7 లక్షల అద్దెతో రాకేశ్ రోషన్ మరో రియల్ ఎస్టేట్ డీల్!
Rakesh Roshan leases Goregaon officeసినిమాలే కాదు.. రియల్ ఎస్టేట్ వైపు కూడా రాకేశ్ రోషన్ దూకుడుగా వెళ్తున్నారు. ముంబైలోని గోరేగావ్ ఈస్ట్‌లో ఉన్న తమ ప్రొడక్షన్ హౌస్‌కు చెందిన ఆఫీస్ స్పేస్‌ను ఐదేళ్ల లీజుకు ఇచ్చినట్లు రిజిస్ట్రేషన్ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ప్రీకాస్ట్ సొల్యూషన్స్ సంస్థకు ఈ స్థలాన్ని అప్పగించగా నెలకు 7 లక్షల రూపాయల అద్దె చొప్పున ఒప్పందం కుదిరింది. లోటస్ కార్పొరేట్ పార్క్‌లోని 2,727 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాతో పాటు బేస్‌మెంట్‌లో మూడు పార్కింగ్ స్లాట్లను ఇందులో కేటాయించారు. నవంబర్ 13న రిజిస్ట్రేషన్ జరగగా నవంబర్ 16 నుంచి లైసెన్స్ అమల్లోకి వచ్చింది. ఇంటీరియర్ పనుల కోసం జనవరి 16 వరకు రెంట్ ఫ్రీ పీరియడ్ ఇచ్చారట.
ఈ అగ్రిమెంట్ ప్రకారం ఆరు నెలల అద్దెకు సమానమైన 42 లక్షల రూపాయలను సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లించారు. ఏటా అద్దె 5 శాతం చొప్పున పెరిగేలా నిబంధనలు ఉన్నాయి. గతంలో కూడా రాకేశ్ రోషన్, ఆయన సతీమణి ప్రమీలా రోషన్ జుహూ ప్రాంతంలోని తమ అపార్ట్‌మెంట్‌ను మూడేళ్ల లీజుకు ఇవ్వడం ద్వారా 1.89 కోట్ల రూపాయల వరకు అద్దె రాబడి వచ్చేలా డీల్ చేసుకున్నారు.
నిర్మాతగా, దర్శకుడిగా బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన రాకేశ్ రోషన్.. చివరిగా `కాబిల్` నిర్మించగా, `క్రిష్ 3`కు దర్శకత్వం వహించి నిర్మించారు. ఇప్పుడు ఇలా వరుసగా ప్రాపర్టీ లీజులతో ఆదాయ మార్గాలను పక్కాగా సెట్ చేసుకుంటున్నారు.
















































