చిన్న నిర్మాతల ఆవేదనపై అశోక్ కుమార్ గళం
Ashok Kumar Important Press Meet
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) ప్రస్తుతం పబ్లిక్ ఆఫీస్‌లా కాకుండా కొందరి వ్యక్తిగత అడ్డాగా మారిపోయిందని ప్రముఖ నిర్మాత అశోక్ కుమార్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితాలో లోపాలు, ఆడిటింగ్ లేని ఖర్చులు, చాంబర్ అధ్యక్షుడికే విలువ ఇవ్వని సెక్రటరీల ఆధిపత్యం వల్ల వ్యవస్థ నిర్వీర్యమైపోతోందని ఆరోపించారు.
ముఖ్యంగా చిన్న నిర్మాతలు సినిమాలు తీసి నష్టపోతుంటే.. వారి నుంచి రూ. 2 లక్షలు వసూలు చేస్తేనే సభ్యత్వం ఇస్తామంటూ వేధించడం దారుణమన్నారు. కౌన్సిల్ వద్ద ఉన్న రూ. 12 కోట్లకు పైగా నిధులను సద్వినియోగం చేస్తూ...కష్టాల్లో ఉన్న చిన్న నిర్మాతలకు ఉచిత సభ్యత్వంతో పాటు అత్యవసర వైద్య చికిత్స కోసం రూ. 1 లక్ష వరకు ముందస్తు ఆర్థిక సాయం అందించే పద్ధతి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
నాయకులు ఏం చెప్పినా గుడ్డిగా `ఎస్ బాస్` అని తలఊపకుండా.. స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులే కౌన్సిల్‌కు అవసరమని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. ఇండస్ట్రీలో దాదాపు అందరూ ఆర్థికంగా దెబ్బతిని ఉన్న పరిస్థితుల్లో `ట్రూత్, ట్రాన్స్పరెన్సీ, ట్రస్ట్` (నిజాయితీ, పారదర్శకత, నమ్మకం) ప్రాతిపదికన సేవ చేయడమే తమ ప్యానెల్ ప్రధాన ఆశయమని వెల్లడించారు. కౌన్సిల్‌లోని అక్రమాలను ప్రశ్నిస్తాననే భయంతోనే తనను పోటీ నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని.. అయితే న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నికల బరిలో నిలుస్తున్నానని చెప్పారు.
ప్రచారానికి చాలా తక్కువ సమయం ఉన్నందున... నిర్మాతలందరూ తమ విజ్ఞతతో ఆలోచించి పారదర్శకమైన పాలన అందించే ప్రతినిధులను ఎన్నుకోవాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. నిర్మాతల మండలి ఎన్నికల గురించి ఆసక్తికర చర్చ సాగుతున్న వేళ అశోక్ కుమార్ మీడియా ఎదుట నిలదీయడం చర్చగా మారింది. ఇటీవల బండ్ల గణేష్ పోటీనుంచి వైదొలిగి సి.కళ్యాణ్ ని అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేసారని ప్రచారం సాగినా అశోక్ కుమార్ ట్విస్టు ఊహించనిది.







































