దురంధర్ 3: కొనసాగింపు కథతో కాదా?

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఫ్రాంఛైజీ సినిమాల హవా కొనసాగుతోంది. ఒక సినిమా ఘనవిజయం సాధించినప్పుడు ఆ కథను కేవలం ఒక భాగంతో ముగించకుండా ప్రేక్షకులను అలరించేలా మరిన్ని భాగాలను రూపొందించడంపై దర్శకులు దృష్టి సారిస్తున్నారు. ఇప్పటికే పుష్ప 3 కోసం ప్రణాళికలు సిద్ధమవుతుండగా.. బాహుబలి 3, కేజీఎఫ్ 3, కాంతార 3 వంటి భారీ చిత్రాలు కూడా సెట్స్ పైకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకసారి ఫ్రాంఛైజీ మొదలయ్యాక పాత్రల స్వభావాలను అన్వేషిస్తూనే సరికొత్త కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించడం సాధ్యమని మన దర్శకులు నిరూపిస్తున్నారు. ఇదే బాటలో ఇప్పుడు దురంధర్ 3 కోసం సన్నాహాలు జరుగుతుండటం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
దురంధర్ మొదటి రెండు భాగాలు సాధించిన అపూర్వ విజయం చూశాక.. ఈ ఫ్రాంఛైజీని మరింత ముందుకు తీసుకెళ్లాలని మేకర్స్ నిర్ణయించారు. తాజాగా ప్రముఖ నిర్మాత పాండే మూడో భాగం కథపై లీకులు ఇవ్వడం ఈ అంచనాలను మరింత పెంచింది. ఈసారి దురంధర్ 3 లో ఒక కొత్త తరహా ప్రపంచాన్ని... భిన్నమైన కథనాన్ని సృష్టించబోతున్నట్లు హింట్ ఇచ్చారు. పాత ఛాయలు కనిపించకుండా... సరికొత్త కోణంలో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే దీనికి సంబంధించిన ఒక భారీ సర్ ప్రైజ్ న్యూస్ వెలువడనుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.








































