ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Lawrence Bishnoi gang claims attack on filmmaker Rohit Shetty

ఘోరంగా చంపుతామ‌ని ద‌ర్శ‌కుడికి వార్నింగ్

Lawrence Bishnoi gang claims attack on filmmaker Rohit Shetty

ఈ ఆదివారం ఉద‌యం ముంబై పోలీసుల‌ను ప‌రుగులు పెట్టించే వార్త ఒక‌టి వైర‌ల్ అయింది. బాలీవుడ్ సూపర్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ కి అత్యంత స‌న్నిహితుడైన ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టిని బెదిరిస్తూ, కొంద‌రు దుండ‌గులు అత‌డి ఇంటిపై కాల్పులు జ‌రిపార‌నే క‌థ‌నాలొచ్చాయి. దుండ‌గులు బైక్ పై వ‌చ్చి నాలుగు రౌండ్లు కాల్పులు జ‌రిపార‌ని, అయితే ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రూ ప్రాణాలు కోల్పోలేద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కేవ‌లం ఒక గ్లాస్ విండో లోంచి బుల్లెట్ దూసుకెళ్లిన‌ట్టు ఘ‌ట‌నా స్థ‌లిలో పోలీసులు క‌నుగొన్నారు.

తాజాగా రోహిత్ శెట్టి నివాసం వద్ద జరిగిన కాల్పులకు సంబంధించి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినట్లు సమాచారం అందుతోంది. దీని ప్రకారం.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ కాల్పుల బాధ్యతను స్వీకరిస్తూనే అత్యంత ఘోరమైన హెచ్చరికలు జారీ చేసింది. గ‌తేడాది మ‌ట్టుబెట్టిన‌ బాబా సిద్ధిఖీ (మహారాష్ట్ర మాజీ మంత్రి) కంటే దారుణమైన శిక్ష ఉంటుంది! అని హెచ్చరించారు.

ఈ హెచ్చ‌రిక‌తో రోహిత్ శెట్టిని బెదిరించ‌డానికి కార‌ణ‌మేమిటో అర్థ‌మైంది. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం లేదా ఆయన్ని సపోర్ట్ చేయడమే ఈ దాడికి ప్రధాన కారణమని అంచ‌నా వేస్తున్నారు. రోహిత్ శెట్టి సినిమాల్లో సింగం ఎగైన్ లో సల్మాన్ ఖాన్  చల్బుల్ పాండేగా నటించడం ఈ గ్యాంగ్‌కు ఆగ్రహం కలిగించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ హెచ్చరికతో ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. రోహిత్ శెట్టికి ఇప్పటికే ఉన్న భద్రతను పెంచారు. లారెన్స్ బిష్ణోయ్ పేరుతో వచ్చిన ఆ సోషల్ మీడియా పోస్ట్ ఎక్కడి నుండి వచ్చింది? అది నిజమైనదేనా లేదా అనేది సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం రోహిత్ శెట్టి మాత్రమే కాకుండా, సల్మాన్ ఖాన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే మరికొంతమంది బాలీవుడ్ ప్రముఖులకు కూడా పోలీసులు సెక్యూరిటీని సమీక్షిస్తున్నారు.

సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు, బాబా సిద్ధిఖీ హత్య.. ఇప్పుడు రోహిత్ శెట్టి నివాసం వద్ద కాల్పులు జరగడం చూస్తుంటే, బిష్ణోయ్ గ్యాంగ్ తన టార్గెట్‌ను మరింత విస్తృతం చేస్తున్నట్లు కనిపిస్తోంది. షూటింగ్‌లు జరిగే చోట కూడా భద్రతపై నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు. అయితే జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్, తన అనుచరుల ద్వారా ఈ దాడులను చేయిస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇది కేవలం భయపెట్టడానికా లేదా పక్కా ప్లాన్ తో చేస్తున్న దాడులా అన్నది తేలాల్సి ఉంది. ప్ర‌స్తుతానికి ముంబై పోలీసుల‌కు కంటిమీద కునుకు క‌రువైంది.

Wait And Watch - Lawrence Bishnoi Gang Warns After Rohit Shetty House Firing

lawrence bishnoi