గా కనిపించిన జజ్బా సింగ్‌ కొన్ని రొమాంటిక్‌ సీన్స్‌లో ఆకట్టుకుంది. హీరో బాస్‌గా నటించిన జె.డి.చక్రవర్తి అవసరానికి మించి నటించేసాడనిపిస్తుంది. కథకు అవసరం లేకపోయినా అతనితో తెలంగాణా స్లాంగ్‌లో మాట్లాడించారు. అయితే అది అంత నేచురల్‌గా లేదు. కావాలని తెలంగాణాలో మాట్లాడుతున్నట్టు ఉంది తప్ప ఏ దశలోనూ అతని డైలాగ్స్‌ ఆడియన్స్‌ని ఆకట్టుకోవు. మిగతా క్యారెక్టర్స్‌లో బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్‌, సుదర్శన్‌ తమ క్యారెక్టర్ల పరిధి మేరకు నవ్వించే ప్రయత్నం చేశారు. హీరోయిన్‌ శ్రద్ధా దాస్‌ సిట్యుయేషనల్‌గా వచ్చే ఓ స్పెషల్‌ సాంగ్‌లో మెరిసింది. 

సాంకేతిక విభాగాల పనితనం గురించి చెప్పుకోవాలంటే ఆర్‌.డి.రాజశేఖర్‌ ఫోటోగ్రఫీ బాగుంది. నివాస్‌ కె.ప్రసన్న చేసిన పాటల్లో రెండు పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ పూర్తిస్థాయిలో బాగుందని చెప్పలేం. కొన్ని సీన్స్‌లో మాత్రమే అతని మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. ప్రవీణ్‌ కె.ఎల్‌. ఎడిటింగ్‌ కొన్ని చోట్ల బాగున్నా, కొన్ని సీన్స్‌ ల్యాగ్‌ అనిపించడం, కొన్ని అనవసరమైన సీన్స్‌ని కూడా కట్‌ చేయకపోవడం వల్ల సినిమా లెంగ్త్‌ ఎక్కువైంది. నిర్మాత కలైపులి ఎస్‌.థాను సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ప్రొడక్షన్‌ వేల్యూస్‌ బాగున్నాయి. డైరెక్టర్‌ టి.ఎన్‌.కృష్ణ గురించి చెప్పాలంటే యూత్‌ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాసుకున్నారనిపిస్తుంది. ఆర్‌ఎక్స్‌ 100లో కొన్ని లిప్‌లాక్‌ సీన్స్‌, గ్లామరస్‌ సీన్స్‌ వల్ల ఆ సినిమాకి యూత్‌ బాగా ఎట్రాక్ట్‌ అయ్యారు. అదే తరహాలో ఈ సినిమా కూడా ఉంటుందని భావించాడు డైరెక్టర్‌. అయితే కథ కంటే మిగతా విషయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల అసలుకే మోసం జరిగింది. సినిమాలో విషయం లేకపోవడం వల్ల గ్లామర్‌ సీన్స్‌, ఎడల్డ్‌ జోక్స్‌ వంటి వాటి మీద ఆధారపడాల్సి వచ్చింది. హీరో, హీరోయిన్‌ గొడవ పెట్టుకోవడానికి, విడిపోవడానికి బలమైన కారణం కనిపించదు. కొన్ని సీన్స్‌ సగటు ప్రేక్షకులకు అర్థంకాని విధంగా స్టార్ట్‌ అయి, ఎండ్‌ అవుతాయి. ఈ సినిమాకి ప్లస్‌ పాయింట్స్‌గా చెప్పుకోదగ్గవి ఫోటోగ్రఫీ, హీరోయిన్‌ పెర్‌ఫార్మెన్స్‌, అప్పుడప్పుడు నవ్వించే కొన్ని డైలాగ్స్‌, రొమాంటిక్‌ సీన్స్‌. హీరో క్యారెక్టరైజేషన్‌, పెర్‌ఫార్మెన్స్‌, ల్యాగ్‌ అనిపించే కొన్ని సీన్స్‌, అవసరానికి మించిన జె.డి.చక్రవర్తి నటన ఈ సినిమాకి మైనస్‌ పాయింట్స్‌ అయ్యాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఒక అర్థం పర్థం లేని కథను తీసుకొని దాని చుట్టూ రెండున్నర గంటలు సినిమాను నడిపించే దుస్సాహసం చేశాడు డైరెక్టర్‌ టి.ఎన్‌.కృష్ణ. ప్రేమ, పెళ్ళి వంటి విషయాల్లో ఏదో ఒక సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసిన ఈ సినిమా ఎవరికీ ఎలాంటి సందేశాన్ని ఇవ్వకపోగా ఈ సినిమా ఎందుకు తీశారనే సందేహం ప్రేక్షకులకు కలుగుతుంది. ఈ సినిమా ఆర్‌ఎక్స్‌ 100 తరహాలో భారీ విజయాన్ని అందుకుంటుందన్న దర్శకనిర్మాతల నమ్మకాన్ని హిప్పీ వమ్ము చేసిందని చెప్పాలి. 

ఫినిషింగ్‌ టచ్‌: హిప్పీ.. తలనొప్పీ!

telugu movie hippi review:

kartikeya new movie hippi

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement