Advertisement

సినీజోష్ రివ్యూ: జంబలకిడి పంబ

Sat 23rd Jun 2018 01:16 PM
telugu movie jambalakidi pamba,jambalakidi pamba movie review,jambalakidi pamba review in cinejosh,jambalakidi pamba cinejosh review  సినీజోష్ రివ్యూ: జంబలకిడి పంబ
jambalakidi pamba review సినీజోష్ రివ్యూ: జంబలకిడి పంబ
సినీజోష్ రివ్యూ: జంబలకిడి పంబ Rating: 1.5 / 5
Advertisement

శివం సెల్యులాయిడ్స్‌, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ 

జంబలకిడి పంబ 

తారాగణం: శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని, తనికెళ్ళ భరణి, వెన్నెల కిశోర్‌, హరితేజ, సత్యం రాజేష్‌, రఘుబాబు, షకలక శంకర్‌, జయపక్రాష్‌రెడ్డి, సుద, ధన్‌రాజ్‌ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సతీష్‌ ముత్యాల 

ఎడిటింగ్‌: తమ్మిరాజు 

సంగీతం: గోపీసుందర్‌ 

మాటలు: శ్రీనివాస్‌ అంకాలపు 

నిర్మాతలు: రవి, జోజో జోస్‌, ఎన్‌.శ్రీనివాసరెడ్డి 

రచన, దర్శకత్వం: జె.బి.మురళీకృష్ణ 

విడుదల తేదీ: 22.06.2018 

తెలుగు సినిమాల్లో ఆరోగ్యకరమైన కామెడీకి పెట్టింది పేరు జంధ్యాల. బలమైన కథకు హాస్యాన్ని జోడించి ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించారు జంధ్యాల. ఆ తర్వాత కామెడీ కొత్త పుంతలు తొక్కింది. ఇ.వి.వి.సత్యనారాయణ వంటి దర్శకులు తీసిన సినిమాల్లో స్వచ్ఛమైన కామెడీ అని చెప్పుకునేంత కాకపోయినా ఏదో విధంగా ప్రేక్షకుల్ని నవ్వించడమే ధ్యేయంగా చాలా సినిమాలు చేసి హాస్యప్రియుల్ని ఆకట్టుకున్నారు. రాజేంద్రప్రసాద్‌, నరేష్‌ వంటి హీరోలు కామెడీ సినిమాలతోనే ఎక్కువగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడలాంటి వినోద ప్రధానమైన సినిమాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. వెకిలి చేష్టలతో, చిరాకు పుట్టించే డైలాగ్స్‌తో ప్రేక్షకుల మెదడుని తొలిచేసే సినిమాలు వస్తున్నాయి. ఇ.వి.వి.సత్యనారాయణ చేసిన సినిమాల్లో కామెడీ కొన్ని సందర్భాల్లో హద్దులు దాటినా ప్రేక్షకులు ఆదరించారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో జంబలకిడి పంబ చిత్రానికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇ.వి.వి. సినిమాల గురించి చెప్పాల్సి వస్తే జంబలకిడి పంబ చిత్రాన్ని ప్రస్తావించకుండా ఉండలేం. అలాంటి సూపర్‌హిట్‌ సినిమా టైటిల్‌తో ఈ శుక్రవారం మరో కామెడీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాసరెడ్డి, సిద్ధి ఇద్నాని జంటగా జె.బి.మురళీకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జంబలకిడి పంబ టైటిల్‌కి ఎంతవరకు న్యాయం చేసింది? ఈ సినిమాలోని కామెడీ ఆడియన్స్‌ని ప్రేక్షకులు ఎంతవరకు రిసీవ్‌ చేసుకున్నారు? అనేది సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం. 

వరుణ్‌(శ్రీనివాసరెడ్డి) ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. పల్లవి(సిద్ధి ఇద్నాని) ఓ బోటిక్‌ను రన్‌ చేస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళకు ఇష్టం లేకపోయినా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. కొన్నాళ్లకు ఇద్దరికీ అభిప్రాయ భేదాలు వస్తాయి. కలిసి ఉండలేమని నిర్ణయించుకొని విడాకుల కోసం లాయర్‌ హరిశ్చంద్రప్రసాద్‌(పోసాని) దగ్గరకు వెళ్తారు. 99 జంటలకు విడాకులు ఇప్పించి 100వ కేసు వాదించడానికి ఉత్సాహంగా ఉన్న హరిశ్చంద్ర దంపతులు ఓ యాక్సిడెంట్‌లో చనిపోతారు. స్వర్గంలోని దేవుడు అతని భార్యకు అనుమతినిస్తాడు. హరిశ్చంద్రను మాత్రం వరుణ్‌, పల్లవి విడాకులు తీసుకోకుండా చేస్తేనే స్వర్గంలోకి పర్మిషన్‌ ఇస్తానంటాడు. అలా వరుణ్‌, పల్లవిల ఇంట్లో దిగుతాడు హరిశ్చంద్ర. విడాకులు తీసుకోవద్దని వారిని బ్రతిమలాడతాడు. కానీ, వాళ్ళు వినరు. దాంతో ఇద్దరి ఆత్మలను తారుమారు చేస్తాడు. దాంతో వరుణ్‌.. పల్లవిగా, పల్లవి.. వరుణ్‌గా మారిపోతారు. ఇద్దరి చేష్టలు చూసేవారికి చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇద్దరి శరీరాలు మారినా వారి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాదు. శరీరాలు మారిన ఇద్దరూ ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు? చివరికి ఇద్దరూ విడాకులు తీసుకున్నారా? ఎవరి శరీరాలు వారికి దక్కాయా? అనేది మిగతా కథ. 

ఇప్పటివరకు ఎన్నో కామెడీ క్యారెక్టర్స్‌ చేసిన శ్రీనివాసరెడ్డి మొదటిసారి ఓ అమ్మాయిగా నటించాడు. అయితే ఆ క్యారెక్టర్‌కి అతను న్యాయం చెయ్యలేకపోయాడు. ఏ ఒక్క సీన్‌లోనూ తన పెర్‌ఫార్మెన్స్‌తో నవ్వించలేకపోయాడు. అతని హావభావాలు, నడక కృతకంగా అనిపిస్తాయి తప్ప ఎక్కడా నేచురాలిటీ కనిపించదు. ఇక హీరోయిన్‌గా నటించిన సిద్ధి ఇద్నాని సరేసరి. హీరోయిన్‌కి ఉండాల్సిన లక్షణాలు అస్సలు లేని సిద్ధిని సినిమా అంతా భరించాల్సి రావడం ప్రేక్షకుల దురదృష్టం అనే చెప్పాలి. లాయర్‌గా పోసాని నటన షరా మామూలే. అతను చెప్పిన డైలాగ్స్‌ చక్కిలిగింతలు పెట్టినా నవ్వు రానంత సాదాసీదాగా ఉన్నాయి. ఒక దశలో పోసాని కనిపిస్తే ప్రేక్షకులకు అసహనం మొదలవుతుంది. పోసానికి అసిస్టెంట్‌గా నటించిన వెన్నెల కిశోర్‌ కూడా నవ్వించడంలో విఫలమయ్యాడు. ఇక మిగతా ఆర్టిస్టుల పెర్‌ఫార్మెన్స్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. కథలోగానీ, కథనంలోగానీ, మాటల్లోగానీ, సన్నివేశాల్లోగానీ బలం లేనపుడు ఏ ఆర్టిస్టయినా అంతకుమించి ఏమీ చేయలేరని ఈ సినిమా మరోసారి నిరూపించింది. 

ఈ సినిమాలో టెక్నికల్‌ ఎస్సెట్స్‌ గురించి చెప్పుకోవడానికి ఏమీ లేవు. సతీష్‌ ముత్యాల ఫోటోగ్రఫీ చాలా సాదా సీదాగా ఉంది. విజువల్‌గా అద్భుతాలు చేసేంత సీన్‌ కథలో లేదు. ఎడిటింగ్‌ విషయానికి వస్తే అనవసరమైన సీన్స్‌ అన్నీ కట్‌ చేస్తే అరగంట నిడివి తగ్గుతుంది. ఒక్కోసీన్‌ టి.వి. సీరియల్‌లా ఉంటుందే తప్ప ఎంతకీ ఎండ్‌ అవ్వదు. ఈ సినిమా కోసం గోపీసుందర్‌తో మ్యూజిక్‌ చేయించాల్సినంత అవసరం అస్సలు లేదు. పాటలుగానీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌గానీ ఏ దశలోనూ ఆకట్టుకోవు. తలా తోక లేని కథతో కామెడీ పండించాలని చూసిన దర్శకుడు ఘోరంగా విఫలమయ్యాడు. ప్రారంభమైన పది నిముషాల్లోనే సినిమా ఎలా ఉండబోతోందన్న విషయం సగటు ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. తర్వాతి సీన్‌లో ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ఏమాత్రం కలిగించదు. ఆర్టిస్టుల నుంచి సరైన పెర్‌ఫార్మెన్స్‌ రాబట్టుకోవడంలో కూడా దర్శకుడు సక్సెస్‌ అవ్వలేదు. ఇ.వి.వి. జంబలకిడి పంబ చిత్రంలో ఆకట్టుకునే కథ, కథనాలతోపాటు కావాల్సినంత కామెడీ ఉంటుంది. అందుకే ఆ సినిమా కామెడీ సినిమాల్లో ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేసింది. అదే పేరుతో వచ్చిన ఈ సినిమాలో ఎంతో కొంత కామెడీ ఉండకపోతుందా అనుకునే ప్రేక్షకులు పూర్తిగా నిరాశకు లోనవుతారు. సినిమా నడుస్తున్నంత సేపు సీట్లలో అసహనంగా కదిలే ఆడియన్స్‌ సినిమా ఎప్పుడు క్లైమాక్స్‌కి వస్తుందా అని ఎదురుచూస్తారు. ఫస్ట్‌హాఫ్‌లో ఏదో సాదా సీదాగా కథ నడిచింది. సెకండాఫ్‌లో హీరో, హీరోయిన్‌ ఆత్మలు మారిన తర్వాత బోలెడంత కామెడీ ఉంటుందని ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. కానీ, అలాంటి అద్భుతాలు సెకండాఫ్‌లో ఏమీ జరగవు. ఫస్ట్‌హాఫ్‌కి ఏమాత్రం తీసిపోకుండా సెకండాఫ్‌ని రన్‌ చేయడంలో డైరెక్టర్‌ సక్సెస్‌ అయ్యాడు. యాక్షన్‌ అయినా, సెంటిమెంట్‌ అయినా, ప్రేమకథ అయినా డీల్‌ చెయ్యడం డైరెక్టర్స్‌కి కష్టం కాదు. కామెడీని డీల్‌ చెయ్యడం, ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యడం అత్యంత కష్టమైంది. అది అందరివల్లా అయ్యేది కాదని జంబలకిడి పంబ మరోసారి ప్రూవ్‌ చేసింది. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ సినిమాకి ప్లస్‌గా చెప్పుకోదగింది టైటిల్‌ ఒక్కటే. మిగతా అంశాలన్నీ సినిమాకి మైనస్‌గానే చెప్పుకోవచ్చు. ఈ సినిమా కథగానీ, కామెడీ ఏ వర్గం ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఫినిషింగ్‌ టచ్‌: ఇది బోర్‌ కొట్టించే పంబ

jambalakidi pamba review:

telugu movie jambalakidi pamba

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement