లెజెండరీ కాంబోలో లక్కీ ఛాన్స్!

కమల్ హాసన్ - రజనీకాంత్ కాంబినేషన్ లో భారీ ప్రాజెక్ట్ గా `KH×RK` హైలైట్ అవుతోన్న సంగతి తెలిసిందే.నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంపై తొలి నుంచీ భారీ అంచనాలున్నాయి. అయితే ఇటీవలి రాజకీయ పరిణామాలు - ఎన్నికల ఫలితాల నేపథ్యంలో రెడ్ జెయింట్ మూవీస్ ఈ చిత్రంతో అసోసియేట్ అవ్వడం వల్ల సినిమా భవిష్యత్తుపై కొన్ని అనుమానాలు తలెత్తాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్లే ముందుకు సాగుతోందని సెప్టెంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.
ఈ సినిమాలో కథానాయికగా త్రిషను ఎంపిక చేసే ఆలోచనలో దర్శకుడు నెల్సన్ ఉన్నట్లు బలమైన ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే చిరంజీవితో `విశ్వంభర`, మోహన్ లాల్‌తో `రామ్` వంటి పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తున్న త్రిష ఈ సినిమాలో కూడా భాగమైతే ఆమె కెరీర్ మరో స్థాయికి చేరుకోవడం ఖాయం. రజనీ, కమల్ వంటి దిగ్గజాలతో కలిసి నటించడం అనేది త్రిష కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన ఘట్టంగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్న సినిమాల లైనప్ చూస్తుంటే? దక్షిణాది చిత్రసీమలో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకునేలా కనిపిస్తోంది.
మరోవైపు ఈ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు , ట్రోలింగ్‌కు దారితీస్తుంది. ముఖ్యంగా విజయ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా రజనీకాంత్ -కమల్ హాసన్‌లతో ఉన్న విభేదాల రీత్యా త్రిష ఈ ప్రాజెక్టుకు దూరంగా ఉండవచ్చని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే త్రిష కాస్టింగ్ గురించి గానీ, ఇతర ఊహాగానాల గురించి గానీ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తుది దశలో ఉన్నా యని సమాచారం. ఈ లెజెండరీ హీరోల కలయికలో త్రిష మెరుస్తుందా? లేదా? అన్నది తెలియాలంటే అధికా రిక ప్రకటన వరకు వేచి చూడాల్సిందే.







































