రానా.. నిఖిల్ చేతుల మీదుగా ఆస్కార్ ప్రచారం!
Rana and Nikkhil Advani have joined the Oscar-qualified short filmప్రణవ్ భాసిన్ రచన దర్శకత్వంలో తెరకెక్కిన పదకొండు నిమిషాల లఘు చిత్రం `వీ వేర్ హియర్` అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి ఆస్కార్ ప్రచారంలో ముందంజలో నిలిచింది. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా రానా దగ్గుబాటి.. నిఖిల్ అద్వానీ తోడవడం ప్రాజెక్ట్‌కు మరింత బలాన్ని చేకూర్చింది. ఇప్పటికే ఎనభైకి పైగా అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై ఇరవైకి మించిన అవార్డులను సొంతం చేసుకున్న ఈ చిత్రం 2027 అకాడమీ అవార్డుల లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో లాంగ్‌లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
టెక్నాలజీ పెరిగిపోతున్న కాలంలో ఉద్యోగాలు పోతాయేమోనన్న ఆందోళన.. మారుతున్న పనితీరుపై కామెడీ కోణంలో ఈ సినిమా ఆలోచింపజేస్తుంది. చిన్న ఊరిలో ఉండే ముగ్గురు రిటైర్డ్ వ్యక్తులు, యంత్రాలు మనుషుల స్థానాలను ఆక్రమిస్తున్నాయన్న భయంతో వినూత్న నిరసనకు దిగుతారు. మామూలు ధర్నాలు కాకుండా.. ఇంట్లో ఉండే ఉపకరణాల్లా నటిస్తూ నిరసన తెలిపే ఆలోచన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ నవ్వుల వెనుక మారుతున్న ప్రపంచంలో ఉనికి కోల్పోతామేమోనన్న పెద్దల వేదనను దర్శకుడు సున్నితంగా చూపించారు.
పామ్ స్ప్రింగ్స్ ఇంటర్నేషనల్ షార్ట్‌ఫెస్ట్‌లో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, ఉత్తమ కామెడీ షార్ట్ అవార్డులు గెలుచుకోవడం ఈ చిత్రానికి ఆస్కార్ అర్హత దిశగా కీలకంగా మారింది. సతీష్ కశ్యప్, దేవేంద్ర దొడ్కే, అరిందొల్ బాగ్చీ కీలక పాత్రల్లో నటించగా.. రాజీవ్ మలు సినిమాటోగ్రఫీ, ప్రళయ్ వలంజు ఎడిటింగ్, యష్ సహాయ్ సంగీతం అందించారు. రానా, నిఖిల్ అద్వానీ అండతో ఈ చిత్రం ఆస్కార్ బరిలో ప్రయాణాన్ని మరింత వేగవంతం చేసింది.
















































