పొగొట్టుకున్న చోటే రాబట్టుకునే ప్రయత్నాల్లో!
Shankar resumes work on Indian 3భారతీయ సినీ పరిశ్రమలో ఎన్నో గొప్ప చిత్రాలను ఆవిష్కరించిన అగ్ర దర్శకుడు శంకర్ ప్రస్తుతం కెరీర్‌లో కీలకమైన దశలో ఉన్నారు. ఒకప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించిన విజనరీ డైరెక్టర్ కొంత కాలంగా రేసులో బాగా వెనుకబడిన సంగతి తెలిసిందే. ఆమధ్య రిలీజ్ అయిన `ఇండియన్ 2` పరాజయంతో ఊహించని విమర్శలు ఎదుర్కొన్నారు. అటుపై `గేమ్ ఛేంజర్` తోనూ విమర్శలు తప్పలేదు. అయితే ఆ పరాజయం నుంచి పక్కకు తప్పుకోకుండా ఎక్కడైతే ప్రతిష్ట దెబ్బతిందో అక్కడే తిరిగి సత్తా చాటుకోవాలని శంకర్ పట్టుదలతో అడుగులు వేస్తున్నారు.
సాధారణంగా ఓ పెద్ద సినిమా ప్లాప్ అయినప్పుడు దర్శకులు ఆ ప్రాజెక్ట్ ఛాయల నుంచి బయటపడి, తదుపరిగా కొత్త కథలు లేదా క్రేజీ కాంబినేషన్లతో ముందుకు వెళ్లాలని చూస్తుంటారు. కానీ శంకర్ మాత్రం ఆ రొటీన్ రూట్‌ను పక్కనపెట్టి ప్లాప్ ముద్ర పడిన కథకు కంటిన్యూటీగా వస్తున్న `ఇండియన్ 3`నే నమ్ముకోవడం గమనార్హం. కొత్త ప్రాజెక్ట్‌ల జోలికి వెళ్లకుండా విమర్శల పాలైన సినిమా సీక్వెల్‌తోనే రేసులోకి దిగడం ఆయన ధైర్యానికి, తన పనితనంపై ఉన్న ఆత్మవిశ్వాసానికి అద్దం పడుతోంది.
`ఇండియన్ 3`ని పూర్తి చేయాల్సిన బాధ్యతగా కాకుండా తానేంటో మరోసారి నిరూపించుకునే సవాలుగా శంకర్ తీసుకున్నారు. `ఇండియన్ 2`లో దొర్లిన లోపాలను, ప్రేక్షకులను నిరాశపరిచిన అంశాలను క్షుణ్ణంగా విశ్లేషించుకుని పార్ట్-3 కంటెంట్‌ను మరింత పదునుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. కమల్ హాసన్ నటనకు తోడుగా, తన మార్క్ విజన్ , ఎమోషన్స్‌ను సమపాళ్లలో జోడించి ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాలనే కసితో శంకర్ పని చేస్తున్నారు.
పోగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలనే ప్రయత్నం శంకర్ కెరీర్‌లోనే అతి పెద్ద పరీక్షగా మారనుంది. ఒక విజనరీ డైరెక్టర్‌గా తనపై ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించుకోవడానికి శంకర్ పడుతున్న తపన నిజంగా ప్రశంసనీయం. మరి ఈ కసితో రూపుదిద్దుకుంటున్న `ఇండియన్ 3` శంకర్‌కు ఆశించిన విజయాన్ని అందించి మళ్లీ సక్సెస్ ట్రాక్‌పైకి తీసుకువస్తుందని ఆశీద్దాం.
















































