గాయకుడిపై FIR.. పోలీసులకు సుదీర్ఘ లేఖ

ప్రముఖ గాయకుడు సోను నిగమ్ పరిచయం అవసరం లేదు. అతడు హిందీ చిత్రసీమతో పాటు, తెలుగు, కన్నడం, తమిళంలో చెప్పుకోదగ్గ పాటలు పాడారు. అన్ని మెట్రోల్లో, పలు రాష్ట్రాల్లో అతడి లైవ్ మ్యూజిక్ కాన్సెర్టులకు మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ సోను నిగమ్ ఊహించని వివాదంలో చిక్కుకున్నారు. బెంగళూరులో ఇటీవల జరిగిన ఒక సంగీత కచేరీలో సోను నిగమ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. అభిమానిని పహల్గామ్ టెర్రరిస్టుతో పోల్చడమే గాక, కన్నడ భాషను అవమానించాడని అతడిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అతడిపై పోలీసులు ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసారు. ఈ నేపథ్యంలో సోను ఇప్పుడు అధికారిక వివరణ ఇచ్చారు. ఈ వివాదం 25 ఏప్రిల్ 2025న ఈస్ట్ పాయింట్ కళాశాలలో ఘటనతో ముడిపడినది. ఒక అభిమాని కోరిక మేరకు కన్నడ పాటను పాడేందుకు సోను నిరాకరించాడని, పైగా అభిమానిపై దురుసుగా మాట్లాడుతూ పహల్గామ్ ఉగ్రవాదితో పోల్చాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఈ సంఘటన తర్వాత కర్నాటక- అవలహల్లి పోలీసులకు ఫిర్యాదు అందింది. సోను నిగమ్‌కు పీఎస్ నుంచి అధికారిక నోటీసు జారీ చేశారు. వారంలోపు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ అయ్యాయి. అయితే ఈ ఘటనపై స్పందించిన సోను నిగమ్ తనను తాను డిపెండ్ చేసుకునేందుకు ప్రయత్నించారు. అతడు తన వెర్షన్‌ను అందిస్తూ ఒక వివరణాత్మక ప్రకటనను సోషల్ మీడియాలలో పోస్ట్ చేశారు.
కర్ణాటకలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాష, సంస్కృతి, సంగీతం, సంగీతకారులను గౌరవిస్తానని సోను నిగమ్ తన ప్రకటనలో తెలిపారు. తన హిందీ కచేరీ కంటే కూడా తన కన్నడ పాటలను తాను ఎంతో గౌరవిస్తానని ఆయన నోట్ లో రాసారు. రాష్ట్రంలో తాను ప్రదర్శన ఇచ్చినప్పుడల్లా గంటకు పైగా కన్నడ పాటలను ప్రతిసారీ సిద్ధం చేస్తానని నిగమ్ తెలిపారు. అయితే కచేరీ సమయంలో తనను ఒక అభిమాని అవమానించాడని, కొడుకు వయసున్న చిన్న వ్యక్తి తనను బెదిరించాడని సోను నిగమ్ ఆరోపించారు. నేను అవమానం భరించేంత చిన్నవాడిని కాదు. నా జీవితంలో సెకండాఫ్‌లో ఉన్నాను. నాకు 51 సంవత్సరాలు. నా కొడుకు లాంటి చిన్నవాడు వేలాది మంది ముందు నేరుగా భాష పేరుతో నన్ను బెదిరించినందుకు కోపం వచ్చింది. నిజానికి కన్నడ నా రెండవ భాష. అది కూడా నా మొదటి కచేరీ పాట తర్వాత! అతడు మరికొందరిని రెచ్చగొట్టాడు. అక్కడ సొంత మనుషులు సిగ్గుతో అతడిని నోరు మూసుకోమని అడిగారు. అయితే అభిమానుల అభ్యర్థనకు తాను మొదట `మర్యాదగా ప్రేమగా` స్పందించానని, కచేరీ ఇప్పుడే ప్రారంభమైందని, వారిని నిరాశపరచనని హామీ ఇచ్చానని పేర్కొన్నాడు. తాను హామీ ఇచ్చినప్పటికీ ఆ వ్యక్తులు గొడవ సృష్టించాలని ప్లాన్ చేసారని, తనను విపరీతంగా బెదిరించారని ఆయన అన్నారు. నేను దేశభక్తుడిని కాబట్టి, భాష, కులం లేదా మతం పేరుతో ద్వేషాన్ని సృష్టించడానికి ప్రయత్నించే ఎవరినైనా ద్వేషిస్తాను అని అన్నారు.
కర్నాటక రక్షణ సంఘాలు సోనుపై పోలీస్ కేసు పెట్టాయి. గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే వ్యాఖ్యలు చేసినట్లు సోను నిగమ్‌పై ఫిర్యాదులో ఆరోపించారు. గాయకుడిని సమన్లు జారీ చేయడంతో పాటు సంఘటన జరిగిన ఈవెంట్ నిర్వాహకులకు నోటీసు జారీ చేసే ప్రక్రియలో కూడా ఉన్నామని పోలీసులు పేర్కొన్నారు. సెక్షన్ 352 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో అవమానించాడు) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు అయింది. ప్రస్తుతం అలాగే కన్నడ ఫిలింఇండస్ట్రీ అనధికారిక నిషేధాన్ని సోనుపై విధించింది. అతడిపై సహాయ నిరాకరణ అమల్లో ఉంది.
Sonu Nigam addresses FIR filed over his Pahalgam remark at a Bengaluru concert
FIR against singer.. Long letter to police







































