అసిస్టెంట్ డైరెక్టర్ల కష్టాలు తీరేనా?
Assistant directors are still paid low wages in the name of creditతమిళ పరిశ్రమలో తెర వెనుక శ్రమించే దర్శకులు.. అసోసియేట్.. అసిస్టెంట్ డైరెక్టర్ల కనీస వేతనాలను పెంచుతూ తమిళనాడు ఫిల్మ్ డైరెక్టర్స్ యూనియన్ తాజాగా సవరించిన పారితోషికాల జాబితాను ప్రకటించింది. భారీ బడ్జెట్ చిత్రాల నుంచి చిన్న బడ్జెట్ సినిమాల వరకు వివిధ స్థాయిల్లో వారికి వేతనాలను సవరించినా? క్షేత్రస్థాయిలో అమలు చేయడం అంత సులభం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పని గంటలు.. సభ్యత్వ రుసుముల భారం వంటి అంశాలు కొత్త నిబంధనలకు ప్రధాన సవాళ్లుగా నిలుస్తున్నాయని పలువురు దర్శకులు, అసిస్టెంట్ డైరెక్టర్లు పేర్కొంటున్నారు.
కొత్తగా వచ్చే అసిస్టెంట్ డైరెక్టర్లకు ఇప్పటికీ క్రెడిట్ పేరుతో తక్కువ వేతనం లేదా అసలు పారితోషికమే ఇవ్వని పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు హీరోలకు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే నిర్మాతలు అసిస్టెంట్ డైరెక్టర్ల విషయంలో మాత్రం కనీస ఖర్చులు ఇవ్వడానికి కూడా వెనుకాడుతున్నారని, ప్రశ్నిస్తే క్రెడిట్ తొలగించే సందర్భాలు కూడా ఉన్నాయని సూర్యప్రతాప్ వ్యాఖ్యానించారు. యూనియన్ నిబంధనలను కచ్చితంగా పర్యవేక్షించే వ్యవస్థ లేకపోవడం, నిర్మాతలతో దర్శకులకు ఉండే ఒప్పందాలను బట్టే వేతనాలు ఆధారపడి ఉండటం వల్ల పెంపు కాగితాలకే పరిమితమవుతుందేమోనన్న సందేహాలు నెలకొన్నాయి.
మరోవైపు యూనియన్‌లో సభ్యత్వం తీసుకోవడానికి అసిస్టెంట్ డైరెక్టర్లకు 50 వేలు, దర్శకులకు 2 లక్షల రుసుము ఉండటం కొత్తవారికి భారంగా మారుతోంది. ఏడాదికి ఒక్క సినిమా కూడా దొరకని అసిస్టెంట్ డైరెక్టర్లకు ఈ మొత్తం సమకూర్చుకోవడం కష్టంగా ఉందని అయితే సభ్యత్వం లేనివారిని పని చేయకుండా అడ్డుకోమని, వాయిదాల పద్ధతిలో ఫీజు చెల్లించే వెసులుబాటు కల్పిస్తున్నామని ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్.కె. సెల్వమణి స్పష్టం చేశారు. కెరీర్‌లో ఎదిగిన తర్వాత లేదా సినిమాలు హిట్ అయితే పారితోషికం మారుతుందని కానీ ప్రారంభ దశలో ఉన్నవారికి గౌరవప్రదమైన వేతనం అందేలా దర్శకు, నిర్మాతలు కలిసికట్టుగా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
















































