భారత ఆర్థిక వ్యవస్థపై డబుల్ ఎటాక్!
Double attack on the Indian economy!గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధర బారెల్‌కు $100 మార్కును తాకడం ఒక సవాలైతే.. అదే సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రూ.95కు పడిపోవడం భారత ఆర్థిక వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. దేశీయ అవసరాల కోసం విదేశీ చమురుపైనే ఎక్కువగా ఆధారపడే భారత్‌కు ఇది రెట్టింపు భారాన్ని మోపుతోంది. ఉదాహరణకు డాలర్ మారకం విలువ రూ.85 ఉన్నప్పుడు బారెల్ చమురుకు రూ.8,500 వెచ్చించాల్సి రాగా, అది రూ.95కు చేరడంతో ఒక్కసారిగా అదనంగా రూ.1,000 చెల్లించాల్సి వస్తోంది.
ఇరువైపులా పెరగడంతో కేవలం పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడమే కాకుండా రవాణా, లాజిస్టిక్స్ ఖర్చులు ఎగబాకి నిత్యావసరాలు, ఆహార ఉత్పత్తులు ప్రియమై ద్రవ్యోల్బణం భయంకరంగా పెరిగే ప్రమాదం ఉంది. ఫలితంగా ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయాలా లేక ఆర్థిక వృద్ధికి ఊతమివ్వాలా అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పాలసీ పరమైన చిక్కుల్లో పడగా... విమానయానం, పెయింట్, టైర్ వంటి ఇంధన ఆధారిత రంగాల షేర్లు స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
అయితే భారత్ వద్ద తగినంత విదేశీ మారక నిల్వలు (ఫోరెక్స్ రిజర్వులు) - అత్యవసర చమురు నిల్వలు ఉన్నందున ఇది వెంటనే పెద్ద ఆర్థిక సంక్షోభానికి దారితీయకపోవచ్చు. కానీ $100 వద్ద చమురు ధరలు సుదీర్ఘకాలం నిలకడగా ఉండి.. రూపాయి పతనం ఇలాగే కొనసాగితేనే అసలైన ముప్పు పొంచి ఉంది.
ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే చమురు దిగుమతులు.. డాలర్‌పై విపరీతమైన ఆధారపడటాన్ని భారత్ క్రమంగా తగ్గించుకోవాలి. ఇంధన రంగంలో పొరుగు పెద్ద దేశాలు ప్రదర్శిస్తున్న చొరవను స్ఫూర్తిగా తీసుకుని.. ప్రత్యామ్నాయ పునరుత్పాదక ఇంధన వనరులను, ఈవీ (EV) వ్యవస్థలను వేగంగా విస్తరించాల్సి ఉంది. భవిష్యత్తులో వచ్చే ఇటువంటి అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనేలా భారతీయ విధానకర్తలు, ఆర్థిక మేధావులు ఎటువంటి సృజనాత్మక వ్యూహాలతో ముందడుగు వేస్తారో వేచి చూడాలి.
















































