మహా అయితే మన ప్రధానమంత్రి నరేంద్రమోదీని హతమార్చాలని ఏ పాకిస్థాన్ ఉగ్రవాదులో లేక ముస్లిం తీవ్రవాదులో ఆలోచిస్తారుగానీ నక్సలైట్లు ప్రధాని మోదీని హత్య చేయాలని స్కెచ్ వేశారని వస్తున్న వార్తలు నమ్మశక్యంగా లేవు. మోదీ హత్యకు పూణెలో కుట్ర జరిగిందని అంటుంటే ఇదంతా ఎన్నికల ముందు మోదీ ప్రజాసానుభూతి పొందేందుకు వేసిన ఎత్తుగడ అంటున్నారు. ఇక విషయానికి వస్తే మోదీని హత్య చేసేందుకు ఓ ముఠా వ్యూహ రచన చేసిందని పూణే పోలీసులు ఓ కుట్రను బయటపెట్టారు. నిషేధిత మావోయిస్టు పార్టీలతో సంబంధం ఉన్న ఐదు మందిని అదుపులోకి తీసుకుని, వీరిలో ఒకరి నివాసం నుంచి ఓ లేఖను సీజ్ చేశామని పోలీసులు స్థానిక సెషన్స్ కోర్టుకి తెలిపారు.
దీని ఆధారంగా రాజీవ్‌గాంధీని హతమార్చిన విధంగానే మోదీని కూడా చంపాలని వీరు వ్యూహాలు రచించారని పూణే పోలీసులు అంటున్నారు. ఈ ఐదుగురిలో ముంబైకి చెందిన సుధీర్ దవాలే, ఢిల్లీకి చెందిన రోనా జాకబ్, నాగపూర్‌కి చెందిన న్యాయవాది సురేంద్ర గండ్లింగ్, షోమాసేన్, మహేష్‌రావత్‌లు ఉన్నారు. వారిని కోర్టు కస్టడీకి అంగీకరించింది. నిందితుల్లో రోనా జాకబ్ నివాసం నుంచి ఈ ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నామని పూణే పోలీసులు చెబుతున్నారు. అందులో ఎం-4రైఫిల్స్, నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేసేందుకు 8కోట్లు అవసరమని, ఈ లేఖలో రాజీవ్‌గాంధీ హత్యకి సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయంటున్నారు.
అయితే నిందితుల తరపు న్యాయవాదులు సైతం ఇందులో తమ వారి తప్పేమీలేదని, వారు నిర్ధోషులని అంటున్నారు. ఇక ఇందిరాగాంధీ హత్యకు వస్తే స్వర్ణదేవాలయంలో ఆపరేషన్ చేసిన కారణంగా సిక్కులు పగబట్టి ఆమె ప్రాణాలు తీశారు. రాజీవ్‌గాంధీ విషయానికి వస్తే ఆయన శ్రీలంకలోని ఎల్టీటీఈకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు హత్యకావింపబడ్డాడు. మరిమోదీని హతమార్చాలని చూసిన వారు మోదీని ఎందుకు చంపాలని భావించారు? అనే ప్రశ్నఉదయించకమానదు.